తూర్పుగోదావరి జిల్లాలో ఈ సారి ముక్కోణపు పోటీ ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ, వైసీపీ, జనసేనలు.. ప్రధానంగా పోటీ పడబోతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ… జాతీయ పార్టీలైనప్పటికీ.. వాటి ప్రభావం.. కనీసం గెలుపోటముల్ని తారుమారు చేసేంత స్థాయిలో కూడా ఉండదు. తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించడంతో.. ఈ సారి కూడా.. అదే జోష్‌తో ఉంది. టిక్కెట్లను ఒకటి, రెండు చోట్ల తప్పదాదాపుగా ఖరారు చేశారు. చాలా మంది ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు.
ప్రచార బరిలో టీడీపీ..!
కాకినాడ నగరంలో వనమాడి వెంకటేశ్వరరావు , కాకినాడ గ్రామీణంలో పిల్లి అనంతలక్ష్మి, రాజమహేంద్రవరం గ్రామీణంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పెద్దాపురంలో నిమ్మకాయల చినరాజప్ప, జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ, మండపేటలో వేగుళ్ల జోగేశ్వరరావు, అనపర్తిలో రామకృష్ణారెడ్డి, రామచంద్రపురంలో తోట త్రిమూర్తులు, తునిలో యనమల కృష్ణుడు, కొత్తపేటలో బండారు సత్యానందరావు, రాజానగరంలో పెందుర్తి వెంకటేష్, ప్రత్తిపాడులో వరుపుల రాజా, ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు, రంపచోడవరంలో వంతల రాజేశ్వరిలకు టిక్కెట్లు ఖరారు చేశారు. వీరంతాప్రచారంప్రారంభించారు. రాజమహేంద్రవరం నగర నియోజకవర్గానికి అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలు భవానిని ఖరారు చేశారు. ఈమె దివంగత టీడీపీ నేత ఎర్రన్నాయుడు కుమార్తె. పి.గన్నవరం, అమలాపురం స్థానాలపై మాత్రం ఇంకా టీడీపీ అధినేత క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాకినాడ ఎంపీగా చలమలశెట్టి సునీల్ పేరు, అమలాపురంలో హరీష్ మాధుర్ పేరు దాదాపుగా ఖరారు చేశారు. రాజమండ్రి సీటు విషయం మాత్రం పీట ముడి పడింది. అయితే హర్షకుమార్ టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతూండటంతో.. బాలయోగి కుమారుడ్ని అమలాపురం అసెంబ్లీకి పంపి హర్షకుమార్కు ఎంపీ టిక్కెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
టీడీపీ నుంచి వచ్చే వారి కోసం వైసీపీ ఎదురుచూపులు..!
వైసీపీ కూడా.. ఈ సారి తూ.గో జిల్లాలో అత్యధిక సీట్లు సాధిస్తే అధికారం వస్తుందని అనుకుంంటున్నారు. ఒకటి, రెండు చోట్ల మినహా దాదాపుగా ఇప్పుడున్న సమన్వయకర్తలనే రంగంలోకి దింపొచ్చన్న వాదన వినవస్తోంది. ముమ్మిడివరం నుంచి పొన్నాడ సతీష్, అమలాపురంలో పినిపె విశ్వరూప్, పిఠాపురంలో పెండెం దొరబాబు, కాకినాడ నగరంలో ద్వారంపూడి చంద్రశేఖర్, కాకినాడ గ్రామీణంలో కురసాల కన్నబాబు, పి.గన్నవరంలో కొండేటి చిట్టిబాబు, రాజోలులో బొంతు రాజేశ్వరరావు సమన్వయకర్తలుగా ఉన్నారు. రాజమహేంద్రవరం నగరంలో రౌతు సూర్యప్రకాశరావు, రాజమహేంద్రవరం గ్రామీణంలో ఆకుల వీర్రాజు, పెద్దాపురంలో దవులూరి దొరబాబు, జగ్గంపేటలో జ్యోతుల చంటిబాబు, రంపచోడవరంలో నాగులపల్లి ధనలక్ష్మి, అనపర్తి సత్తి సూర్యనారాయణరెడ్డి, రామచంద్రపురంలో చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, తునిలో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, కొత్తపేటలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ప్రత్తిపాడులో పర్వత పూర్ణచంద్రప్రసాద్ సమన్వయకర్తలుగా ఉన్నారు. రాజానగరంలో జక్కంపూడి విజయలక్ష్మి లేదంటే ఆమె కుమారుడు రాజా రంగంలో ఉండొచ్చని తెలిసింది. అయితే.. కొత్తగా వచ్చే టీడీపీ నేతల్ని చేర్చుకుని వారికి టిక్కెట్లు కేటాయించాలని అనుకుంటూ ఉండటంతో… చాలా మందిలో ఆభద్రతా భావం ఏర్పడింది.
నేతల చేరికలతో బలంగా జనసేన..!
జనసేన పార్టీ అధికారికంగా ముమ్మిడివరం అసెంబ్లీ స్థానానికి పితాని బాలకృష్ణను అభ్యర్థిగా ఎప్పుడో ప్రకటించింది. అమలాపురం పార్లమెంటు నుంచి ఓఎన్జీసీ ఎసెట్ మేనేజర్‌గా పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన డీఎంఆర్ శేఖర్, రాజమహేంద్రవరం పార్లమెంటుకు ఆకుల సత్యనారాయణను ఖరారు చేశారు. మిగిలిన అభ్యర్థులను రెండు, మూడు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. వైసీపీ నుంచి పాముల రాజేశ్వరిదేవి, రాపాక వరప్రసాదరావు, కందుల దుర్గేష్ పంతం గాంధీమోహన్, ముత్తాగోపాల కృష్ణ, ముత్తా శశిధర్, జ్యోతుల వెంకటేశ్వరరావు లాంటి నేతలు చేరడంతో… జనసేన కూడా గట్టి పోటీ ఇచ్చే పరిస్థితిలో వుంది. 14న రాజమహేంద్రవరంలో జనసేన ఆవిర్భావ సభను భారీ ఎత్తున నిర్వహించనున్నారు.