మనకు వ్యవస్థ మీద అపనమ్మకం. కళ్ళ ముందు కనపడుతున్న ఆర్థిక అసమానతల మీద కోపం. సంవత్సరాల తరబడి సాగే కోర్ట్ కేసుల మీద అసహనం. హేతుబద్దంగా ఆలోచించడం, abstract ideas అవలోకనం చేసుకోవడం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. ఇలాంటి పరిస్థితుల్లో లక్ష కోట్లు అవినీతి సొమ్ము గురించి ఆరోపణలు చేసింది తెలుగు దేశం. వాటిని తాటికాయ అంత పెద్ద పెద్ద అక్షరాలతో రాసిందే రాసి, రంగు రంగుల పేజీలలో రాశాయి తెలుగుదేశం అనుకూల పత్రికలు. అంతే, తెలుగు ప్రజలకు అప్పటి వరకు పేరుకు పోయిన frustration కు ఒక మానవ రూపం దొరికింది. దాన్ని ద్వేషించటం మొదలు పెట్టారు. ఆ మానవ రూపం పేరు జగన్.
జగన్ మద్దతుదారులు “ఎవరు మాత్రం తినటం లేదు?” అని బహిరంగంగా సమర్ధించుకోవడం ఆక్షేపణీయం. ప్రమాదకరం.
ఈ వ్యాసం ఉద్దేశం జగన్ నిజాయితీపరుడు అని తీర్పు చెప్పడం కాదు. ఆ అర్హత నాకు లేదు.
ఈ వ్యాసం ఉద్దేశం జగన్ నిజాయితీపరుడు అని వాదించడం కాదు. అందుకు పూర్తి ఆధారాలు నా వద్ద లేవు.
కేవలం…సమాజం యొక్క ఆలోచన విధానాన్ని విశ్లేషించుకోవడం, మూస ధోరణి లో కొట్టుకుపోతూ indisputable facts ను కూడా సమాజం ఎలా చూడలేకపోతుందో వివరించే ఉద్దేశం.
2004 లో జగన్ ఆస్తులు ఎంత?
ఈ వార్తా కథనం ప్రకారం అతని ఆస్తులు 10 లక్షలు. ఆ సమాచారానికి మూలం ఏమిటనేది ప్రస్తావించలేదు.
ఇండియా టుడే కథనం మాత్రం ఏ సమాచారాన్ని ఆధారం చేసుకొని ఆస్తులు విలువ కట్టారు అనేది ప్రస్తావించారు.
Income tax returns లో వార్షిక వ్యక్తిగత ఆదాయ విషయాలు ఉంటాయి.మొత్తం కుటుంబ ఆస్తులు, కొడుకు ఆస్తులు IT returns ద్వారా తెలుసుకునే అవకాశం ఉందా?
ఈ కథనం లో “Jagan’s declared assets were Rs 1.7 crore in 2004” అని రాసారు. 2004 లో జగన్ ఎన్నికలలో పోటీ చెయ్యలేదు. మరి ఏ సందర్భం లో declare చేసాడు? అనేది తెలియదు. వైస్సార్ ఎన్నికల అఫిడవిట్ లో డిక్లేర్ చేశారా? అప్పటికే జగన్ మేజర్, సండూర్ కంపెనీ 1998 నుంచి నడుపుతున్నాడు. Dependent కాదు.
నేను చెప్పాలి అనుకున్నది ఏమిటంటే ఒక వార్త చదివినప్పుడు మనం ఇంత వివరంగా ఆలోచిస్తున్నామా? కనీసం ఎదుటి వ్యక్తి మీద తీవ్రమైన అభిప్రాయం ఏర్పరుచుకునే ముందు అయినా వాకబు చేస్తున్నామా?
పెట్టుబడులు వచ్చాయి. దాన్ని కాదనటం లేదు. అవి అక్రమమా, సక్రమమా, లంచమా అనేది కోర్ట్ తేల్చుతుంది. కోర్ట్ మాత్రమే తేల్చగలుతుంది. ప్రజా ప్రతినిధులకు సంబంధించిన కేసుల పరిష్కారం వేగవంతం చెయ్యాలనే సుప్రీం కోర్ట్ సూచన మేరకు సిబిఐ స్పెషల్ కోర్ట్ వారాంతర వాదనలు వింటున్నారు.
