`నన్ను చంపినా సరే… యూ ట్యూబ్లో ఈ సినిమాని విడుదల చేస్తా` అంటూ సంచలన ప్రకటన చేశాడు రాంగోపాల్ వర్మ, లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ. కానీ అన్ని ప్రమాదాలు జరక్కుండానే – ఈ సినిమాని అడ్డు కట్టవేయాలని ఏపీలో ఓ వర్గం గట్టిగా ప్రయత్నిస్తోంది. వచ్చే వారంలోనే లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. చిత్రబృందం ప్రచారం కోసం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది కూడా. అయితే ఏపీలో ఈ సినిమాని విడుదల కాకుండా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్త దేవీబాబు చౌదరి ఎలక్షన్ కమీషన్ని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సినిమాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రని నెగిటీవ్ కోణంలో చూపించారని, త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగనున్న ఎన్నికలపై ప్రభావం చూపేలా ఈ చిత్రం ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏప్రిల్ 11 వరకు ఈ చిత్రం విడుదలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఫిర్యాదు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు స్వీకరించారు. ఇప్పుడు ఈ సినిమా విడుదల ఎన్నికల కమీషన్ చేతుల్లోకి వెళ్లిపోయినట్టే. కమీషన్ ఈ సినిమాని ఆపితే మాత్రం విడుదల కోసం ఏప్రిల్ 11 వరకూ ఎదురు చూడాల్సిందే.