తెలుగుదేశం పార్టీలో కొన్ని సీట్లలో టిక్కెట్ల విషయంలో పీట ముడి పడింది. ప్రకాశం జిల్లా కనిగిరి, కర్నూలు జిల్లా నంద్యాల, కర్నూలు సస్పెన్స్ వీడలేదు. కనిగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబూరావుకు టిక్కెట్ ఇస్తామని తొలుత చెప్పారు, కానీ అక్కడ టిక్కెట్ ఆశిస్తున్న ఉగ్రనరసింహారెడ్డికి దర్శి ఇస్తామని ప్రతిపాదించారు. దర్శిలో పోటీ చేసేందుకు ఉగ్రనరసింహారెడ్డి ఆసక్తి చూపించలేదు. దర్శి సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్దా రాఘవరావు తాను ఒంగోలు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలంటే తన కుటుంబ సభ్యుల్లో ఒకరికి దర్శి ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రిని అభ్యర్ధించారు. చివరకు రాఘవరావు కుటుంబసభ్యులకు దర్శి టిక్కెట్ ఇచ్చేందుకు సియం అంగీకరించారు. కనిగిరిలో ఉగ్ర నరసింహారెడ్డిని పోటీ చేయించాలని నిర్ణయించి, ఆ తరువాత అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బాబూరావుకు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ ప్రతిపాదన బాబూరావుకు నచ్చలేదు. తనకు సన్నిహితుడైన సినీ హీరో బాలకృష్ణతో ఆయన చర్చలు జరుపుతున్నారు.
కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో వైసిపి తరుపున ఎస్వీ మోహన్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. మోహన్ రెడ్డి ఆ తరువాత తెలుగుదేశంలో చేరిపోయారు. రాజ్యసభ సభ్యుడు టిజీ వెంకటేష్ తన కుమారుడు భరత్ కు టిక్కెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఐవిఆర్ఎస్ సర్వేలో తనకు అనుకూలంగా వస్తేనే టిక్కెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. వైసీపీ నుంచి మోహన్ రెడ్డి .. టిక్కెట్ కోసం పట్టుబడుతున్నారు. అక్కడ మోహన్ రెడ్డి, టీజీ వర్గాల మధ్య వివాదంతో టిక్కెట్ పై చివరి నిముషం వరకు సస్పెన్స్ కొనసాగనుంది. నంద్యాల ఉప ఎన్నికల్లో 25వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన భూమా బ్రహ్మానందరెడ్డి టిక్కెట్ విషయంలో కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. అక్కడ సుబ్బారెడ్డి టిక్కెట్ తనకు కావాలని పట్టుబడుతున్నారు. నంద్యాలలో నేతలందరినీ పిలిపించి మాట్లాడి అభ్యర్ధిని ఎంపిక చేయాలని నిర్ణయానికి చంద్రబాబు వచ్చారు.
నర్సరావుపేట, మాచర్లతో సహా.. పలు నియోజకవర్గాలకు అభ్యర్థలను ఖరారు చేయడం ఇబ్బందికరంగా మారనుంది. రెండో జాబితాలో దాదాపుగా పదిహేను మందిని ప్రకటించినప్పటికీ.. అసలు వివాదం ఉన్న నియోజకవర్గాల జోలికి వెళ్లలేదు. దీంతో… ఆయా టిక్కెట్ల కోసం.. చాలా వరకు.. కసరత్తు చేయాల్సి ఉంది. ఇది పార్టీలో అసంతృప్తి పెరగడానికి కారణం అయ్యే అవకాశం కనిపిస్తోంది.