తెలుగుదేశం పార్టీ, “ఆ రెండు పత్రికలు” లక్ష కోట్ల దోపిడీ జరిగింది అని ఆరోపణలు చేశారు. ఇప్పటికీ ఆ ఆరోపణలకు కట్టుబడి ఉన్నారా? సిబిఐ పదకొండు ఛార్జిషీట్లు ధాఖలు చేసి 1,172 కోట్ల రూపాయల లంచం పెట్టుబడుల రూపం లో వచ్చింది అనే ఆరోపణలు చేసింది. మిగిలిన 98,828 కోట్లు తిరిగి రాబట్టేందుకు రాష్ట్రం లో అధికారం వెలగబెట్టిన తెలుగు దేశం ఎలాంటి చర్యలు తీసుకుంది?
వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలు ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ గృహాలు, ఫీజు రీయింబర్సుమెంట్, జలయజ్ఞం ఇలా ప్రతి పథకం లో విపరీతమైన అవినీతి జరిగిపోయింది అని గగ్గోలు పెట్టిన తెలుగుదేశం అధికారం లోకి వచ్చాక కూడా ఎందుకు ఆ ఆరోపణలపై విచారణ జరపలేదు? వారు చెప్పే అవినీతి సొమ్మును అవినీతి పరుల దగ్గర నుంచి వసూలు చేసే బాధ్యత మరిచిపోయారా? లెక్కలు చూసుకొని “అవినీతి జరగలేదు” అని సమాధానపడ్డారా? “అడ్డగోలు ఆరోపణలు చేసి వ్యక్తిత్వాలను దెబ్బతీశాము, రాజకీయ లక్ష్యాలు నెరవేర్చుకున్నాము” ఎవరికీ జవాబు చెప్పాల్సిన పని లేదు అనుకున్నారా?
తీర్పులు
విచారణ జరిగినన్ని రోజులు తెలుగుదేశం అనుకూల మీడియా సంస్థలు విపరీతమైన హడావిడి చేశారు. ఇదే మీడియా సంస్థలు జగన్ అక్రమాస్తుల కేసులకు సంభందించి వివిధ IAS అధికారులకు ఉపశమనం కలిగించే హైకోర్టు తీర్పులను మాత్రం పట్టించుకోలేదు.
మార్చ్ 9 2018
ED appellate తీర్పు.
పెన్నా సిమెంట్స్ సాక్షి లో పెట్టిన 45 కోట్ల పెట్టుబడులలో 9.4 కోట్లు కేసుకు సంబంధించినవి కాకపోవటం చేత ఆ మేరకు సవరణలు చేసింది. ఆరోబిందో కేసులో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది – “21.5 కోట్లు లబ్ది పొందడానికి 29.5 కోట్లు లంచం ఎవరన్నా ఇస్తారా?” అని ప్రశ్నించింది. 29.5 కోట్లు ED సాక్షి సంస్థకు విడుదల చేసింది.
ఆగస్ట్ 11 2017
లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసు B. Sam Bob పిటిషన్ పై హైకోర్టు తీర్పుsigning of MoA was in tune
- with the state’s business rules and industrial promotional policy
- several safety clauses like resumption of land in the event of project not coming up
ఫిబ్రవరి 4 2019
ఇండియా సిమెంట్స్ కేసుకు సంబంధించి Adityanath Das పిటిషన్ పై హైకోర్టు తీర్పు
- CBI had to get more information than depend on dates of allotment of water and India Cements’ investments
జూన్ 18 2014
ఇందు టెక్ జోన్ కేసుకు సంబంధించి Ratna Prabha పిటిషన్ పై హైకోర్టు తీర్పు
పిటిషనర్ చేసిన ఈ కింది వాదనలతో కోర్ట్ ఏకీభవించింది
- Everything was done as per procedure
- CBI acted ‘without jurisdiction and verifying the facts at the ground level’
జనవరి 9 2015
పైన చెప్పుకున్న హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు
జూన్ 3 2017
దాల్మియా సిమెంట్స్ కేసులో Sri Lakshmi పైన మోపిన కొన్ని సెక్షన్స్ నుండి మినహాయింపు ఇస్తూ హైకోర్టు తీర్పు ఓబులాపురం మైనింగ్ కంపెనీ సంబంధించి ఉన్న కేసులో జగన్ ను విచారించారు. జగన్ పేరు OMC చార్జిషీట్ లో చేర్చలేదు. అలాగే OMC నుంచి పెట్టుబడులు జగన్ కంపెనీలలోకి వచ్చినట్టు అక్రమాస్తుల కేసులో చార్జిషీట్ వెయ్యలేదు. ఇవి రెండు వేరు వేరు కేసులు.
