రాష్ట్ర విభజన తర్వాత… ఆదాయంలో సింహభాగం తెలంగాణకు వెళ్లింది. దానికి కారణం హైదరాబాద్. హైదరాబాద్ ఆదాయం మొత్తం తెలంగాణకు కేటాయించడంతో.. ఏపీలో ఆదాయం అంతంమాత్రమే. ఉద్యోగులకు జీతాలివ్వడానికి కష్టపడాల్సిన పరిస్థితి. ఏకంగా.. రూ. 16 వేల కోట్లకుపైగా లోటు బడ్జెట్. దానికి తగ్గట్లుగానే మొదట్లో వ్యవహారాలు నడిచాయి. మరి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది…?
ఐదేళ్లలో ఐదింతలు పెరిగిన ఏపీ పన్నుల ఆదాయం..!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తరువాత చంద్రబాబు పాలనా పగ్గాలు చేపట్టిన నాటికి ఆంధ్రప్రదేశ్‌లో సొంత పన్నుల ఆదాయం రూ. 15,555 కోట్లు మాత్రమే. అక్కడి నురచి వరుసగా రూ. 38,038 కోట్లు, రూ. 44,841 కోట్లు, రూ. 49,374 కోట్లు, రూ. 56,704 కోట్లుగా పెరిగింది. ఈ ఏడాది పన్నుల ఆదాయాన్ని రూ. 70,881 కోట్లుగా అంచనా వేశారు. అంటే ఐదేళ్లలో దాదాపు రూ. 55 వేల కోట్లు సొంత పన్నుల ఆదాయం పెరిగింది. నిజానికి విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయంపైనే ఆధారపడింది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ రంగం వాటా 2013-14లో 23 శాతంగా ఉంటే విభజన సమయంలో ఇది 30.2 శాతంగా ఉంది. 2017-18నాటికి 34.4 శాతానికి చేరింది. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం వాటా 34.4 శాతంగా ఉంది. పారిశ్రామిక రంగం వాటా 22.1, సేవలం రంగం 43.5గా ఉంది. పారిశ్రామిక రంగంలో ఆదాయ వృద్ధి 2013-14లో రూ.1.07 లక్షల కోట్ల నుంచి 2017-18లో రూ.1.62 లక్షల కోట్లకు.. సర్వీసు రంగంలో 2013-14లో 1.90 లక్షల కోట్ల నుంచి 2017-18 నాటికి రూ.3.20 లక్షల కోట్లకు గణనీయంగా పెరిగింది.ఇది ఓ రకంగా అసాధారణం. ఓ సమర్థవంతమైన నాయకత్వం.. ముందు చూపు ఉంటే.. ఆదాయం వీలైనంత మేర పెంచుకోవచ్చని ఏపీ నిరూపించింది. ఓ కుటుంబ ఖర్చులకు సరిపడా ఎప్పటికప్పుడు సంపాదించడం.. ఆ కుటుంబ పెద్దకు సవాలే. దీన్ని చంద్రబాబు… సాకారం చేశారు. పన్నుల ఆదాయాన్ని ఊహించనంతగా పెంచేశారు. అంత పెద్ద హైదరాబాద్ ఉన్న తెలంగాణ కంటే.. ఈ ఏడాది.. రెవిన్యూ ఆదాయం.. రూ. వెయ్యి కోట్లు ఎక్కువ… అంటే… ఆదాయవృద్ధిలో… ఏపీ పక్కాగా ఉందని అర్థం చేసుకోవచ్చు.
క్రమంగా తగ్గుతున్న ఆర్థిక లోటు..!
