సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో చేరాలని అంతిమంగా నిర్ణయించుకున్నారు. కొద్ది రోజులుగా ఆయన టీడీపీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీ నేతలు చర్చలు కూడా జరిపారు. కానీ చివరికి జనసనలో చేరాలని నిర్ణయించుకున్నారు. పవన్ కల్యాణ్‌ను కలిశారు. ఇక పార్టీలో చేరడమే లాంఛనం. నిజానికి రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశంతోనే 2018 మార్చిలో స్వచ్చంద పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి సొంత రాష్ట్రానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ఏపీలో పర్యటించారు. రైతులు, మహిళలు, విద్యార్థులతో సమావేశాలు నిర్వహించి, వారి కష్టాలను తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. వ్యవసాయమంత్రిని కావాలన్న కోరికను కూడా వెలిబుచ్చారు.
బీజేపీ నుంచి ఆహ్వానం వచ్చినా ఆయన చేరలేదు. ఒకానొక సమయంలో సొంత పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఎన్నికలకు సమయం దగ్గర పడిన కారణంగా పార్టీ పెట్టే ఆలోచనను విరమించుకున్నారని అంటున్నారు. లక్ష్మీనారాయణతో పాటు ఆయన తోడల్లుడు, మాజీ వీసీ రాజగోపాల్ కూడా జనసేనలో వెళ్లనున్నారు. లక్ష్మీనారాయణకు జనసేన నుంచి ఎంపీ సీటు ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పవన్ హామీ ఇచ్చారని, ఆయన పార్టీలో చేరిన వెంటనే పోటీ చేసే స్థానాన్ని కూడా అధికారికంగా ప్రకటించనున్నారని చెబుతున్నారు.
వీవీ లక్ష్మినారాయణకు.. గతంలో తను చేసిన ఉద్యోగమే… రాజకీయాలకు ఇబ్బందికరంగా మారింది. రాజకీయాల్లో చేరాలనుకున్నప్పుడు అనేక విమర్శలు వస్తాయి. వాటిని పరిగణలోకి తీసుకుంటే ఎవరూ రాజకీయాలు చేయలేరు కానీ… వీవీ లక్ష్మినారాయణ మాత్రం.. టీడీపీలో చేరాలనుకున్నా… విమర్శలు వస్తాయన్న కారణంగా వెనుకడుగు వేశారు. ఓ వైపు అలా ప్రచారం కాగానే.. వైసీపీ నేతలు… తీవ్రమైన విమర్శలు చేసి… కుట్రతోనే కేసులు దర్యాప్తు చేశారని అంటూండటంతో.. ఆయన వెనుకడుగు వేసి జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.