జనవరి 22 2019
సరైన అనుమతులు లేకుండా B P Acharya కేసును ED విచారణ చేయడాన్ని తప్పుబట్టిన హైకోర్టు తీర్పు. ఈ కేసుకు సంబంధించి CBI అనుమతి తీసుకుంది. ఇదే అధికారి A1 గా ఉన్న Emmar-MGF కేసులో మాత్రం కేంద్రం అనుమతి నిరాకరించింది.
మార్చి 18 2016
ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్ ను వ్యక్తిగతంగా కేసులో చేర్చడాన్ని తప్పుబట్టిన హైకోర్టు తీర్పు జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడి పెట్టిన శ్రీనివాసన్, నిమ్మగడ్డ ప్రసాద్ లాంటి వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి భయబ్రాంతులకు గురి చేసి జగన్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించాలని CBI ఎత్తుగడ అనేది నా అభిప్రాయం.
వీరే కాకుండా నోటీసులు అందుకున్న ఇతర IASఅధికారులు Manmohan Singh S.N. Mohanty, M. Samuel విషయం లో హైకోర్టు స్టే విధించింది.
కొందరి విషయం లో అనుమతి పొంది విచారణ చేసిన CBI, కొందరి విషయం లో అనుమతి లేకుండా లోపభూయిష్టంగా విచారణ జరిపింది. యూపీఏ అధికారంలో ఉంది, కింది కోర్ట్ నుంచి సుప్రీం కోర్ట్ వరకు జగన్ బెయిల్ నిరాకరించి దర్యాప్తు సంస్థలకు కావాల్సిన స్వేచ్ఛ, అధికారాలు ఇచ్చారు. అయినా కూడా ఇంత నాసిరకమైన నేర పరిశోధన ఎవరి మెప్పు కోసం?
నా ఆలోచన
లంచం అనేది రెండు సందర్భాలలో ఇస్తారు.అన్ని అర్హతలు ఉన్నా కూడా ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేసేవారు బెదిరించి, ఇబ్బంది పెట్టి లబ్దిదారుడి నుంచి వసూలు చేసినప్పుడు రూల్స్ బ్రేక్ చేసి ప్రభుత్వానికి నష్టం చేకూరేలా లబ్దిదారుడితో కుమ్మక్కు అయినప్పుడు మొదటి కేటగిరీ ఆరోపణలు లబ్ధిదారుడి నుంచి వస్తాయి. జగన్ పైన కేసులు పెట్టుబడిదారులు ఇఛ్చిన సమాచారం, ఫిర్యాదు మేరకు పెట్టినవి కావు. పెట్టుబడిదారులు “జగన్ ఒత్తిడి కారణం చేతనే పెట్టుబడులు పెట్టాము” అనే వాంగ్మూలం CBI విచారణ లో ఇఛ్చినట్లు వార్తలు రాలేదు. తీర్పు వెలువడిన రోజు తెలుస్తుంది.
రెండో కేటగిరి ఆరోపణలు నిరూపించడానికి documentary evidence ఉంటుంది. ప్రభుత్వం తరుపున అప్పటి ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, అధికారులు కానీ తప్పు చేసినట్టు నిరూపణ జరిగాకే ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల మధ్య జరిగిన ఆర్ధిక లావాదేవీలు లంచమా? కాదా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ప్రభుత్వ నిర్ణయాలు చట్ట వ్యతిరేకంగా జరిగాయా లేదా అనేది ప్రాధమికం.
