ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి… గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయన కేటీఆర్‌తో సమావేశం అయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై పోటీ చేసి విజయం సాధించారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన .. గత ఎన్నికల్లో మాత్రమే పోటీ చేసే అవకాశం దక్కించుకున్నారు. గెలిచిన మూడు నెలల్లోనే ఆయన టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ కేవలం ఖమ్మం సీట్లోనే విజయం సాధించింది. మిగతా తొమ్మిది స్థానాల్లో… ఎనిమిది కాంగ్రెస్, టీడీపీ కూటమి గెలుచుకోగా.. ఒకటి కాంగ్రెస్ రెబల్ గెలిచారు. కాంగ్రెస్ రెబల్ గా గెలిచిన వైరా ఎమ్మెల్యే రాములు నాయక్‌ను టీఆర్ఎస్లో చేరిపోయారు. ఆ తర్వాత పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఆ తర్వాత ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ టీఆర్ఎస్ గూటికి చేరారు. టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన సండ్ర వెంకటవీరయ్య కూడా టీడీపీ రాజీనామా చేసి టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు. ఇప్పుడు పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి కూడా ఆ జాబితాలో చేరారు. మరో ఎమ్మెల్యే కూడా.. రేపో మాపో టీఆర్ఎస్లో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో పదహారు లోక్‌సభ సీట్లు గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉన్న టీఆర్ఎస్కు ఖమ్మంలో మాత్రమే ఇబ్బందికర పరిస్థితి ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో .. ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి లక్ష ఓట్లకుపైగా వెనుకబడి ఉంది. దీంతో.. ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రయోగించారు. కాంగ్రెస్ పార్టీ ఆత్మవిస్వాసాన్ని దెబ్బతీయడంతో పాటు ఖమ్మం సీటును కూడా తన ఖాతాలో వేసుకోవాలని టీఆర్ఎస్ గట్టిగా ప్రయత్నిస్తోంది.