హీరోగా గత నాలుగేళ్లలో ఒక్క హిట్టూ లేక తల్లడిల్లిపోతున్నాడు అల్లరి నరేష్. మహేష్ బాబు సినిమా `మహర్షి`లో కీలక పాత్ర పోషించడం మినహా.. ఈమధ్య కాలంలో నరేష్ సాధించిందేం లేదు. ప్రస్తుతం హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. నందిని నర్సింగ్ హోమ్‌తో ఆకట్టుకున్న గిరి ఈ చిత్రానికి దర్శకుడు. షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఈ సినిమా కోసం `బంగారు బుల్లోడు` అనే పేరు పరిశీలిస్తున్నారు. బాలయ్య సూపర్ హిట్ సినిమాల్లో ఇదొకటి. టైటిల్ వాడేయడమే కాదు.. ఆ సినిమాలోని `స్వాతిలో ముత్యమంత` అనే పాటని రీమిక్స్ చేయాలని భావిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాత అనిల్ సుంకర బాలయ్యకు పెద్ద ఫ్యాన్. అందుకే బాలయ్య టైటిల్‌నీ, పాటనీ ఈసినిమా కోసం వాడుకోవాలనిచూస్తున్నాడని తెలుస్తోంది. నరేష్పాత టైటిళ్లనీ, పాటల్నీ వాడుకోవడం కొత్తేం కాదు. ఇది వరకు చిరంజీవి, కృష్ణ సినిమాల్లోని సూపర్ హిట్ పాటల్ని వాడేశాడు. ఈసారి బాలయ్య వంతు వచ్చింది. ఈ పాట, టైటిల్ అయినా… నరేష్‌కి హిట్టు ఇస్తుందేమో చూడాలి.