ప్రభుత్వ నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు, ప్రభుత్వంతో లావాదేవీలు జరిపే సంస్థలతో ప్రయివేట్ వ్యాపారాలు చెయ్యడం కరెక్టా?
అనైతికం. చట్ట వ్యతిరేకం కాదు. ప్రభుత్వ ఉద్యోగులు, వారి సంబంధీకులు ప్రభుత్వంతో కలిసి పనిచేసే వ్యాపార సంస్థలతో ప్రైవేట్ వ్యాపారాలు చెయ్యడం సర్వీస్ రూల్స్ నిషేదిస్తాయి. ఇలాంటి షరతు ప్రజాప్రతినిధులకు కూడా వర్తింపజేస్తే ఈ సమస్య పరిస్కారం అవ్వొచ్చు.
ఈ ఆరోపణల్లో చాలా వరకు భూ కేటాయింపులకు సంబంధించినవి. ఆ భూములు ఏమీ ప్రయివేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తూ రాసిచ్చినవి కాదు. ఏదో ఒక ప్రాజెక్ట్ development కోసం ఇచ్చినవి. ఆ ప్రాజెక్ట్ నిర్థిష్ట కాలం లో పూర్తి చెయ్యలేకపోతే సదరు సంస్థ నుంచి తిరిగి తీసుకునే వెసులుబాటు అగ్రిమెంట్ లో ఉంటుంది. ఉండాలి.
అసలు సమస్య పారదర్శకత లోపం – ఈ ప్రాజెక్ట్ ఫలానా కంపెనీకే ఎందుకు ఇస్తున్నారు? terms & conditions ఏంటి అనేది పారదర్శకంగా లేకపోవడం వల్లే ఆ కేటాయింపులు రూల్స్ పాటించి చేశారా? అతిక్రమించి చేశారా? అని తేల్చడానికి CBI రెండు సంవత్సరాలు కష్టపడాల్సి వస్తోంది.
తరువాతి ప్రభుత్వాలు కూడా ఈ root cause ను విస్మరించాయి. పారదర్శక తీసుకురావడానికి ఎటువంటి ప్రయత్నాలు చెయ్యలేదు. ఇందుకు చక్కటి ఉదాహరణ:
నవంబర్ 2018 లో ఆంధ్ర ప్రభుత్వం తిరుపతి దగ్గరలోని 200 ఎకరాల భూమి మెడికల్ ఎలక్ట్రానిక్స్ పార్క్ డెవలప్ చెయ్యడం కోసం మూడు సంస్థలు కలిసి ప్రారంభించిన Mages-AP అనే కంపెనీకి అప్పజెప్పడం.ఈ సంస్థలకే ఎందుకు ఇచ్చారు? ఎలాంటి జాగ్రత్తలు MoU లో పొందుపరిచారు అనే వివరాలు పౌరులకు అందుబాటులో లేవు. RTI కి సమాధానం ఇవ్వలేదు. First appeal చేసి ఉన్నాము.
జగన్ ఆస్తులు ( ఎన్నికల అఫిడవిట్ ఆధారంగా )
2009 : 77 కోట్లు
2011 :356 కోట్లు
2014 :416 కోట్లు
2011 నుండి 2014 వరకు జగన్ తండ్రి అధికారంలో లేడు. 16 నెలలు బెయిల్ దొరకక జైలు లో ఉన్నాడు.చాలా వరకు ఆస్తులు అటాచ్ అయి ఉన్నాయి. ఆ రెండు సంవత్సరాల మధ్య కూడా ఆస్తుల విలువ పెరగటం మనం గమనించాలి. ఈ లాజిక్ వాడి 2004-2009 మధ్య పెరిగిన ఆస్తులు సక్రమమే అని తీర్మానించలేము.
పారదర్శక లోపం, కుటుంబంలో వ్యక్తి ఆస్తులు పెరగడం – ఖచ్చితంగా అనుమానించాల్సిన విషయమే. దర్యాప్తు చేసి తప్పు ఒప్పులు ప్రజల ముందు ఉంచాల్సిందే. ఈ సూత్రాన్ని అందరికీ సమానంగా వర్తింపజేస్తున్నామా?
