బుల్లెట్లకు ఎదురెళ్లే యువకుల కోసం నేను చూస్తున్నా… ఆ ధైర్యం మీకుందా.. మీకు జనసేన ఆహ్వానం పలుకుతోంది..! అంటూ పవన్ కల్యాణ్.. జనసేన మీటింగుల్లో ఉదరగొట్టారు. ఆయన మీటింగ్‌లకు వచ్చే వాళ్లంతా.. యువతే కావడంతో… అప్పట్లో టీడీపీ స్థాపించినప్పుడు.. ఎన్టీఆర్ యువశక్తిని ఎలా రంగంలోకి తెచ్చారో.. అలా పవన్ తెస్తారేమో అనుకున్నారు. కానీ… జనసేన మొదటి లిస్ట్ చూస్తే… వలస నేతలే… కనిపిస్తున్నారు తప్ప… యువత కనిపించడం లేదు. జనసేన పార్టీ తొలి జాబితాలో 32 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో 25 మంది వివిధ పార్టీల నుంచి… టిక్కెట్ల కోసం వలస వచ్చిన వారే. ముఖ్యంగా… ఇతర పార్టీల్లో టిక్కెట్లు రావని తెలుసుకున్న తర్వాత అవకాశాల కోసం.. జనసేన తలుపు తట్టిన వారే. తొలి జాబితాలోనే… వారికి… పవన్ కల్యాణ్… టిక్కెట్ అవకాశం కల్పించారు. యలమంచిలి జనసేన టిక్కెట్ దక్కించుకున్న సుందరపు విజయ్‌కుమార్ నిన్నామొన్నటి వరకు టీడీపీ నే. పాయకరావుపేట టిక్కెట్ దక్కించుకున్న నక్కా రాజబాబు.. వైసీపీ టిక్కెట్ దక్కదని తెలియడంతో.. జనసేనలోకి వచ్చారు. ఇక పాడేరు అభ్యర్థిగా ప్రకటించిన పసుపులేటి బాలరాజు కాంగ్రెస్ తరపున మంత్రిగా కూడా చేశారు. శ్రీకాకుళం అభ్యర్థి కోరాడ సర్వేశ్వరరావు టీడీపీలో.. పదవులు అనుభవించి… పోరాటయాత్ర సమయంలో.. జనసేనలో చేరారు. పలాసకు చెందిన కోత పూర్ణచంద్రరావు కూడా టీడీపీలో పని చేసిన నేతనే.
తుని అసెంబ్లీ టిక్కెట్ దక్కించుకున్న రాజా అశోక్‌బాబు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే. వైసీపీ టిక్కెట్ కోసం ప్రయత్నించి సాధ్యం కాకపోవడంతో..జనసేనలో చేరారు. రాజమండ్రి సిటీ అభ్యర్థి కందుల దుర్గేష్ కాంగ్రెస్, వైసీపీల్లో పని చేశారు. రాజోలు టిక్కెట్ దక్కించుకున్న రాపాక వరప్రసాద్ కూడా.. అంతే. వైసీపీలో టిక్కెట్ రాదని… జనసైనికుడయ్యారు. పి.గన్నవరం టిక్కెట్ దక్కించుకున్న పాముల రాజేశ్వరి, కాకినాడ సిటీ అభ్యర్థి ముత్తా శశిధర్, ముమ్మిడివరం అభ్యర్థి పితాని బాలకృష్ణ, మండపేట అభ్యర్థి వేగుళ్ల లీలాకృష్ణ వైసీపీ టిక్కెట్ రాదని తెలిసే… జనసేనలో చేరారు. వీరందరికీ… జనసేన అభ్యర్థిత్వం ఖరారు చేశారు. ఇక తాడేపల్లిగూడెం అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ రెండు రోజుల క్రి తం వరకూ టీడీపీ నేతనే. టిక్కెట్ ఆశ చూపి మరీ ఆయనను పార్టీలో చేర్చుకున్నారు. ఏలూరు అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు కూడా టీడీపీ నేతనే. కాకపోతే.. చింతమనేని ప్రభాకర్ మీద హత్యకు స్కెచ్ వేసి.. పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. చింతమనేనిపై… తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పవన్..ఆయనను సాదరంగా పిలిచి టిక్కెట్ ఇచ్చారు.
ఇక నాదెండ్ల మనోహర్ , తోట చంద్రశేఖర్, పత్తిపాడు- రావెల కిషోర్‌బాబు లాంటి ప్రముఖనేతల రాజకీయ చరిత్ర ప్రజల కళ్ల ముందే ఉంది. ధర్మవరం టిక్కెట్ దక్కించుకున్న మధుసూదన్ రెడ్డి.. టీడీపీ నేత. కడప జిల్లా రాజంపేట టిక్కెట్ ను టీడీపీకి చెందిన త్తిపాటి కుసుమ కుమారికి ఇచ్చారు. పార్లమెంట్ అభ్యర్థులను నలుగుర్ని ప్రకటిస్తే.. వారిలో ొకరు బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే. మిగిలిన వారిలో… కూడా.. కొంత మంది ఇతర పార్టీల సానుభూతిపరులుగా ఉన్న వారే. పారిశ్రామికవేత్తలు, మాజీ అధికారులు కొంత మందికి చాన్సిచ్చినా.. యువతకు మాత్రం… ప్రాధాన్యం మొదటి జాబితాలో దక్కలేదు.