వైఎస్ వివేకానందరెడ్డి మృతి విషయంలో నేరుగా పోలీసులపై ఆరోపణలు చేస్తూ… వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త వ్యూహం అమలు చేస్తున్నారు. ఈ హత్యను సాకుగా చూపి.. తాము డిమాండ్ చేస్తున్న డీజీపీ తొలగింపు అంశాన్ని గట్టిగా వినినిపిస్తున్నారు. వివేకానందరెడ్డి అంత్యక్రియలు ముగిసిన తర్వాత అఘమేఘాల మీద హైదరాబాద్ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ను కలిసి… డీజీపీ, ఇంటలిజెన్స్ డీజీని తొలగించాలనే డిమాండ్ ను వినిపించారు. వివేకా హత్యకేసును సీబీఐకి అప్పగించాలని జగన్ గవర్నర్ కు విజ్ఞప్తి చేసారు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ టీడీపీకి వాచ్‌మెన్‌లా మారిందని విమర్శలు గుప్పించారు. మేం ఎస్పీ, డీఐజీతో మాట్లాడుతుండగానే… ఏబీ వెంకటేశ్వరరావు చాలా సార్లు ఫోన్ చేశారని జగన్ ఆరోపించారు. ఇంటలిజెన్స్ డీజీ.. ఎస్పీ,డీఐజీకి ఫోన్ చేయడమే తప్పన్నట్లుగా జగన్ మాట్లాడారు. 23మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్పించడంలో… ఇంటలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు పాత్ర ఉందని జగన్ ఆరోపించారు.
జమ్మలమడుగు వైసీపీ అభ్యర్థి సుధీర్‌రెడ్డిని గెలిపించేందుకు… జమ్మలమడుగులో వివేకానందరెడ్డి విస్తృతంగా పర్యటించారని.. ఓటమి భయంతో టీడీపీ నేతలు ఘాతుకానికి పాల్పడ్డారన జగన్ ఆరోపించారు. మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని జగన్ ప్రశ్నించారు. చనిపోయిన వ్యక్తి సామాన్యుడు కాదు, మాజీ సీఎం సోదరుడన్నారు. డీజీపీ, అడిషనల్ డీజీని వెంటనే తప్పించాలని గవర్నర్‌ను కోరామన్నారు. ఈ పోలీసు అధికారులు ఉంటే… రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగవన్నారు. సీబీఐ విచారణకు ఆదేశించకపోతే… కోర్టుకు వెళ్తామని ప్రకటించారు. చంద్రబాబు తీరు దొంగే దొంగా దొంగా అన్నట్టు ఉందని విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లో గెలిచేందుకు బాబు ఎంతకైనా దిగజారుతారన్నారు.
చంద్రబాబుకు రిపోర్టు చేసే విచారణతో మాకు లాభం జరగదనన్నారు. వైఎస్ మరణంపై మాకింకా అనుమానాలున్నాయన్నారు. వాస్తవాలను తప్పుదారి పట్టించేందుకు కథలు అల్లుతున్నారని ఆరోపించారు. కుట్రలో భాగంగానే కడప ఎస్పీని 40రోజుల క్రితం మార్చారన్నారు.
జగన్మోహన్ రెడ్డి.. వివేకానందరెడ్డి హత్య విషయంలో పోలీసులు దర్యాప్తు జరుగుతూండగానే.. ఎన్నో అనుమానాలు ముఖ్యంగా.. వైఎస్ కుటుంబీల వ్యవహారం నుంచి వెల్లువెత్తుతూండగానే.. జగన్ మాత్రం.. ఈ విషయాన్ని టీడీపీ ఖాతాలో వేయడానికి తాపత్రయ పడిపోతున్నారు. దీన్ని ఓ రాజకీయ అవకాశంగా మల్చుకుని… డీజీపీని విధుల నుంచి తొలగించేలా చేయడానికి ఉపయోగించుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.