అమరావతి ప్రాజెక్ట్ స్విస్ ఛాలెంజ్ పద్ధతిని ఉదాహరణగా తీసుకుందాం. చట్ట ప్రకారం Infrastructure Development Authority (IDA) పరిశీలించి, ఆమోదం తెలిపిన ప్రాజెక్టులకు ఈ పద్ధతి అనుసరించాలా వద్దా అనే నిర్ణయం కాబినెట్ తీసుకోవాలి. కానీ ఇక్కడ ఆలా జరగలేదు. కాబినెట్ నిర్ణయం తీసుకున్న ఆరు నెలల తర్వాత IDA వద్దకు ఫైల్ పంపించారు. హైకోర్టు లో ఈ అంశం చర్చకు రాగానే ఆ నోటిఫికేషన్ వెనక్కి తీసుకొని, చట్టం లో సవరణలు చేసి IDA అధికారాలు నామమాత్రం చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. 45 రోజులు గడువు ఇచ్చారు పోటీ బిడ్ దాఖలు చెయ్యడానికి.
పోటీ ఉండడం వల్ల వినియోగదారుడు లాభపడతారు అనేది క్యాపిటలిజం లో ప్రాధమిక సూత్రం. 1691 ఎకరాల రాజధానిని 15 సంవత్సరాలపాటు నిర్మించే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ విషయం లో original proposer కు పోటీగా బిడ్ వెయ్యడానికి ఒక్క సంస్థ కూడా ముందుకు రాలేదు. అంతర్జాతీయ స్థాయి లో బిడ్డింగ్ నిర్వహించినా ప్రపంచవ్యాప్తంగా ఒక్క కంపెనీ కూడా పోటీ పడలేదు. ఈ విషయాన్ని GO 179 లో పేర్కొన్నారు. మన ముఖ్యమంత్రి ప్రపంచ దేశాలు చుట్టడానికి, సదస్సుల్లో పాల్గొనడానికి చాలా ఖర్చు చేశారు. కానీ ఒక్క కంపెనీ కూడా పోటీ బిడ్ వేసేలా ప్రయత్నాలు చెయ్యలేదు, ప్రోత్సహించలేదు. సింగపూర్ కంపెనీలతో లోపాయికారీ ఒప్పందం ఉందనే అనుమానం తో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు టైం వేస్ట్ యవ్వారాలు అనుకొని ఇటు వైపు చూడనేలేదా?
సింగపూర్ కంపెనీలకు 52 శాతం వాటా, ఆంధ్ర ప్రభుత్వానికి 48 శాతం వాటా ఉండటం కూడా “ఇది ఎవరి రాజధాని?” అని ఆలోచింపజేస్తుంది. ప్రాజెక్ట్ అప్పగించే సమయం లో ప్రభుత్వం తన వాటాగా భూమి, 222 కోట్లు ఇస్తే సరిపోతుంది. మిగిలిన 3,068 కోట్ల పెట్టుబడి సింగపూర్ కంపెనీలు పెడతాయి అని చెప్పారు. సంవత్సరం తిరిగేలోపు CRDA ఓపెన్ మార్కెట్ లో sovereign బాండ్లు సాధారణంగా ఇచ్చే వడ్డీ కంటే అధిక వడ్డీ చెల్లించడానికి ఒప్పుకుంటూ 10,000 కోట్లు బాండ్లు రూపంలో అప్పు ఎందుకు చేయాల్సివచ్చింది?
2017 లో లోకేష్ MLC ఎన్నిక అఫిడవిట్ లో డిక్లేర్ చేసిన ఆస్తులు 369 కోట్లు(self + spouse + dependent). పోల్చి చూడటానికి ఇంతకు ముందు ఆస్తులు ఎంత అనే సమాచారం అందుబాటులో లేదు.
