నవ్యాంధ్ర ఉత్త చేతులతో… పయనం ప్రారంభించిందనేది నిజం. అందుకే… ఏపీని ఆదుకోవడానికి చాలా చేస్తున్నామంటూ… హామీలు ఇచ్చారు … కాంగ్రెస్, బీజేపీ నేతలు. కేంద్రంలో వచ్చేది బీజేపీ కాబట్టి… విభజన హామీలు నెరవేరుస్తుందని… టీడీపీ అధినేత ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఐదేళ్లు గడిచాయి. కానీ విభజన హామీలు నెరవేరలేదు. బీజేపీ మోసం చేసిందని టీడీపీ బయటకు వచ్చేసింది. అన్నీ ఇచ్చేశామని బీజేపీ చెప్పడం ప్రారంభించింది.
హోదా సహా ఒక్క విభజన హామీ అమలు కాలేదు..!
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా 2014 ఫిబ్రవరిలో ఆనాటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఐదేళ్లపాటు ఇస్తామని ప్రకటించారు. 2014 మేలో ఏర్పడిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ హామీని అమలు చేయలేదు. ఆర్థిక సంఘం పేరు చెప్పి… హోదా పేరు లేకపోయినా.. అంతకు మించిన నిధులు ఇస్తామని చెప్పి.. అప్పటికి మిత్రపక్షంగా ఉన్న ప్రభుత్వాన్ని ఒప్పించి.. 2016 సెప్టెంబర్ 7న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. ప్యాకేజీలో భాగంగా ఇప్పటి వరకు పైసా కూడా ఇవ్వలేదు. విభజన చట్టంలో 108 సెక్షన్లు, 13 షెడ్యూళ్ళు పొందుపరచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అనేక హామీలు ఇచ్చారు.ఈ చట్టంలోని ప్రధానాంశాలను అమలు చేయకుండా ఆంధ్రులకు అన్యాయం చేస్తే, ఒత్తిడి తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయింది. దుగ్గరాజపట్నంలో భారీ నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేసి, 2018 కల్లా మొదటి దశ పూర్తి చేయాలి. కడపలో సమగ్ర ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పాలి. ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్‌ఫీల్డ్ ముడి చమురు శుద్ధి కర్మాగారం, పెట్రో రసాయన సముదాయాన్ని నెలకొల్పాలి. వైజాగ్–చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను, ఢిల్లీ–ముంబై పారిశ్రామిక కారిడార్ తరహాలో ఏర్పాటు చేయాలి. విభజన జరిగిన నాటి నుంచి 6 నెలల్లోగా నూతన రైల్వేజోన్ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలి. విశాఖపట్నం, విజయవాడలలో మెట్రోరైలు ఏర్పాటు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలి. వీటిలో ఒక్క పరిశ్రమ విషయంలో కూడా నిర్దిష్టమైన చర్యలు తీసుకోకుండా ఏపీకి పూర్తి అన్యాయం చేసింది
విద్యాసంస్థలకు అరకొర నిధులు..!
ప్రతీ రాష్ట్రంలోనూ జాతీయ విద్యాసంస్థలు ఉండాలన్నది విధానం. దాని ప్రకారం ఏపీలో 11 జాతీయ విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఐఐటీ, ఐఐఎం, ఎన్ఐటీ, సెంట్రల్ యూనివర్శిటీ, గిరిజన యూనివర్శిటీ, ఎయిమ్స్, వ్యవసాయ విశ్వవిద్యాలయం, పెట్రోలియం యూనివర్శిటీ మొదలగు వాటిని ఏపీలో ఏర్పాటు చేయాలి. ఈ జాతీయ విద్యా సంస్థలకు మొత్తం అంచనా వ్యయం 9,600 కోట్లు కాగా, కేంద్రం గత నాలుగేళ్ల కేవలం రూ. 421. 07 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది మరో పది కోట్లు మాత్రమే బడ్జెట్లో చూపించారు. ఐఐటీ, ఐఐఎం మొదలైన సంస్థలన్నీ అద్దె భవనాలలోనే నడుస్తున్నాయి. ఎయిమ్స్, వ్యవసాయవిశ్వ విద్యాలయాలకు శంకుస్థాపన చేసినప్పటికీ ఇంకా పనులు ప్రారంభం కాలేదు. అనంతపురంలో సెంట్రల్ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలంటే కేంద్రం సెంట్రల్ యూనివర్శిటీ చట్టాన్ని సవరించాలి. విజయనగరంలో గిరిజన యూనివర్శిటీని ఏర్పాటు చేయాలంటే ఇందిరాగాంధీ జాతీయ గిరిజన యూనివర్శిటీ చట్టంలో మార్పుచేయాలి. కేంద్రం ఇప్పటి వరకు ఈ సవరణల గురించి పట్టించుకోలేదు.