కేంద్రప్రభుత్వం తాజా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ స్థూల ఆర్ధిక లోటు తగ్గుతూ ఉండగా తెలంగాణాలో పెరుగుతుంది. 2017-18లో లోటు 27600 కోట్లు ఉండగా 2018-19లో అది రూ. 24210 కోట్లుగా ఉంది అంటే ఒక సంవత్సరంలో 3390 కోట్ల లోటు తగ్గింది. అదే సమయంలో విభజన తరువాత మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయి లోటు లో కూరుకుపోయింది. 2017-18లో తెలంగాణ లోటు రూ. 23490 కోట్లు ఉండగా 2018-19లో అది 29080 కోట్లుగా ఉంది అంటే ఒక సంవత్సరంలో రూ. 5590 కోట్ల లోటు పెరిగింది. లోటులో ఉన్న రాష్ట్రం… రాజకీయం కోసం.. వేల కోట్లతో కొత్తగా సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టక తప్పని పరిస్థితి. ఓ వైపు అమరావతి, పోలవరం వంటి ఖర్చులు.. మరో వైపు సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల పనులు.. ఇలా.. ఎక్కడా వెనక్కి తగ్గకుండా పనులు చేస్తూ… ఎంతో కొంత లోటు తగ్గించుకుంటూ వచ్చింది ప్రభుత్వం. మొత్తంగా 2015-16 కాలంలో రూ. 1,07,276 రూపాయలుగా ఉన్న తలసరి ఆదాయ స్థాయి ప్రస్తుతం రూ. 1,42,054 రూపాయల స్థాయికి చేరుకుంది. ఇది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజయంగానే చెప్పాలి.
అంతకంతకూ పెరుగుతున్న రుణభారం..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రుణభారం 2018-19లో రూ. 2,49,435 కోట్ల రూపాయలు. 2016-17లో ఇది రూ. 2,01,314 కోట్ల రూపాయలు. అంటే రెండేళ్ల కాలంలో 48వేల కోట్ల అప్పు పెరిగింది. రాష్ట్ర స్థూల వార్షిక ఉత్పత్తి లో రుణభారం 28.79 శాతం. అయితే ఇందులో… ఉమ్మడి రాష్ట్ర అప్పులు కూడా ఉన్నాయి. ఏపీ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. పారిశ్రామిక, సేవా రంగాలు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం ఎదుగుతున్నాయి. ప్రభుత్వం పరిస్థితి పాత రుణాలను తీర్చేందుకు గాను కొత్త రుణాలను తెచ్చే స్థితికి వచ్చింది . ఈ రుణాల చెల్లింపు సమస్యతో పాటుగా రాష్ట్రం ఎదుర్కొంటున్న మరో అతిపెద్ద సమస్య.
తెలంగాణతో పోలిస్తే ఎంతో మెరుగు..!
ఆంధ్రప్రదేశ్‌కు భిన్నంగా రెవెన్యూ సర్ప్లస్ అంటే తన ఖర్చులకంటే ఆదాయం ఎక్కువ ఉన్న రాష్ట్రంగా ప్రయాణాన్ని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్రం నేడు మెల్లమెల్లగా భారీ రుణ భారంలో కూరుకుపోతోంది. వారసత్వంగా సంక్రమించిన రూ. 61,710 కోట్ల రూపాయల రుణ భారంతో పాటు ఈ నాలుగున్నరేళ్ల కాలంలో వచ్చిన చేరిన అదనపు రుణాలతో తెలంగాణ రాష్ట్ర అప్పుల భారం మొత్తం 2,30,000 కోట్లకు చేరింది. అప్పులు తప్పు కాదని, అప్పు చేసి ఆస్తులు పెంచుకుంటే తద్వారా లభించే ఆదాయంతో ఆ అప్పులను తీర్చివేయగలగడం పెద్ద సమస్య కాదనేది తెలంగాణ పాలకుల వాదన. కాగ్ నివేదిక ప్రకారంగానే తెలంగాణ తాలూకు ప్రస్తుత ఆర్థిక స్థితి పెద్ద ఆశాజనకంగా లేదు. ఉదాహరణకు 2017-18లో దాని ద్రవ్యలోటు 5.46 శాతంగా ఉంది. కాగా, రెవెన్యూ సర్ప్లస్ రాష్ట్రాలకు అనుమతించిన 3.5 శాతం పరిమితి కంటే ఇది అధికం.
మొత్తానికి ఆర్థిక నిర్వహణపై… ఆర్థికవేత్తల విమర్శలు ఉన్నప్పటికీ… రాజకీయాల్ని బ్యాలెన్స్ చేసుకుని ప్రజాకర్షక పథకాలు ప్రవేశ పెట్టడానికి కావాల్సిన వనరులు వెదుక్కుంటూ… పెంచుకుంటూ… చంద్రబాబు..ఓ ఆర్థిక యజ్ఞమే చేశారని చెప్పాలి. ఏపీ ఆర్థిక పరిస్థితిని మెరుగు పర్చడంలో చంద్రబాబు కృషిని తక్కువ చేసి చూపలేం.