2014లో చంద్రబాబు ఎన్నికల అఫిడవిట్ లో డిక్లేర్ చేసిన ఆస్తులు 176.8 కోట్లు (self + spouse)
2018 సెప్టెంబర్ నాటికి నారా భువనేశ్వరి గారి ఆస్తులు 1200 కోట్లు (భారతదేశం లోనే 92వ ధనిక మహిళ)
CBI కేవలం రాష్ట్ర ప్రభుత్వ కోరిక మేరకు లేదా కోర్ట్ ఆదేశాల మేరకు మాత్రమే విచారణ చెయ్యగలదు. రాబోయే రాష్ట్ర ప్రభుత్వం కానీ, కోర్టు ఆదేశాల వల్ల కానీ భవిష్యత్తులో CBI విచారణ మొదలు పెడితే, పైన చెప్పుకున్న సూత్రానికి తల ఊపిన ప్రజాస్వామ్యవాదులు, అనుమానాలు నివృత్తి చేసుకునే అవకాశం దొరికింది, పాలు నీళ్లు వేరు చేసి ప్రజల ముందు ఉంచే అవకాశం అని సంతోషపడతారా? యధావిధిగా “రాష్ట్రం పైన దాడి, రాజకీయ కక్ష సాధింపు” అంటూ తెలుగుదేశం పార్టీ ఎత్తుకునే పల్లవినే ఎత్తుకుంటారా?
నేను పైన చెప్పిన ఇంకో పాయింట్ – “ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల మధ్య జరిగే వ్యాపార లావాదేవీలు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి తీసుకురావడానికి వారిలో ఒకరు ప్రభుత్వం నుంచి అనుచిత లబ్ది పొందినట్లు కానీ,బెదిరింపులకు పాల్పడినట్లు కానీ నిరూపించడం ప్రాధమిక అవసరం”. ఇందుకు ఇంకో ఉదాహరణ చెప్పుకుందాం.
లింగమనేని రమేష్ తన భూమిని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఎటువంటి ఒత్తిడి లేకుండా ఇష్టపూర్వకంగా సాధారణంగా అందరిలాగే మార్కెట్ రేట్ చెల్లించి కొంటే వేలెత్తి చూపే అవకాశం ఉండేది కాదు. ప్రభుత్వం సూచించే కనీస ధరకు కొనడం అనేది కూడా చట్టరీత్యా తప్పుబట్టే చర్య కాదు.
లింగమనేని రమేష్ కు inside information ద్వారా రాజధాని సరిహద్దులు ముందే తెలిసి భూముల రేట్లకు రెక్కలు రాకముందే కొనిపెట్టుకున్నాడు అని ఆరోపణలు ఉన్నాయి.
సాధారణంగా మనం స్థిరాస్థులు కొనే ముందు లింక్ డాక్యూమెంట్లు చూసుకొని కొనటం జరుగుతుంది. ఇక్కడ కూడా “లింగమనేని రమేష్ రైతు దగ్గర నుంచి ఎంత ఇచ్చి కొన్నాడు?ఎప్పుడు కొన్నాడు?” అనే విషయాలు నిర్దారించుకొని కొన్నాడా?
2015, పెనుమాక సభలో “ఒక్క ఎకరం బలవంతంగా లాక్కున్నా నేను ధర్నాకు దిగుతా” అని విస్పష్ట ప్రకటన చేసి, రెవిన్యూ అధికారులు రికార్డులు తారు మారు చేసినా, రైతులు కోర్ట్ చుట్టూ తిరుగుతున్నా, LARR Act 2013 సవరణ చేసినా ధర్నా చెయ్యకుండా, నోరెత్తకుండా ఉన్నందుకు తెలుగుదేశం పార్టీ పవన్ మౌనానికి కట్టిన ఖరీదా?
ఈ ప్రశ్నలు అన్నీ కూడా ప్రభుత్వ నిర్ణేతలు oath of secrecy బ్రేక్ చేసి లింగమనేని కి సమాచారం ఇచ్చారు అని నిర్ధారణ అయ్యాక వేయాల్సిన ప్రశ్నలు. అప్రస్తుత ప్రశ్నలు.
ఒక ప్రభుత్వం తన ముందు ప్రభుత్వం మీద కేసులు పెట్టడం. ఆ తరువాత ప్రభుత్వం కూడా అవే తప్పులు చెయ్యడం. ఇంకో ప్రభుత్వం మళ్ళీ విచారణ.
