తెలంగాణ విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ లో మొదటి ఎన్నికలు 2014 లో జరిగాయి. తెలుగుదేశం – వైసిపి కి జరిగిన హోరాహోరీ పోరులో తెలుగుదేశం అద్భుత విజయం సాధించి ఐదు సంవత్సరాల పాటు పరిపాలన అందించి ఇప్పుడు మళ్ళీ ఎన్నికలకు సిద్ధం అయింది. రాజకీయ సమీకరణాలు గెలుపులో ముఖ్య పాత్ర పోషించినా, వారిచ్చిన హామీలు కూడా కొంత ప్రభావం చూపాయి. నవ్యంధ్ర కు ఒక అనుభవం గల నాయకుడు కావాలని ప్రజలు తెలుగుదేశానికి పట్టం కట్టారు. మరి వారు మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలు ఈ ఐదు సంవత్సరాల కాలంలో అమలు చేసారా లేదా అన్నది ఒకసారి పరిశీలిద్దాం.
వ్యవసాయ రుణాల మాఫీ
అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులకు ఈ హామీ నిజంగా ఒక వరం లాంటిది. వైసిపి ఈ హామీ ఇవ్వడానికి వెనుకడుగు వేసినా కూడా తెలుగుదేశం ఎంతో దైర్యం గానే ఈ హామీ ఇచ్చిందని చెప్పాలి. రాష్ట్ర విభజన తరువాత ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉంటుందని తెలిసి కూడా తెలుగుదేశం తీసుకున్న ఒక సాహసోపేత నిర్ణయం ఇది. అనుకున్నట్లుగానే ఒకే విడతలో మొత్తం రుణమాఫీ చేయలేకపోయింది తెలుగుదేశం. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు సహకరించలేదు. అయినా కూడా బ్యాంకులతో చర్చలు జరిపి మొత్తం ఐదు విడతల్లో రుణమాఫీ చేయాలని నిర్ణయించింది. 2019 ఎలక్షన్ షెడ్యూల్ విడుదలకు కొద్ది గంటల ముందు చివరి రెండు విడతల మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించింది. మొత్తానికి ఆర్ధికంగా కష్టాల్లో ఉన్నాకూడా రుణమాఫీ హామీని నెరవేర్చింది తెలుగుదేశం.
డ్వాక్రా రుణాల మాఫీ:
వ్యయసాయ రుణాల మాదిరి గానే ఇది కూడా రాష్ట్ర ఆర్ధికస్థితి కి ఒక పరీక్షలాంటిది. తెలుగుదేశం పార్టీ డ్వాక్రా రుణమాఫీ జరిగింది అని చెప్తున్నప్పటికీ చాలా మంది మహిళలకు బ్యాంకుల నుండి కొత్త రుణాలు తీసుకోలేని పరిస్థితి ఉంది. వీరందరి నుండి వ్యతిరేకత రాకుండా పసుపు-కుంకుమ పేరున ప్రతి ఒక్కరికి 10 వేల రూపాయలతో పాటు ఒక స్మార్ట్ ఫోన్ ఇచ్చే పథకం ప్రవేశపెట్టారు. ప్రభుత్వ కాల పరిమితి ముగిసే సమయానికి మహిళలకు ఇచ్చిన ఈ పథకం తెలుగుదేశం పార్టీ కి మంచి ఆదరణే తెచ్చిపెట్టింది.
వ్యవసాయానికి 9 గంటల ఉచిత కరెంటు:
తెలుగుదేశం పార్టీ అధికారం లోకి వచ్చిన తరువాత వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తును అందించారు. విద్యుత్తుపరంగా రాష్ట్రం మిగులు ఉత్పత్తి లో ఉంది. అందుకని ఈ హామీ ని నిలబెట్టుకోవడం సులభం అయింది.
ఇంటికో ఉద్యోగం:
రాష్ట్రం లో నిరుద్యోగ సమస్య తీవ్ర స్థాయిలో ఉన్నందున, ముఖ్యంగా యువతే లక్ష్యంగా ఇంటికో ఉద్యోగం పేరుతో తెలుగుదేశం ఈ హామీని ఇచ్చింది. “జాబు కావాలి-బాబు రావాలి” అనే నినాదం తో యువతను ఆకర్షించడం లో తెలుగుదేశం విజయం సాధించింది. కానీ ఉద్యోగాల కల్పనలో మాత్రం కొంతవరకు నిరాశే మిగిల్చింది అని చెప్పాలి. ఒక్క కియా మోటార్స్ పరిశ్రమ ని రాష్ట్రానికి తీసుకు రాగలిగింది.