రాజధాని, పోలవరంపైనా చిన్న చూపే..!
విభజన చట్టం 9, 10 షెడ్యూల్స్‌లో రెండు రాష్ట్రాలకు చెందిన ఉమ్మడి సంస్థలను ఉభయ రాష్ట్రాలు 58:42నిష్పత్తిలో పంచుకోవాలి. కానీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కేంద్రం పక్కన పెట్టేసింది. రాయలసీమ, ఉత్తరకోస్తా జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీతోపాటు, తగిన ప్రోత్సాహకాలు కల్పించాలి. విదర్భ, బుందేల్‌ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి 25వేల కోట్ల రూపాయల వరకూ ఇవ్వవచ్చని ఆశిస్తే, కేంద్రం ఇప్పటి వరకు 7 జిల్లాలకు కేవలం 1,050 కోట్లు మాత్రమే ఇచ్చింది. రూ. 350 కోట్లు ఇచ్చి వెనక్కి తీసుకోవడం మరింత దారుణమైన విషయం. విభజన చట్టంలో సెక్షన్ 94(3) ప్రకారం నూతన రాజధానికి అవసరమైన ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని కేంద్రం అందించాలి. పాలనా రాజధాని నిర్మాణానికి సుమారు రూ. 60 వేల కోట్లు అంచనావేస్తే ఇప్పటి వరకూ కేంద్రం 2,500 కోట్లు మాత్రమే ఇచ్చింది. దీంట్లో వెయ్యి కోట్లు గుంటూరు, విజయవాడ భూగర్భ డ్రైనేజీ కోసం ఇచ్చారు. విభజన చట్టంలోని సెక్షన్ 90 ప్రకారం పోలవరం ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించి, ప్రాజెక్టు అభివృద్ధి, నియంత్రణ కేంద్రం తన పరిధిలోకి తీసుకున్నట్టు ప్రకటించారు. అన్ని రకాల పర్యావరణ, అటవీ పునరావాస, పునర్నిర్మాణ అనుమతులు పొంది కేంద్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలి. ఇప్పటి వరకు చేసిన పనులకు 3,217 కోట్లు రావలసి ఉంది. నిధులు విడుదల చేయడం లేదు.
బీజేపీ మోసం చేసింది.. చంద్రబాబు చేతులెత్తేశారు..!
పార్లమెంట్ లో చేసిన చట్టాన్ని అమలు చేయడం కేంద్రం బాధ్యత. పోరాడి సాధించాల్సినది టీడీపీ బాధ్యత. కానీ.. ఈ రెండు పార్టీలు.. ఈ విషయంలో విఫలమయ్యాయి. మోసం చేశారని.. ఇప్పుడు చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారు. ఈ వైఫల్యంలో ఆయనది కూడా ఉంది. అయితే… ఏపీలో ప్రతిపక్షం .. టీడీపీ లేకపోతే.. తామున్నామని బీజేపీకి భరోసా ఇవ్వడం వల్లే.. ఈ పరిస్థితి వచ్చిందని ఆ పార్టీ అంటోంది. ఏది నిజమో కానీ.. మొత్తానికి రాజకీయం వల్ల ఏపీకి నష్టమే జరిగింది.