ఈ చక్రం ఆగేదెక్కడ?
పారదర్శకత దగ్గర.
పార్టీ సభ్యత్వం ఉన్న పారిశ్రామికవేత్తలకు, పార్టీ మద్దతుదారులకు ప్రభుత్వం అప్పగించే ప్రాజెక్టులు, కాంట్రాక్టులు, వాటిని కట్టబెట్టేందుకు అవలంబించిన ప్రక్రియ, అర్హతలు ECI ద్వారా బహిరంగ పరిచే విధానం రావాలి. వైయస్సార్, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో తెలుగుదేశం మద్దతుదారులకు ఎన్ని విలువైన ప్రాజెక్టులు ఇచ్చారు? తెలుగుదేశం హయం లో ఇతర పార్టీ మద్దతుదారులకు ఎలాంటి వ్యాపార అవకాశాలు ఇచ్చారు? అనే వివరాలు ప్రజల ముందు ఉంచి ఫలానా పార్టీకి మద్దతు ఇవ్వకపోతే మనుగడ సాగించలేము అనే భయాన్ని తొలగించాలి.
core dashboard ఎవడికి కావాలి?
ప్రభుత్వ జాలగూడ్లు అద్వానంగా ఉన్నాయి. ఎప్పటికప్పుడు సమాచారం update చెయ్యాలి. bug fixes చెయ్యాలి.కేంద్రం లో ఉన్నట్టు online లో RTI దరఖాస్తు చేసుకునే వీలుండాలి.
రియల్ టైం గవర్నెన్స్ ఎందుకు?
సంవత్సరాలు గడుస్తున్నా నారాయణ కాలేజీ విద్యార్థుల అనుమానాస్పద మరణాలకు సమాధానం లేనప్పుడు.
“పారదర్శక పాలన ఇస్తాం. కావాలంటే చూడండి మా ఎన్నిక గుర్తు గాజు గ్లాసు” అంటున్నారు. ఎలా నమ్మేది?
”ఇదిగో ఈ చట్టం సరిగా లేకపోవడం వల్ల GO 97 ప్రభుత్వం ఇచ్చింది. ఫలానా రూల్స్ మారితే పారదర్శకత వస్తుంది. ఇప్పుడు ఇలా ఉన్న ప్రాసెస్ మేము అలా మారుస్తాం” అని విశ్లేషణాత్మకంగా ఏ సందర్భంలోనూ వివరించలేదు. ఎంత ఎక్కువ ఊగిపోతూ, ఆవేశంగా రంకెలు వేస్తూ మాట్లాడితే అంత ఎక్కువ చిత్తశుద్ధి, అవగాహన ఉన్నట్టు మనం భావించాలా?
సమాచార విప్లవ దశ నుంచి సమాచార విస్ఫోట దశకు చేరుకున్నాం. ఇంటర్నెట్ లో ఏమి చదివితే అది, మీడియా ఏది చూపిస్తే అది గుడ్డిగా నమ్మకండి. నేను రాసిన విషయాలు కూడా మీరు స్వతంత్రంగా multiple sources నుండి రూఢి చేసుకోండి. చట్టాలు ఉల్లంఘించకపోతే అదే పదివేలు అనుకునే కాలం లో మీడియా నుండి నైతికత, ఎథిక్స్ ఆశించడం అత్యాశే. విలువల గురించి ఎంత చెప్పుకున్నా మీడియా సంస్థలు కూడా వ్యాపార సంస్థలే.
వ్యాపార సంస్థలకు లాభాపేక్ష ఉంటుంది. మన పనిగా మనం ఓపిగ్గా ఒకటి రెండు విభిన్న విరుద్ధ న్యూస్ పోర్టల్, ఛానెల్స్ నుండి సమాచారం consume చేసుకుందాం. విచక్షణ వాడి జాగురకత తో ఓటు వేద్దాం. ఉన్న వాళ్లలో బెటర్ అని మనం “నమ్మే” వారికి ఓటు వేద్దాం.
-సంకల్పం