ఆ చివరన ఉన్న హిందూపురం.. ఈ చివరన ఉన్న భీమిలి వరకు.. అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ సమన్వయకర్తలెవరూ ధీమాగా లేరు. కనీసం అరవై నుంచి 70 మంది సమన్వయకర్తలకు అదే పరిస్థితి దారుణంగా ఉంది. టిక్కెట్ వస్తుందో రాదో తెలియని పరిస్థితి. ఎవరు కొత్తగా పార్టీలో చేరినా ఉలిక్కి పడుతున్నారు. ఒక్కో చోట… ఇద్దరు ముగ్గురు సమన్వయకర్తలను కూడా మార్చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు వారందరికీ ఏమైనా గ్యారంటీ ఉందా… అంటే అదీ లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి… పూర్తిగా ఒకే మిషన్ మీద గురి పెట్టారు. తెలుగుదేశం పార్టీ నేతలు.. ఎవరు వచ్చినా చేర్చేసుకుని టిక్కెట్లు ఇవ్వడం ప్రారంభించారు. వారంతట వారు రావడం వేరు.. ఇతర మార్గాల ద్వారా ఒత్తిడి తెచ్చి టిక్కెట్లు ఇచ్చి మరీ పార్టీలోకి తీసుకోవడం వేరు. ఆ పద్దతిని కూడా.. జగన్ ఫాలో అవుతున్నారు. ఇలా… ఇప్పటి వరకూ ఉన్న సమన్వయకర్తలకు.. జగన్ ఎప్పటికిప్పుడు హ్యాండ్ ఇస్తూ.. కొత్త వారిని పార్టీలో చేర్చేసుకుంటున్నారు.
రాజంపేటలో..వైసీపీ పెట్టినప్పటి నుంచి తనతో పాటు నడిచిన అమరనాథరెడ్డికి మొండి చేయి చూపిన.. జగన్మోహన్ రెడ్డి… టీడీపీ నుంచి గెలిచిన మేడా మల్లిఖార్జునరెడ్డిని పార్టీలో చేర్చుకుని అవకాశం ఇచ్చారు. ఆ పరంపర అలా సాగుతోంది. హిందూపురంలో అబ్దుల్ ఘనీ, విజయవాడలో యలమంచిలి రవి, నెల్లూరులో ఆనం రామనారాయణరెడ్డి, ప్రకాశంలో.. మాగుంట శ్రీనివాసులరెడ్డి, పశ్చిమగోదావరి రఘురామకృష్ణం రాజు, తూర్పుగోదావరిలో తట నరసింహం కుటుంబం, విశాఖలో దాడి వీరభద్రరావు కుటుంబం.. ఇలా… కొత్తగా వచ్చే నేతల్ని చేర్చుకుని.. అంతకు మించిన నేతలు దొరకరకన్నట్లుగా.. టిక్కెట్లు ప్రకటిస్తున్నారు. వీరే కాదు.. హైదరాబాద్ లో నివాసం ఉంటూ.. ఏపీలో సొంత నియోజకవర్గం అంటూ లేకుండా.. దశాబ్దాల పాటు రాజకీయంగా దూరంగా ఉన్న వారిని కూడా పిలిచి… మెడలో కండువా కప్పేస్తున్నారు. వారికి టిక్కెట్లిస్తారో లేదో క్లారిటీ లేదు కానీ.. వీరిని పరిగణనలోకి తీసుకుంటే.. మరింత మంది సమన్వయకర్తలు త్యాగాలు చేయక తప్పదు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చిన అన్ని కార్యక్రమాలను.. నియోజకవర్గ సమన్వయకర్తలు నిర్వహించారు. పార్టీ తరపున ఎలాంటి సాయం రాకపోయినప్పటికీ.. సొంత ఖర్చులతో నిర్వహించుకున్నారు. కార్యాలయాల ఖర్చుకూడా.. చివరికి సమన్వయకర్తలదే. ఓడిపోయినా.. భవిష్యత్ పై ఆశతో… వారంతా ఆస్తులు అమ్మి.. అప్పులు చేసి పార్టీ కార్యక్రమాలను నిర్వహించారు. ఇప్పుడు.. అవకాశం లేదనడంతో.. వారంతా హతాశులవుతున్నారు. అందుకే.. నియోజకవర్గాల్లో.. ఆ పార్టీ నేతలు ప్రచార కార్యక్రమాలు ప్రారంభించడం లేదు. టిక్కెట్లు మీకే అని జగన్ స్వయంగా చెప్పినప్పటికీ చాలా మంది నమ్మడం లేదు. గతంలోనూ.. అలాగే చెప్పి… హ్యాండిస్తారేమో.. ఖర్చు పెట్టుకుని ఖర్చయిపోతామేమో అని ఆందోళన చెందుతున్నారు.