కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ అని ప్రకటించిన తర్వాత.. టీఆర్ఎస్ నేతలు… ఏపీ రాజకీయంలో ప్రత్యక్షంగా పాలు పంచుకోవడం ప్రారంభించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పటికే పలుమార్లు ఏపీకి వచ్చి టీడీపీని విమర్శించి వెళ్లారు. ఇప్పుడు మాధవరం కృష్ణరావు కూడా.. తన నియోజకవర్గ పరిధిలో ఉన్న హైదరాబాద్ ఓటర్ల బంధువులతో మీటింగ్ పెడుతున్నారు. నిజానికి ఉత్తరాంద్రకు చెందిన బీసీ కులాలను టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే.. ఓసీలుగా మార్చింది. వారిలో మళ్లీ బీసీల్లో చేర్పిస్తామని ప్రతీ సారి మాధవరం కృష్ణారావు హామీ ఇస్తున్నారు కానీ .. చేయలేదు. కానీ ఓట్ల కోసం మాత్రం పదే పదే వస్తున్నారని… హైదరాబాద్లో ఉంటున్న వారి బంధువులు… విమర్శలు గుప్పిస్తున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున … ప్రచారం చేసేందుకు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంకు వచ్చారు. ఆయనకు వైసీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. హైదరాబాద్లోని కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో .. శ్రీకాకుళం జిల్లా వాసులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారి కుటుంబసభ్యులను.. వైసీపీకి ఓట్లు వేసేలా ప్రచారం చేయాడానికే ఆయన శ్రీకాకుళం వచ్చారని టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. తెలంగాణ ఎన్నికలకు ముందు కూడా ఆయన శ్రీకాకుళం జిల్లాకు వచ్చారు. అప్పట్లో తీతలి తుపాను బాధిత కుటుంబాలకు కొంత మొత్తం సాయం చేశారు.
అప్పుడు.. అలా సాయం చేసి.. ఓట్లు అడిగి వెళ్లారు. అప్పట్లో కూకట్ పల్లి సెగ్మెంట్లో వైసీపీ ఆయనకు బహిరంగంగానే మద్దతు ఇచ్చింది. ఇప్పుడు ఆ కృతజ్ఞతతో పాటు.. టీఆర్ఎస్ పూర్తి స్థాయిలో.. వైసీపీకి సహకరిస్తూండటంతో.. ఆ ప్రయత్నంలో భాగంగానే.. వైసీపీ ప్రచారానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీ నేతలు… మాధవరం కృష్ణారావుకు ఘనస్వాగతం పలికి… ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేయడం దీనికి సంకేతం అంటున్నారు. ఓ రకంగా… హైదరాబాద్లో ఉన్న వారి బంధువులకు.. వైసీపీకి ఓటు వేయాలనే ఆదేశాల్లాంటి సూచనలు చేయడానికి ఆయన వచ్చారంటున్నారు.