తెలుగుదేశం పార్టీ ప్రముఖులకు.. సీట్లు ఖరారు కావడం లేదు. లోక్సభ టిక్కెట్లకు.. అసెంబ్లీ స్థానాలకు లింక్ కుదరకపోతూండటంతో.. ఎప్పటికప్పుడు కసరత్తు వాయిదా పడుతోంది. మంత్రి గంటా శ్రీనివాసరావు, భీమిలి నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. కానీ భీమిలి నుంచి ఆయన పేరు కాక.. చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి. ఇప్పడు గంటా భీమిలి నుంచి పోటీ చేస్తారా లేక విశాఖ అనకాపల్లి పార్లమెంటు స్ధానాల నుంచి పోటీ చేస్తారా అనే అంశం తేలాల్సి ఉంది. కొత్త సమీకరణాల ప్రకారం.. అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచి కూడా గంటా పేరు పరిశీలనలో ఉంది. మరోవైపు మంత్రి జవహర్ పరిస్ధితి కూడా డోలాయమానంలో ఉంది. కొవ్వూరుకు జవహర్ వద్దంటూ.. టీడీపీ క్యాడర్ నిరసన ప్రదర్శనలు నిర్వహించింది.
ఆయనను టీడీపీ హై కమాండ్ ఆయనను తిరువూరు నుంచి పోటీచేయించాలని భావిస్తోంది. విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకూ అదే పరిస్థితి. దాంతో ఆమెను కొవ్వూరు నుంచి పోటీచేయించాలని భావిస్తోంది. మాజీ మంత్రి పీతల సుజాతకు ఈ సారి టిక్కెట్ దక్కడం కష్టంగా మారింది. చింతలపూడి నియోజకవర్గంలో అసమ్మతి ఏర్పడటంతో ఆమెను మార్చి కర్రా రాజారావుకు టికెట్ ఖరారు చేశారు. విశాఖపట్నం జిల్లా నర్సిపట్నం ఎమ్మెల్యే, మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తన కుమారుడికి కూడా టిక్కెట్ కావాలంటున్నారు. ఇవ్వకపోతే.. నర్సీపట్నం నుంచి తాను విరమించుకుంటానని.. తన కుమారుడికిచాన్సివ్వాలని కోరుతున్నారు. కానీ చంద్రబాబు అయన్న పాత్రుడే పోటీ చేయాలని కోరుతున్నారు.
మరో మంత్రి సిద్దారాఘవరావు పోటీపై కూడా సస్పెన్స్ ఏర్పడింది. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీచేయాలని సిఎం సూచించారు. చేయడానికి సిద్ధమే అయినా తన కుమారుడికి దర్శి స్ధానం ఇవ్వాలని శిద్దా కోరారు. మరో మంత్రి పరిటాల సునీత రాప్తాడు నుంచి తన బదులు తన కుమారుడు శ్రీరామ్ పోటీచేస్తారని చెపుతున్నారు. అయితే తెలుగుదేశం హైకమాండ్ మాత్రం సునీతనే పోటీ చేయమని కోరుతోంది. ఇలా చాలా మంది నేతల డిమాండ్లకు.. హైకమాండ్ చేసే సూచనలకు పొంతన లేకుండా పోయింది. +