ప్రకాశం జిల్లాల్లో అభ్యర్ధుల ఎంపిక టీడీపీ హైకమాండ్ కు చివరి నిముషంలో ఇబ్బందులు తెచ్చిపెట్టింది. కనిగిరి, దర్శి అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఒంగోలు పార్లమెంట్ స్థానంలో ఎవరిని నిలబెట్టాలన్నదానిపై క్లారిటీ లేకుండా పోయింది. అనేక కాంబినేషన్లు పరిశీలిస్తున్నా.. ఏదీ వర్కవుట్ కావడం లేదు. దర్శి ఎమ్మెల్యేగా ఉన్న సిధ్ధారాఘవరావును ఒంగోలు పార్లమెంటుకు పోటీ చేయించి కనిగిరి టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనర్సింహరెడ్డికి దర్శి టికెట్, కదిరి బాబూరావును మళ్ళీ కనిగిరి నుంచే పోటీకి దించాలని హైకమాండ్ భావించింది. అయితే దీనిపై అటు శిద్ధా కానీ.. ఇటు ఉగ్రనరసింహారెడ్డి కానీ అంగీకారం తెలుప లేదు.
ఇలా చేస్తే కనిగిరి, దర్శి అసెంబ్లీ నియెజకవర్గాలతో పాటు ఒంగోలు పార్లమెంటులో కూడా ఓడిపోతామని నివేదికలు అందాయి. దాంతో.. మళ్లీ కొత్త సమీకరణాల వేట ప్రారంభించారు. మరో వైపు దర్శి నంచే శిధ్దా రాఘవరావును పోటీచేయించాలనే ఒత్తిడి క్యాడర్ నుంచి వచ్చింది. నిజానికి కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావుకు ఎమ్మెల్సీ ఇస్తామని.. పోటీకి దూరంగా ఉండాలని చంద్రబాబు నచ్చ చెబుతున్నారు. కానీ ఆయన పోటీ చేసి తీరుతానని చెబుతున్నారు. కదిరి బాబూరావు .. బాలకృష్ణకు సన్నిహితుడు. బాబూరావును ఒక దశలో కనిగిరి నుంచి తప్పించి దర్శి నుంచి పోటీచేయించాలని నిర్ణయించారు. కానీ బాలకృష్ణ జోక్యం చేసుకుని బాబురావుకు కనిగిరే ఇవ్వాలని పట్టుబట్టినట్లు చెబుతున్నారు.
నిజానికి… కనిగిరిలో.. కదిరి బాబూరావు పరిస్థితి.. ఏమీ బాగోలేదని.. అక్కడ రెడ్డి సామాజికవర్గ అభ్యర్థి అయితే సునాయాసంగా విజయం సాధిస్తారనే నివేదికలు టీడీపీ హైకమాండ్ వద్ద ఉన్నాయి. అదే సమయంలో… కనిగిరిలో రెడ్డి అభ్యర్థి వల్ల.. ఒంగోలు లోక్‌సభ స్థానంలోనూ… అడ్వాంటేజ్ ఉంటుందనుకుంటున్నారు. అక్కడ ఉగ్రనరసింహారెడ్డికి.. మంచి ఆదరణ ఉంది. అయితే చంద్రబాబు .. బాలకృష్ణను కాదనే పరిస్థితి లేదు. అందుకే… సీటు ముడి పడిపోయింది. బాలకృష్ణను చంద్రబాబు కన్విన్స్ చేయగలిగితే… పెద్ద సమస్యకు పరిష్కారం దొరికినట్లే..!