తెలంగాణ ముందస్తు ఎన్నికలు అనూహ్యంగా వచ్చిన కారణంగా.. ఎన్నికల్లో పోటీ చేయలేకపోయామని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించుకున్నారు. నిజానికి… కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత మూడు నెలలకు ఎన్నికలు జరిగాయి. అప్పటి వరకూ ఆలోచన లేకపోయినా.. ఎన్నికల్లో పోటీ చేయాడానికి ఆ మూడు నెలల సమయం పడుతుంది. కానీ.. చేయలేదు. మరి ఇప్పుడు ఏపీ ఎన్నికల విషయంలో అదే పరిస్థితి పునరావృతమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జనసేన వ్యవహారాలు చూస్తున్న అభిమానలను ఇదే ఆందోళనకు గురి చేస్తోంది.
ఇక నామినేషన్లకు ఆరు రోజులే గడువు..! అభ్యర్థులేరీ..?
పద్దెనిమిదో తేదీ నుంచి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రధాన పార్టీలైన టీడీపీ, జనసేన.. దాదాపుగా అభ్యర్థుల కసరత్తు పూర్తి చేశాయి. ఎక్కువగా పోటీ ఉన్న నియోజకవర్గాల్లో మాత్రమే… బుజ్జగింపుల కోసం … ప్రకటన వాయిదా వేశారు. కానీ జనసేనలో మాత్రం.. అభ్యర్థుల కోసం వెదుక్కునే పరిస్థితి ఏర్పడింది. 175 నియోజకవర్గాలకు 1200 దరఖాస్తులు వచ్చాయని చెప్పుకొచ్చినా… నిజానికి.. రాజకీయాల్లో టిక్కెట్లు ఇవ్వడానికి ఇలా దరఖాస్తు చేసుకోవడం ప్రాథమిక లక్షణం కాదు. ముందుగా.. ప్రజల్లో అంతో ఇంతో గుర్తింపు ఉన్న నేతలు కావాలి. ఓ కొత్త కుర్రాడ్నో.. యువకుడ్నో తెచ్చి.. జనసేన పార్టీ అభ్యర్థి అని నిలబెడితే… జనసేన పరువు బ్యాలెట్ బాక్సుల్లోనే పోతుంది. పోటీ ఇవ్వగలిగే అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోవడం కత్తి మీద సాము లాంటిదే. కానీ.. పవన్ కల్యామ్.. గత డిసెంబర్ నుంచి దీనిపై ఎలాంటి కసరత్తు చేయలేదు. ఇప్పుడు సమయం ముంచుకొచ్చేసింది. గట్టిగా ఉభయగోదావరి జిల్లాల్లో మాత్రమే.. ఓ మాదిరి అభ్యర్థులు జనసేనకు కనిపిస్తున్నారు. ఇంకెక్కడా కనిపించడం లేదు.
నమ్ముకున్న యువతకు నిరాశ కలిగిస్తున్న పవన్ తీరు..!
పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిన మరుక్షణం లక్షల సంఖ్యలో యువత వాలంటీర్లుగా పని చేయడానికి వచ్చారు. రాను రాను ఆ సంఖ్య అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది. ఇప్పుడు.. ఆన్లైన్లో ఆయినా.. బయట అయినా పార్టీ కోసం పని చేయడానికి పెద్ద ఎత్తున యువత వస్తున్నారు. ఆయన ఆ ప్రాంతం.. ఈ ప్రాంతం అని తేడా లేకుండా…ఎక్కడ పర్యటిస్తే.. అక్కడ వచ్చే జనసందోహమే దీనికి ఊదాహరణ. ఈ ఆదరణను రాజకీయ శక్తిగా మార్చుకునే ప్రయత్నంలో పవన్ కల్యాణ్ ఏ మాత్రం సక్సెస్ కాలేదని.. రాజకీయవర్గాలు ఇప్పటికే తేల్చేశాయి. ఏ మాత్రం ప్రభావ వంతం కాని రాజకీయ కార్యాచరణ.. దీనికి కారణం. ఇప్పుడు.. ఏపీలో.. రాజకీయాలు పోలరైజ్ అయ్యే పరిస్థితలులు ఏర్పడ్డాయి. దీనంతటికి జనసేన నాయకత్వలోపమే కారణం.
ఆరేళ్ల కాలంలో… ఇదేనా సన్నద్ధత..?
పార్టీకి ఓ కమిటీ లేదు. ఉన్న కమిటీల్లో ఎవరుంటారో తెలియదు. ఆ కమిటీల్లో ఉన్న వారు ఏం చేస్తారో తెలియదు. నాదెండ్ల మనోహర్ లాంటి సీనియర్ నేతలు ఉన్నా… కార్యాచరణ ముందుకు కదలదు. జిల్లా కమిటీలు లేవు. పార్లమెంటరీ కమిటీల్లో ఎవర్నీ నియమించారో ఎవరికీ అర్థం కాదు. ఎన్నికలంటే.. ఇది కాదు కదా..! పార్టీ కోసం… కాస్తంత రాజకీయ చాణక్యం ఉండాలి. గ్రామగ్రామ అభిమానులు ఉంటే సరిపోదు.. వారితో ఓట్లు వేయించే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. కానీ.. ఇంత వరకూ.. అలాంటి వ్యవస్థను కనీసం.. ఏర్పాటు చేసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. అందుకే.. జనసైనికులు.. రగిలిపోతున్నారు. తమ సమయం ఎంతో వెచ్చించి.. పార్టీ కోసం.. కష్ట పడుతున్నా.. నాయకత్వ లోపం కారణంగా.. . వెనుకబడి పోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.