ఇంతకీ, ఎంపీ జీవీఎల్ నర్సింహారావును ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు పంపారు… భారతీయ జనతా పార్టీకి ఇక్కడ కాస్తోకూస్తో ప్రజాదరణ పెంచమనే కదా! ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ… చరిత్రలో ఏ కేంద్ర ప్రభుత్వమూ ఆంధ్రాకి చెయ్యనంత సాయం చేసిందని చెప్పుకుంటున్న వేళ, జీవీఎల్ చెయ్యాల్సింది చేస్తున్నారా..? సొంత పార్టీ పరిస్థితి వదిలేసి… ఇతర పార్టీల గురించి జోస్యం చెప్పుకుంటూ కూర్చున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ పరిస్థితిపై మరోసారి జోస్యం చెప్పారాయన. విజయవాడలో మీడియాతో జీవీఎల్ మాట్లాడుతూ… ఆంధ్రాలో టీడీపీకి వ్యతిరేకంగా తుఫాను గాలి వస్తోందన్నారు. టీడీపీ నేతల్లో భయం పెరుగుతోందనీ, ఓట్లను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసుకుని మరోసారి అధికారంలోకి వచ్చేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారన్నారు.
ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ను ప్రధాని మోడీ కాపాడుతున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారనీ, ఏ నాయకుడినీ కాపాడాల్సిన అవసరం భాజపాకి లేదన్నారు జీవీఎల్. టీడీపీ నుంచి ఇతర పార్టీల్లోకి పెద్ద సంఖ్యలో నాయకులు వలస వెళ్తున్నారనీ, ఈ ట్రెండ్ చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే వాతావరణం కనిపిస్తోందన్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ టీడీపీ కండువా కప్పుకుంటారంటూ కథనాలు వస్తున్నాయనీ, టీడీపీతో ఆయనకి ఉన్న సంబంధం ఏంటనేది ఇప్పుడు అర్థమౌతోందంటూ ఎద్దేవా చేశారు. ఆంధ్రాలో కుల, ధన రాజకీయాలు నడుస్తున్నాయనీ, రాజధాని అమరావతితోపాటు విశాఖలోని విలువైన భూములను టీడీపీ నేతలు కాజేశారు అన్నారు.
టీడీపీ నుంచి వలస వెళ్తున్నవారు ఎవరో, ఎందుకు వెళ్తున్నారో ప్రజలకు తెలుసు. టీడీపీలో టిక్కెట్ దక్కదనే నమ్మకం ఉన్నవారు, క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నవారే ఎక్కువగా పార్టీలు మారుతున్నారు. సరే, మరి ఈ సందర్భంలో భాజపాలోకి వలస వస్తున్న నాయకులు ఎవరైనా ఉన్నారా..? ఏపీ భాజపాలోకి నాయకులు ఎవ్వరూ ఎందుకు చేరడం లేదు..? పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నా అని చెప్పుకునే జీవీఎల్ చొరవతో ఒక్కరంటే ఒక్క పేరున్న నాయకుడైనా ఏపీ భాజపాలో చేరారా..? ఆ దిశగా జీవీఎల్ కృషి చేశారా..? మీడియా మైకుల ముందు మాత్రమేనా జీవీఎల్ రాజకీయాలు..? ఈయన ఆంధ్రాకి వలస వచ్చి చాన్నాళ్లు అవుతోంది కదా! అప్పట్నుంచీ ఇప్పటివరకూ ఏపీలో భాజపా పరిస్థితి ఎంత మెరుగైంది, దాన్లో జీవీఎల్ పాత్ర శాతమెంత? ఇప్పుడు జీవీఎల్ విశ్లేషించుకోవాల్సింది ఇది. అంతేగానీ, ఇతర పార్టీల్లో వలసల గురించి, ఇతర పార్టీల గురించి జోస్యం చెప్పడం కాదు!