తునిలో నిన్న జరిగిన విద్వంసానికి ‘మీరు కారకులు అంటే కాదు…మీరే కారకులని’ అధికార, ప్రతిపక్ష పార్టీలు- తెదేపా, వైకాపాలు ఆరోపణలు చేసుకొంటున్నాయి. ఇటువంటి సమయంలో ఈవిధంగా ఆరోపణలు చేసుకోవడం సహజమే కానీ తెరాస అధికార పత్రికగా పేరున్న ‘నమస్తే తెలంగాణా’ కూడా చంద్రబాబు నాయుడుని విమర్శిస్తూ “ఏపిలో బాబు నీరో” అనే శీర్షికన ఈరోజు సంచికలో ఒక కధనం ప్రచురించడం విశేషం.
ఏపిలో కాపులు రిజర్వేషన్లు కోరుతూ ఉద్యమానికి సిద్దం అవుతున్నారని తెలిసినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోమ్ నగరం తగులబడుతుంటే ఫిడేల్ వాయించుకొంటూ కూర్చొన్న నీరో చక్రవర్తిలాగ హైదరాబాద్ వచ్చి గ్రేటర్ ఎన్నికల ప్రచారం చేసుకొంటూ కాలక్షేపం చేసారని ఆ కధనంలో విమర్శించింది. సొంత రాష్ట్రం భగ్గున మండిపోతుంటే పట్టించుకోకుండా పక్క రాష్ట్రంలో రాజకీయాలు, కుట్రలు చేస్తూ కాలక్షేపం చేసారని విమర్శించింది.ఆయనతో బాటు ఆయన మంత్రులు కూడా కాపులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడి, రాష్ట్రాన్ని గాలికొదిలేసి హైదరాబాద్ వచ్చి గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారని విమర్శించింది. కాపు గర్జన సభని నిర్వహిస్తామని పది రోజులుగా కాపు నేతలు చెపుతునప్పటికీ ఏపి ముఖ్యమంత్రి, మంత్రులు పట్టించుకోకుండా హైదరాబాద్ వచ్చి గ్రేటర్ ఎన్నికలలో మునిపోవడం చేతనే నిన్న తునిలో అటువంటి సంఘటనలు జరిగాయని నమస్తే తెలంగాణా పత్రిక తన కధనంలో పేర్కొంది.
ఆ కధనంలో తుని సంఘటనలను నివారించడంలో తెదేపా ప్రభుత్వం వైఫల్యం గురించి చేసిన విమర్శలు సహేతుకంగానే ఉన్నప్పటికీ, చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రులు గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఒక రాజకీయ కుట్రగా అభివర్ణించడం చాలా హాస్యాస్పదంగా ఉంది. తెలంగాణాలో తెదేపా, చంద్రబాబు నాయుడు కనబడకూడదనే తెరాస అభిప్రాయాలకు అది అద్దం పడుతున్నట్లుంది తప్ప సహేతుకంగా లేదు.