రేపు అంటే ఫిబ్రవరి రెండవ తేదీన జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ ఎన్నికలు తెదేపా, బీజేపీలకు చాలా కీలకమయినవి. ఈ ఎన్నికల ఫలితాలు తెలంగాణాలో ఆ రెండు పార్టీల భవిష్యత్ పై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఒకవేళ ఈ ఎన్నికలలో తెదేపా-బీజేపీ కూటమి విజయం సాధించినట్లయితే, తెలంగాణాలో ఆ రెండు పార్టీలు మళ్ళీ కోలుకోవచ్చును. ఒకవేళ వరంగల్ ఉపఎన్నికలలో మాదిరిగానే ఘోర పరాజయం పొందినట్లయితే, ఇక క్రమంగా తెలంగాణాలో తుడిచిపెట్టుకుపోవచ్చును. ఎందుకంటే తెదేపా-బీజేపీ కూటమికి మొదటి నుంచి హైదరాబాద్ జంట నగరాలపై మంచి పట్టు ఉంది. జంటనగరాలపై తెరాసకు అంతగా పట్టు లేదు. కనుక అటువంటి చోట కూడా అవి తెరాస చేతిలో ఓడిపోయినట్లయితే ఇక అవి ప్రజాధారణ కోల్పోయినట్లే భావించవలసి ఉంటుంది. అది వాటి పతనానికి దారి తీయవచ్చును. అందుకే వరంగల్ ఉపఎన్నికల ప్రచారానికి వెళ్ళని చంద్రబాబు నాయుడు గ్రేటర్ ప్రచారానికి వెళ్ళారని చెప్పవచ్చును.
కీలకమయిన ఇటువంటి సమయంలో ఆయన దృష్టిని మరల్చడానికే తునిలో విద్వంసానికి కుట్ర జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రభావం గ్రేటర్ పరిధిలో ఉన్న ఆంధ్రా ఓటర్లపై కూడా ఎంతో కొంత పడే అవకాశం ఉంటుంది కనుక ఆ విధంగా కూడా రాజకీయంగా తెదేపాను దెబ్బ తీయడానికే ఈ బారీ కుట్ర జరిగి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెదేపా నష్టపోవాలని కోరుకొంటున్నది వైకాపాయే కనుక ఆ పార్టీయే ఈ కుట్రకు పాల్పడి ఉండవచ్చునని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుమానం వ్యక్తం చేసారనుకోవలసి ఉంటుంది.