కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు… గుంటూరు జిల్లాలో కన్నా లక్ష్మినారాయణ, రాయపాటి సాంబశివరావుల మధ్య పొసిగేది కాదు. కన్నా ఆస్తులపై రాయపాటి కోర్టుకెళ్లారు కూడా. అయితే ఎప్పుడూ వీరిద్దరూ ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో తలపడలేదు. తాజాగా.. ఈ ఎన్నికల్లో అది ఆవిష్కృతం అవుతోంది. నర్సరావుపేట లోక్సభ బరిలో టీడీపీ తరపున రాయపాటి సాంబశివరావు, బీజేపీ తరపున కన్నా లక్ష్మినారాయణ పోటీ చేయబోతున్నారు. బీజేపీకి వైసీపీ పరోక్ష సహకారం ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది కాబట్టి… ముఖాముఖి పోరు ఉంటుందనే విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.
నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ రాయపాటి సాంబశివరా వును చంద్రబాబు ఖరారు చేశారు. వైసీపీ అభ్యర్థిగా విజ్ఞాన్ విద్యాసంస్థల వారసుడు లావు శ్రీకృష్ణదేవరాయలు బరిలో దిగే అవకాశం ఉంది. బీజేపీ అభ్య ర్థిగా మాజీ మంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. నిజానికి వైసీపీ అభ్యర్థిగా.. గత ఎన్నికల్లో రాంకీ సంస్థలకు చెందిన అయోధ్యరామిరెడ్డి పోటీ చేశారు. కానీ ఆయన ఇప్పుడు బరిలో లేరు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం కోసం పని చేసుకున్న లావు కృష్ణదేవరాయుల్ని మూడు నెలల క్రితం జగన్ నర్సరావుపేటకు మార్చారు. దీంతో కొంత అసంతృప్తికి గురైనా.. పని చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థులు కూడా ఇప్పటికే ప్రచా రాన్ని నిర్వహిస్తున్నారు.
కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ జీవితమంతా కాం గ్రెస్లోనే కొనసాగింది. గతేడాది ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవ టంతో కన్నా లక్ష్మీనారాయణను నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ బరిలో దింపుతోంది. రాయపాటి 2014లో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి, నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. ఇప్పటికే ఐదుసార్లు ఎంపీగా గెలుపొందారు. 1996, 1998, 2004, 2009, 2014 ఎన్నికల్లో రాయపాటి ఎంపీగా గెలుపొందారు. 1999 ఎన్నికల్లో గుంటూరు నుంచి ఓటమి పాలయ్యారు. ఏడోసారి బరిలోకి ది గుతున్న రాయపాటి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వైసీపీ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు తొలి సారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటున్నారు. ఆయన ఇటీవలే రాజకీయ రంగప్రవేశం చేశారు.
కన్నా లక్ష్మినారాయణకు.. వైసీపీ పరోక్ష సహకారం అందిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. లావు కృష్ణదేవరాయుల్ని అభ్యర్థిగా పెట్టడంలో ఆంతర్యం అదేనంటున్నారు. కన్నా నర్సరావుపేట నుంచి పోటీ చేస్తారనే సూచనలు రావడంతోనే.. హ ఠాత్తుగా.. గుంటూరు నుంచి కృష్ణదేవరాయుల్ని నర్సరావుపేటకు మార్చారని చెబుతున్నారు. అదే నిజం అయితే.. నర్సరావుపేటలో టీడీపీ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా పోటీ జరగనుంది. ఇద్దరు పాత రాజకీయ ప్రత్యర్థుల నడుమ భారీ పోరు అనుకోవచ్చు.