గుంటూరు జిల్లాలో టిక్కెట్ల కేటాయింపు.. టీడీపీ హైకమాండ్‌కు తలనొప్పి వ్యవహారంలా మారింది. రాయపాటి సాంబశివరావు తనకు లోక్‌సభ సీటు, తన కుమారుడికి.. సత్తెనపల్లి అసెంబ్లీ సీటును డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రెండు టిక్కెట్లు ఇవ్వలేమని.. రాయపాటి వయోభారం కారణంగా ఆయన కుమారుడికి కచ్చితంగా ఏదో చోట అసెంబ్లీ టిక్కెట్ సర్దుబాటు చేస్తామని హైకమాండ్ చెప్పింది. అయితే.. ఏ స్థానం అన్నదానిపై క్లారిటీ ఇవ్వడం లేదు. దాంతో.. రాయపాటి సాంబశివరావు అసంతృప్తికి గురయ్యారు. తనతో వైసీపీ నేతలు టచ్‌లోకి వచ్చారని ఆయన మీడియాకు లీక్ ఇచ్చారు. మరో వైపు.. టీడీపీ నుంచి ఎవరు వచ్చినా పార్టీలో చేర్చుకుని టిక్కెట్లు ఇచ్చేందుకు వైసీపీ రెడీగా ఉండటంతో.. తెలుగుదేశం పార్టీ నేతలు అప్రమత్తమయ్యారు. పలువురు టీడీపీ నేతలు రాయపాటితో సమావేశమయ్యారు.
తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని… రాయపాటికి నచ్చ చెప్పారు. అయితే.. వేరే పార్టీలో చేరే ఆలోచనేమీ లేదని… అసంతృప్తికి గురయ్యానని మాత్రం చెబుతున్నారు. తన కుటుంబానికి ఎలా న్యాయం చేయాలో… చంద్రబాబుకు తెలుసంటున్నారు. మరో వైపు రాయపాటి కుమారుడు అడుగుతున్న సత్తెనపల్లి సెగ్మెంట్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోడెల శివప్రసాదరావు మళ్లీ పోటీకి సిద్ధమయ్యారు. తనకే టిక్కెట్ ఖరారయిందని ఆయన ప్రచారం ప్రారంభించారు. అయితే.. కోడెల సత్తెనపల్లికి వద్దే వద్దంటూ.. కొంత మంది టీడీపీ నేతలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. దీని వెనుక కుట్ర ఉందని కోడెల అంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సీటును రాయపాటి కుటుంబం ఎలా కోరుతుందని ఆయన ప్రశ్నిస్తున్నారు.
మరో వైపు.. రాయపాటి ఏ నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి ఆయన వర్గీయుల్లో ఏర్పడింది. రాయపాటి సూచనతో టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్.. పార్టీ మారే పరిస్థితి లేదని చెబుతున్నారు. రాయపాటి కుటుంబానికి రాజకీయాల్లో ఓ చరిత్ర ఉందని.. వారి కుటుంబానికి చంద్రబాబు సముచిత స్థానం కల్పిస్తారని అంటున్నారు. తనకు ఎక్కడ టిక్కెట్ ఇచ్చినా పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. లెక్కలు, సామాజిక సమీకరణాలు తేలకపోతూండటంతో…మొదటి జాబితాలో గుంటూరు జిల్లాకు సంబంధించి చాలా పరిమితంగానే టిక్కెట్లను ప్రకటించనున్నారు.