నా ఛానల్, నా ఇష్టం అంటూ ఈ మధ్య సోషల్ మీడియా లో ఆసక్తికరమైన వీడియోలు చేస్తున్న నాగబాబు మరొకసారి ఒక ఫన్నీ వీడియో చేశారు. ఈ సారి చంద్రబాబుని టార్గెట్గా చేసుకొని “పాపం చంద్రబాబుకు రెస్ట్ ఇవ్వండి” అంటూ వ్యంగ్యంగా చేసిన వీడియో ప్రేక్షకులను అలరిస్తోంది.
ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా 60 ఏళ్లు దాటగానే రిటైర్ అయిపోయి హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారని, కానీ కొంతమంది మాత్రం చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలి, ఆయన మా కోసం పని చేయాలి అంటూ ఆయనకు రెస్టు లేకుండా చేస్తున్నారని, దాదాపు 70 ఏళ్ల వయసు వచ్చిన చంద్రబాబుకు, ఆయన మీద ప్రేమతో అందరూ కలిసి రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని అంటూ చేసిన ఈ వీడియో సోషల్ మీడియా లో బాగా పాపులర్ అవుతోంది. పైకి చంద్రబాబు మీద ప్రేమతో, ఆయనకు రెస్ట్ ఇవ్వాలి అని అంటున్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ, నిజానికి దాని వెనకాల గోదావరి మార్కు వెటకారం దాగుంది. పైగా 70 ఏళ్ళ వయసున్న చంద్రబాబుకి తన మనవడితో ఆడుకోవాలన్న కోరిక ఉంటుందని, ఆయన కోరిక తీర్చాల్సిన బాధ్యత మన మీద ఉందని, మనమంతా కలిసి ఆయనను ఇంటికి పంపించి ఆయన రెస్ట్ తీసుకునేలా చేయాలని నాగబాబు చేస్తున్న వ్యాఖ్యల పరమార్థం చంద్రబాబును ఈసారి ఎన్నికల్లో ఓడించండి అని చెప్పడమే.
ఏదేమైనా సోషల్ మీడియాని వాడుకుంటూ ఇటు అధికార పక్షాన్ని, అటు ప్రతిపక్షాన్ని నాగబాబు టార్గెట్ చేస్తున్న తీరు చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే తీసుకున్న సబ్జెక్టు ఎంత సీరియస్ గా ఉన్నది అయినప్పటికీ, దానికి సునిశితమైన హాస్యం జోడించి చెబుతూ ఉండడం వల్ల చూసేవారికి కూడా బోర్ కొట్టకుండా ఈ వీడియోస్ ఉంటున్నాయి.
మరి ఈ వీడియోలు ఎంత వరకు జనసేన గెలుపుకు దోహదం చేస్తాయన్నది మే 23 తర్వాత తెలుస్తుంది.