కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై కీలక ప్రకటన చేశారు బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతి. దేశంలో ఎక్కడా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునేది లేదని స్పష్టం చేశారు. ఎస్పీ, బీఎస్పీల పొత్తు పరస్పర గౌరవంతో ఏర్పడిందని స్పష్టం చేశారు. బీఎస్పీతో స్నేహం కోసం చాలా పార్టీలు సిద్ధంగా ఉన్నాయనీ, ప్రజా ప్రయోజనాల కంటే వారి స్వార్థ ప్రయోజనాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. ఎస్పీ, బీఎస్పీలు కలిసి భాజపాను ఓడించగలవని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ తప్ప, ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ తో మాయావతి పొత్తు ఉంటుందంటూ వినిపించిన కథనాలకు ఆమె చెక్ పెట్టినట్టే.
ఏదో ఒక వ్యూహంతోనే కాంగ్రెస్ విషయంలో మాయావతి ఇలాంటి ప్రకటన చేశారా అంటే.. కచ్చితంగా అవును అనే చెప్పాలి. జాతీయ స్థాయిలో ఏ సింగిల్ పార్టీకీ సొంతంగా మెజారిటీ రాదనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. భాజపా వ్యతిరేక పక్షాలు చెప్పుకోవడానికి పెద్ద సంఖ్యలో ఉన్నా… ప్రీ పోల్ అలయెన్స్ అధికారికంగా ప్రకటించడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఈ విషయంలో మాయావతి, అఖిలేష్ యాదవ్ లు మరింతగా బిగుసుకుని కూర్చున్నారు. ఎందుకంటే… రాబోయే ఎన్నికల్లో ఈ కూటమికి పెద్ద సంఖ్యలో ఎంపీ స్థానాలు వస్తాయన్న నమ్మకం. భాజపాకి వ్యతిరేకంగా పోరాడుతున్నామంటే, కాంగ్రెస్ తో కలుపుకుని కాదు అనే అభిప్రాయాన్ని మరింత బలంగా మాయావతి వినిపించే ప్రయత్నం చేస్తున్నారు.
స్థానికంగా పెద్ద సంఖ్యలో స్థానాలు దక్కించుకోవాలి, తరువాత జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనే ట్రెండ్ ఈ ఎన్నికల్లో ప్రధానంగా కనిపిస్తోంది. అందుకే, ముందుగా తాము ఫలానా కూటమికి చెందిన పార్టీ అనే ముద్రకు వీలైనంత దూరంగా ఉండే ప్రయత్నం చాలా ప్రాంతీయ పార్టీలు చేస్తున్నాయి. మాయావతి వ్యూహం కూడా అదే. యూపీతోపాటు ఇతర రాష్ట్రాల్లో స్థానాలు సంపాదిస్తే, జాతీయ స్థాయిలో తమ మద్దతుకు డిమాండ్ పెరుగుతుందనీ, అప్పుడు కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం వస్తుందనే అంచనాతోనే ఆమె ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. అయితే, ఈ ట్రెండ్ ఒక రకంగా భాజపాకి ప్లస్ అయ్యే అవకాశమూ లేకపోలేదు. ఎన్నికల ఫలితాల తరువాత, ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రానప్పుడు, ప్రభుత్వ ఏర్పాటుకు ప్రీ పోల్ అలయెన్స్ ఉన్న కూటమికే మొదటి అవకాశం వస్తుంది. ఈ పరిస్థితిని కూడా తమకు కలిసి వచ్చే అవకాశంగా మాయావతి భావిస్తున్నట్టున్నారు.