చిత్తూరు జిల్లా టీడీపీ అధినేత సొంత జిల్లా. అయితే.. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప ఆయనకు.. అండగా నిలిచినట్లుగా.. చిత్తూరు జిల్లా.. తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ చంద్రబాబుకు అండగా నిలబడలేదు. ఏకపక్ష విజయాలు రాలేదు. కానీ ఆ సారి మాత్రం ఆ పరిస్థితి రాకూడదని… క్లీన్ స్వీప్ చేయాలన్న లక్ష్యంతో టీడీపీ చాలా ముందుగానే కసరత్తు చేస్తోంది. చిక్కుముళ్లు ఉన్న ఒకటి రెండు నియోజకవర్గాలు తప్ప.. అంతా సాఫీగా నడుస్తోంది. వైసీపీలో మాత్రం… అంతా గోప్యంగా సాగుతూండటంతో.. ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి.
చేరికలతో బలం పుంజుకున్న టీడీపీ..!
చిత్తూరు జిల్లాలో కుప్పం, పలమనేరు, పుంగనూరు, చంద్రగిరి, తిరుపతి, పీలేరు నియోజకవర్గ అభ్యర్థులను చంద్రబాబు ఇప్పటికే ఖరారు చేశారు. ప్రచారం కూడాప్రారంభమయింది. చిత్తూరులో మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, జీడీ నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే ఆర్.గాంధీ, తిరుపతిలో మబ్బు నారాయణరెడ్డి ఇప్పటికే టీడీపీలో చేరారు. తటస్థంగా ఉన్న సైకం జయచంద్రారెడ్డికి పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్ పదివిని కేటాయించడంతో ఆయన కీలకంగా మారారు. పూతలపట్టు నియోజకవర్గంలో ఇదివరకే బీజేపీకి నుంచి బంగ్లా ఆర్ముగం సైకిలెక్కారు. చంద్రగిరి నియోజవర్గంలో గత రెండు నెలల నుంచి పలువురు నాయకులు కార్యకర్తలు అధికార పార్టీలో చేరారు. ప్రచారం ప్రారంభమైన నియోజకవర్గాల్లో ప్రతి రోజు బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలు పసుపు కండువా కప్పుకుంటున్నారు. తిరుపతి, చంద్రగిరి, కుప్పం, పలమనేరు, పుంగనూరు, జీడీ నెల్లూరు, చిత్తూరు నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీల నుంచి తెదేపాలోకి వలసలు పెరుగుతుండడంతో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బలం పుంజుకుంటోంది. శ్రీకాళహస్తి నియోజకవర్గ అభ్యర్థిగా బొజ్జల సుధీర్‌రెడ్డి వైపు చంద్రబాబు మొగ్గు చూపారు. చిత్తూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకూ డీఏ సత్యప్రభ పోటీ చేయడం ఖాయమనుకున్నారు. కానీ మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్‌ను ఎమ్మెల్యే సత్యప్రభ దగ్గరుండి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేర్చారు. దీంతో తాను పోటీ నుంచి తప్పుకుని మనోహర్‌కు చాన్సిస్తారని చెబుతున్నారు. జీడీనెల్లూరు, సత్యవేడు, తంబళ్లపల్లి, మదనపల్లి, పూతలపట్టు, నగరి నియోజకవర్గాల అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది.
వైసీపీలో అందరికీ టెన్షనే..!
వైసీపీలో.. కొంత మంది అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పటికీ.. నమ్మకం కుదరక ప్రచారం ప్రారంభించడం లేదు. పుంగనూరు నుంచీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పీలేరు నుంచీ చింతల రామచంద్రారెడ్డి, చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నగరి నుంచీ రోజా, శ్రీకాళహస్తి నుంచీ బియ్యపు మధుసూదనరెడ్డి, చిత్తూరు నుంచీ జేఎంసీ శ్రీనివాసులు, తంబళ్ళపల్లె నుంచీ పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి, కుప్పం నుంచీ చంద్రమౌళి, తిరుపతి నుంచి భూమన కరుణాకరరెడ్డి, జీడీనెల్లూరు నుంచీ కళత్తూరు నారాయణస్వామి పోటీ చేస్తారని చెబుతున్నారు. కానీ.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తిరుపతి, నగరి, శ్రీకాళహస్తి, చిత్తూరు స్థానాల్లో మార్పులుంటాయని చెబుతున్నారు. మదనపల్లెలో మైనారిటీ అభ్యర్థి నవాజ్ పేరు ఖరారు చేసినప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పారెడ్డి .. టీడీపీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. పూతలపట్టు ఎమ్మెల్యేకి టిక్కెట్ నిరాకరించడంతో.. జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఏమైనా అధికారిక ప్రకటన వచ్చే వరకూ అందరూ… టెన్షన్‌తో ఎదురు చూసే పరిస్థితి ఉంది.
అంతంతమాత్రంగా జనసేన, జాతీయ పార్టీలు..!
జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ తొలి జాబితాలో పుంగనూరుకు చెందిన బోడె రామచంద్రయాదవ్‌కు టిక్కెట్ ప్రకటించారు. మిగిలిన 13 సెగ్మెంట్ల గురించి స్పష్టత ఇవ్వలేదు. కనీసం ఫలానా వారిని ఖరారు చేశారన్న సమాచారం కూడా శ్రేణులకు లేదు. తంబళ్ళపల్లెలో మలిపెద్ది ప్రభాకర్‌రెడ్డి, మదనపల్లెలో హచ్కుమార్లకు అవకాశం దక్కవచ్చు. లేదంటే చివరిక్షణంలో ఇతర ప్రధాన పార్టీల్లో టికెట్ దక్కనివారు వస్తే మార్పుచేర్పులుండచ్చుని అంటున్నారు. ఇక జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఎవర్ని నిలబెడుతుందో ఎవరూ పట్టించుకోవడం లేదు. తిరుపతి పార్లమెంట్ బరిలోకాంగ్రెస్ తరపున చింతా మోహన్ బరిలోకి దిగే అవకాశం ఉంది.