మొత్తానికి అలీ రాజకీయాల్లోకి అడుగుపెట్టేశాడు. వైకాపా కోసం ప్రచారం చేయడానికి రెడీ అయిపోతున్నాడు. అలీకి తన సినీ గ్లామర్ బాగా కలిసొస్తుంది. పైగా మంచి మాటకారి. దానికి తోడు.. ముస్లిం ఓట్లని రాబట్టడానికి తనో పనిముట్టుగా ఉపయోగపడతాడు. వైకాపాకి ఎటు చూసినా అలీ ఎంతోకొంత హెల్ప్ అవుతాడు.
కాకపోతే… ఇక్కడ అలీకే కొన్ని చిక్కులున్నాయి. పవన్ ఫ్యాన్స్ తాకిడిని అలీ ఎలా తట్టుకుంటాడో చూడాలి. `నాకు గుంటూరు సీటిస్తేనే మీ పార్టీలో చేరతా` అని జనసేనతోనూ, టీడీపీతోనూ బేరాలు మాట్లాడిన అలీ.. ఇప్పుడు ఎలాంటి సీటూ లేకుండా వైకాపాలో చేరిపోయాడు. పవన్ కల్యాణ్ చంద్రబాబుతో సహా, జగన్‌ని కూడా టార్గెట్ చేస్తూ చేసే విమర్శల్ని వైకాపా తిప్పి కొట్టాలి. మీటింగుల్లో ‘జగన్‌కి ఓటేయండి’ అంటే సరిపోదు. పవన్‌కి ఎందుకు వేయకూడదో కూడా చెప్పగలగాలి. అంటే పవన్‌ని విమర్శించాలి. ”పవన్ నిజాయతీపరుడు.. తాను గెలిస్తే నేను గెలిచినట్టే” అంటూ.. చెప్పుకునే అలీ.. ఇప్పుడు పవన్‌ని పల్లెత్తుమాట అనగలడా? అనకుండా తన ప్రచారాన్ని ముగించగలడా?
మరోవైపు వైకాలో ఉన్న ఫృథ్వీ లాంటి వాళ్లు కూడా పవన్‌ని టార్గెట్ చేయడానికి ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. అలాంటప్పుడు అలీ పవన్ విషయంలో మౌనంగా ఉండడానికి వీలవుతుందా?? అలీ వెళ్లిన ప్రతీ చోటా.. జనసేన కార్యకర్తలు అడ్డగించడానికి ప్రయత్నించొచ్చు. ‘స్నేహితుడ్ని వదిలి.. పక్క పార్టీలోకి ఎలా వచ్చావు’ అని నిలదీయొచ్చు. ‘స్నేహం స్నేహమే రాజకీయం రాజకీయమే’ అని మీడియా ముందు చెప్పినంత సులభంగా పవన్ ఫ్యాన్స్ దగ్గర అనగలడా..?? పవన్‌ని విమర్శించలేని అలీ రాజకీయ ప్రసంగాలు కిక్ ఇస్తాయా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నలు.