‘తమ్ముడి కోసం ఏం చేయడానికైనా సిద్ధమే’ అని చాలాసార్లు స్టేట్మెంట్లు ఇచ్చాడు మెగా బ్రదర్ నాగబాబు. ఇప్పుడు అందుకు సమయం వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నగారా మోగింది. ఎన్నికలకు ఇంకా నెల రోజుల సమయం కూడా లేదు. పార్టీని ముందుకు ఎలా నడిపించాలా? అని పవన్ తర్జనభర్జనలు పడుతున్నాడు. ఇప్పుడు నాగబాబుకి చేతినిండా పని పడినట్టే. నిజానికి నాగబాబుతో పాటు పవన్‌కి అండగా ఎవరుంటారో తేలాల్సిన తరుణమిది. ఇప్పటి వరకూ రామ్ చరణ్ కూడా చాలాసార్లు ‘బాబాయ్ ఏం చెప్పినా చేయడానికి సిద్ధమే. బాబాయ్ పిలిస్తే ఏమైనా చేస్తా’ అని చాలాసార్లు చెప్పాడు. పవన్ తనంతట తాను ఎవ్వరినీ ఏదీ కోరడు. ఇది మెగా ఫ్యామిలీకి కూడా బాగా తెలుసు. అలాంటప్పుడు పవన్ పిలుపుకోసం నాగబాబు, చరణ్ ఎదురుచూస్తూ కూర్చుంటారా? లేదంటే.. అడక్కుండానే రంగంలోకి దిగుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.
నాగబాబు ఈసారి ఎన్నికలలో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారని, తూగో, ప.గోలలోని ఏదో ఓ నియోజకవర్గం నుంచి నాగబాబు పోటీ చేయడం ఖాయమని ఓ వర్గం చెబుతోంది. నరసాపురం అసెంబ్లీ టికెట్‌ని నాగబాబు ఆశిస్తున్నారని కూడా చెబుతున్నారు. అయితే.. టికెట్ ఆశించి పార్టీలోకి వస్తే… పవన్ రియాక్షన్ మరోలా ఉంటుంది. తన స్నేహితుడైన అలీకే పవన్ చోటివ్వలేదు. ఇప్పుడు అన్నయ్యకు సీటిస్తే.. మళ్లీ ఇది కుటుంబ పార్టీగా ముద్రపడిపోతుందన్న భయం పవన్‌కి ఉంటుంది. అందుకే.. నాగబాబు సీటు అడిగినా పవన్ కాదనే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు మెగా కుటుంబం నుంచి పవన్‌కి ఎలాంటి సపోర్ట్ ఉండబోతోంది? అనేదీ త్వరలో తేలిపోనుంది. చిరంజీవి జనసేనలోకి వస్తారని, ఆయన గౌరవ అధ్యక్షుడిగా ఉంటారని చెప్పుకున్నారు. అయితే ఇప్పట్లో ఆ అవకాశాలు లేనట్టే. ఈసారి చిరంజీవి జనసేనకు దూరంగా ఉండొచ్చు. అయితే రామ్ చరణ్ ప్రచారానికి దిగే అవకాశాలు కొట్టిపారేయలేం. ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్‌లో చరణ్ బిజీగా ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో షూటింగ్ ని ఆపేసి, బాబాయ్ కోసం ప్రచారం సాగిస్తాడా? అనే అనుమానాలూ ఉన్నాయి. ఏదేమైనా జనసేన వెంట మెగా కుటుంబం ఉంటుందా, లేదా అనేది అతి తొందర్లోనే తేలిపోనుంది.