గుంటూరు రాజకీయం అందర్నీ ఆసక్తికి గురి చేస్తోంది. బలమైన అభ్యర్థులు ఉన్నప్పటికీ.. టిక్కెట్ల ఖరారులో తంటాలు పడుతున్నారు. దీనికి తోడు వలసలు.. టిక్కెట్లను ఖరారు కానీయకుండా.. ఆయా పార్టీల్లో పరిస్థితులను మార్చేస్తున్నాయి. రాజధాని ఉన్న జిల్లా కావడంతో… రాజకీయ పార్టీలన్నీ… తమ పట్టు చూపించాలని… పట్టుదలగా ఉన్నాయి.
టీడీపీకి ఎక్కువైన బలమైన అభ్యర్థులు..!
అభ్యర్థుల ఎంపికలో టీడీపీ. ఓ రకంగా ముందు ఉంది. సీనియర్లందరికీ.. టిక్కెట్లు ఖరారు చేశారు. అయినప్పటికీ… కొన్ని నియోజకవర్గాలపై పీట ముడి పడింది. తాడికొండ, మంగళగిరి, ప్రత్తిపాడు, గుంటూరు 1, 2, నర్సరావుపేట, బాపట్ల, మాచర్ల నియోజవర్గాలపై కసరత్తు జరుగుతోంది. కానీ ఈ నియోజకవర్గాల్లో ఆశావహులు పెద్దఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. వీరిలో ఎవరికి సీటు కేటాయిస్తే.. ఎవరు అసంతృప్తికి గురవుతారనే టెన్షన్ పెరుగుతోంది. తెలుగుదేశం పార్టీలో బలమైన నేతలు ఉన్నారు. వీరిలో ఒకటికి రెండు నియోజకవర్గాల బాధ్యతలు తీసుకుంటున్నారు. దాంతో.. టీడీపీ కాస్త నిశ్చింతగానే ఉంది.
టీడీపీ నుంచి వచ్చే వారి కోసం వైసీపీ వెయిటింగ్..!
వైసీపీలో… కొత్తగా పార్టీలో చేరికలతో కొంత అనిశ్చితి నెలకొంది. ఎమ్మెల్యే మోదుగుల, జూనీయర్ ఎన్టీఆర్ మామ నార్నె, మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు లాంటి వారి చేరికలతో సమీకరణలు మారాయి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఓటు నమోదు చేసుకున్న సినీ నటుడు అలీ కూడా పార్టీలో చేరారు. ఆయన బయటకు.. పోటీ చేయనని చెబుతున్నారు కానీ… టిక్కెట్ ఇచ్చే ఒప్పందం మీదే పార్టీలో చేరారని.. గుంటూరులోని ఆయన బంధువులు ప్రచారం చేసుకుంటున్నారు. గుంటూరు జిల్లా టీడీపీ అభ్యర్థులు అంత బలంగా కనిపించకపోవడంతో.. జగన్మోహన్ రెడ్డి.. టీడీపీ అభ్యర్థులను ప్రకటించే వరకూ వేచి చూడాలని భావిస్తున్నారు. లేళ్ల అప్పిరెడ్డి, మర్రి రాజశేఖర్, కావటి మనోహర్ నాయుడు, కత్తెర క్రిస్టినా లాంటి నేతలు.. గత ఐదేళ్లుగా పార్టీ కోసం పని చేశారు. వీరందరూ తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అదే సమయంలో… డబ్బు ప్రభావంతో పార్టీలోకి వచ్చి సమన్వయకర్తలుగా పదవులు పొందిన చిలుకలూరి పేట విడదల రజని, గుంటూరు ఫశ్చిమ చంద్రగిరి ఏసురత్నం, పెదకూరపాడు నంబూరు శంకర్ రావు లాంటి వాళ్లను.. చివరి క్షణంలో జగన్ తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. అలాగే మోదుగుల పార్లమెంట్ కు పోటీ చేస్తానని పట్టు పడుతున్నారు. మొత్తంగా చూస్తే.. ప్రతీ నియోజకవర్గంలోనూ వైసీపీ అభ్యర్థులు కనిపిస్తున్నారు. కానీ.. వారే అభ్యర్థి అని లోటస్ పాండ్ ఖరారు చేయడం లేదు. మెరుగైన అభ్యర్థి వస్తే రెడీ అన్నట్లుగా పరిస్థితి ఉంది.
జనసేనలో ముగ్గురు కీలక నేతలు..!
జనసేనకు కూడా.. గుంటూరులో కాస్త బలం కలిగిన నేతలు ఉన్నారు. నాదెండ్ల మనోహర్ , మాజీ ఐఏఏస్ అధికారి తోట చంద్రశేఖర్ , మాజీ మంత్రి రావెల లాంటి వారు పార్టీ కోసం పని చేస్తున్నారు. వీరి ముగ్గురికి .. పవన్ గతంలోనే టిక్కెట్లు ప్రకటించారు. ఈ ముగ్గురు ప్రచారం కూడా మొదలుపెట్టారు. అయితే ప్రత్యర్థులకు పోటీ ఇచ్చే దీటైన అభ్యర్థులు అన్ని చోట్ల కనిపిచడం లేదని కొందరు భావిస్తున్నారు. టిక్కెట్లు ఆశిస్తున్న వారిలో ఎక్కువ మంది రాజకీయాలకు కొత్త వారని, ప్రస్తుత రాజకీయాల్లో నెగ్గుకు రాగలరా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. అందుకే.. ఇతర పార్టీల నుంచి వచ్చే వారి కోసం జనసేన ఎదురు చూస్తోంది. వామపక్షాలకు.. మూడు నాలుగు సీట్లు కేటాయించే అవకాశం ఉంది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. కన్నాను.. నర్సరావుపేట నుంచి లోక్సభకు పోటీ చేయాలని… బీజేపీ హైకమాండ్ కోరినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన నరసరావుపేటపై దృష్టి పెట్టారు.