తెలుగుదేశం పార్టీలో చేరేందుకు మరో వైసీపీ ఎమ్మెల్యే రెడీ అయ్యారు. చిత్తూరు జిల్లా మదనపల్లె ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి… ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ …దేశాయ్ తిప్పారెడ్డికి టిక్కెట్ నిరాకరించింది. ఆ స్థానంలో.. ఓ మైనార్టీ అభ్యర్థికి టిక్కెట్ ఖరారు చేశారు. దాంతో.. తిప్పారెడ్డి అసంతృప్తికి గురయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించిన తర్వాత ఆ పార్టీ తరపున తొలిసారి ఓ ప్రజాప్రతినిధిగా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దేశాయ్ తిప్పారెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత ఎన్నికల్లోనూ… మదనపల్లె టిక్కెట్ ..వైసీపీ కేటాయించడంతో.. పోటీ చేసి విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీకి మదనపల్లెలలో బలమైన నాయకత్వం లేకపోవడంతో.. ఆయనకు టిక్కెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
మదనపల్లె నుంచీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, మాజీ ఎమ్మెల్సీ నరేష్‌కుమార్‌రెడ్డి, ముఖ్యనేత గంగారపు రామ్‌దాస్ చౌదరిలు టీడీపీ తరపున టిక్కెట్ ఆసించారు. వారితో పలు మార్లు టీడీపీ హైకమాండ్ చర్చలు జరిపింది. ఇప్పుడు బలమైన నేతగా ఉన్న తిప్పారెడ్డి.. పార్టీలోకి వచ్చేందుకు సిద్ధపడటంతో.. అందరికీ సర్ది చెప్పి… ఆయనకు టిక్కెట్ ఖరారు చ ేయాల్సి ఉంది. తిప్పారెడ్డి గురువారమే ఓ సారి చంద్రబాబును కలిసినట్లు సమాచారం. టిక్కెట్ పై నిర్దిషమైన హామీ ఇవ్వని చంద్రబాబు పార్టీలో చేరాలని సూచించారు. టికెట్ కోసం ఆయన మరోసారి సీఎం నివాసానికి వచ్చారు. టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులైన యనమల రామకృష్ణుడు, టీడీ జనార్థన్, వర్ల రామయ్య తదితరుల సమక్షంలో అశావాహులతో చర్చలు జరుగుతున్నాయి.
మదనపల్లెలో తెలుగుదేశం పార్టీకి గతంలో గొప్ప విజయాలు లబించలేదు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో భాగంగా… ఆ పార్టీకి ఇచ్చేసింది. ఆ పార్టీ తరపున… చల్లపల్లె నరసింహారెడ్డి అనే నేత పోటీ చేశారు. కానీ పదిహేను వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ సారి పొత్తు లేకపోవడంతో.. నేరుగా టీడీపీనే బరిలోకి దిగుతోంది. దేశాయ్ తిప్పారెడ్డి… పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు. అయినప్పటికీ.. ఆయన కూడా టిక్కెట్ ఇప్పించలేదు. పైగా మదనపల్లెలో.. మైనార్టీకి టిక్కెట్ ఇవ్వాలని వారే జగన్ కు సిఫార్సు చేశారనే.. అసంతృప్తి తిప్పారెడ్డిలో ఉంది.