టాలీవుడ్ ని ఎప్పటి నుంచో ఊరిస్తున్న కాంబినేషన్ మహేష్‌బాబు – రాజమౌళి.
అటు రాజమౌళి, ఇటు మహేష్ బాబు కూడా ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బహుశా ఆర్.ఆర్.ఆర్ తరవాత రాజమౌళి పట్టాలెక్కించే చిత్రం మహేష్‌బాబుదే కావొచ్చు. అయితే ఈ సినిమా ఎలా ఉండబోతోంది? ఏ జోనర్లో ఉండబోతోంది? అనే విషయాలకు సంబంధించిన ఓ క్లూ దొరికేసింది. మహేష్ బాబు కోసం జేమ్స్ బాండ్ తరహా కథని తయారు చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. `ఆర్.ఆర్.ఆర్` ప్రెస్ మీట్లోనే మహేష్ సినిమాకి సంబంధించిన ప్రశ్న ఎదురైంది.
అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ల గురించి మనకు తెలియని కథని ఈ సినిమాలో చూపిస్తున్నాడు రాజమౌళి. యువ అల్లూరిగా రామ్‌చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అల్లూరి సీతారామరాజు అనగానే తెలుగు ప్రేక్షకులకు సూపర్ స్టార్ కృష్ణ గుర్తొస్తారు. ఆయన వారసుడిగా మహేష్ బాబుని ఈసినిమా కోసం ఎందుకు పరిగణలోనికి తీసుకోలేదు? అనే ప్రశ్న రాజమౌళికి ఎదురైంది.
దానికి తనదైన శైలిలో తెలివిగా సమాధానాన్ని దాటేశాడు జక్కన్న. ఇది వరకు ఓ సందర్భంలో మహేష్ బాబుని అల్లూరి సీతారామరాజు పాత్రలో చూపిస్తే ఎలా ఉంటుంది? అనే తనవ్యాఖ్యకు ప్రేక్షకుల నుంచి సరైన స్పందన రాలేదని, జేమ్స్ బాండ్‌గా చూపిస్తే ఎలా ఉంటుంది? అని అడిగితే… ప్రేక్షకులు విపరీతంగా స్పందించారని, అందుకే తానూ ఆ ఆలోచన చేయలేదని చెప్పుకొచ్చాడు. సో.. మహేష్ జేమ్స్ బాండ్‌గా బాగుంటాడన్న విషయాన్ని రాజమౌళి గుర్తించాడన్నమాట. తెలుగులో హాలీవుడ్ స్థాయిలో జేమ్స్ బాండ్ సినిమా తీయాలంటే అది రాజమౌళి వల్లే సాధ్యం అవుతుంది. మరి… ఆ జోనర్‌కి మనం కూడా ఫిక్సయిపోవాలేమో.