నిరుద్యోగ భృతి పేరుతో ఉద్యోగం లేని వారికీ నెలకు 2000 రూపాయలు ఇస్తామని చెప్పినా కూడా అది కార్యరూపం దాల్చడానికి నాలుగు సంవత్సరాల సమయం పట్టింది. ఆఖరి పరిపాలన సంవత్సరంలో 1000 రూపాయల భృతితో ప్రారంభించి ఇప్పుడు 2000 రూపాయలకు పెంచారు. ఒకరకంగా ఈ విషయం లో యువత అసంతృప్తి గానే ఉన్నారు. ఉద్యోగాల కల్పనలో పూర్తి నిరాశనే మిగిల్చారు.
వృద్దులకు, వితంతువులకు పింఛన్ల పెంపు:
వృద్దులకు ఇచ్చే 200 రూపాయలను 1000 రూపాయలకు, వితంతువులకు 1500 రూపాయలకు పెంచారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. వైసిపి 2019 లో ఎలక్షన్ హామీగా పెట్టుకున్న 2000 రూపాయల వృధ్యాప్య పింఛను హామీని టీడీపీ ప్రభుత్వం జనవరిలోనే అమలుచేసి వైసిపి షాక్ ఇచ్చింది. 2014 మేనిఫెస్టో లో లేకపోయినప్పటికీ ప్రభుత్వం ముందుగానే ఈ నిర్ణయం తీసుకొని అందరిని ఆశ్చర్య పరిచింది.
రాజధాని నిర్మాణం:
రాష్ట్ర విభజనలో భాగంగా హైదరాబాద్ ని తెలంగాణ కి రాజధానిగా ఇచ్చేసారు. ఉమ్మడి రాజధానిగా పది సంవత్సరాల పాటు ఉపయోగించుకునే అవకాశం ఉన్నా కూడా రాజకీయ పరిస్థితుల దృష్ట్యా పూర్తి కార్యకలాపాలను ఆంధ్ర కి అర్ధంతరంగా తరలించేసారు. అమరావతి నిర్మాణానికి రైతుల నుండి 33000 ఎకరాల భూమిని సేకరించి ఔరా అనిపించారు. ప్రపంచ స్థాయి రాజధాని పేరుతో కేవలం డిజైన్లకే కోట్ల రూపాయలు ఖర్చు చేసారు. సింగపూర్ తరహా రాజధాని పేరుతో చాలా సమయాన్ని వెచ్చించారు. తాత్కాలిక భవనాలకే కోట్లు కుమ్మరించారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని ప్రాంతంలో ఒక్క శాశ్వత నిర్మాణం కూడా లేకపోవడం బాధాకరం. చాలా వరకు డిజైన్లు ఖరారు చేసి నిర్మాణాలను చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాజధాని నిధుల విషయంలో రాష్ట్రానికి మొండిచెయ్యి చూపించింది. అయినా రాష్ట్ర ఆర్ధిక స్థితి ని బాలన్స్ చేస్తూ రాజధాని నిర్మాణం మాత్రం కొనసాగుతుంది.
పోలవరం:
2018 చివరకు పోలవరాన్ని ఎట్టి పరిస్థితుల్లో కచ్చితంగా పూర్తి చేస్తామని శపథం చేసారు. జాతీయ ప్రాజెక్ట్ గా పరిగణించినా కూడా కేంద్రం నిధుల విషయంలో జాప్యం చేస్తుందని భావించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యతని తీసుకుని పనులు చేపట్టింది. కానీ అనుకున్న సమయానికి మాత్రం ప్రాజెక్టు ను పూర్తి చేయలేకపోయింది. ప్రాజెక్ట్ సందర్శన కోసం ప్రజలను అక్కడికి తరలించడానికి అనవసరంగా వృధా ఖర్చును చేస్తుంది ప్రభుత్వం. పట్టిసీమ ప్రాజెక్టు ను నదుల అనుసంధానం లో భాగంగా త్వరితగతిన పూర్తి చేసి రికార్డు సృష్టించింది.
పైన చెప్పుకున్నవన్నీ తెలుగుదేశం ప్రధానంగా ఇచ్చిన హామీలు మరియు విజయానికి తోడ్పడిన హామీలు. ఇవి కాకుండా మరికొన్ని చిన్న చిన్న హామీలు కూడా ఉన్నాయి. అవి కూడా పూర్తి స్థాయిలో అమలుచేయడంలో తెలుగుదేశం ప్రభుత్వం విఫలం అయింది.
రాబోయే ఎలక్షన్ కోసం ఇచ్చే మేనిఫెస్టో లో ఓటర్లను ఆకర్షించడానికి మళ్ళీ ఎటువంటి హామీలను ప్రకటిస్తారో వేచి చూడాలి.
— హరీష్