రాష్ట్ర వ్యాప్తం తీవ్ర సంచలనం రేకెత్తించిన వైఎస్ వివేకా హత్య కేసులో చిక్కుముళ్లు మెల్లగా వీడిపోతున్నాయి. పోలీసుల దర్యాప్తులో ఆసక్తికరమైన కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. సాక్ష్యాధారాలను ద్వంసం చేయడం, నేరం జరిగిన ప్రదేశంలో రక్తపు మడుగును కడిగేయడం, గాయాలు కనిపించకుండా తలకు గుడ్డ చుట్టడం వంటి అంశాలు.. ‘ఎవరు చేశారు..?’ ఎవరు చేయించారు..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్. వివేకానంద రెడ్డి మొబైల్ కు వచ్చిన ఎస్సెమ్మెస్ కలకలం రేపుతోంది. అందులో తిట్లు, హెచ్చరికలు ఉన్నాయని చెబుతున్నారు. పులివెందుల నియెజకవర్గంలోని గ్రామానికి చెందిన కరుడు కట్టిన కిరాయి హంతకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న కిరాయి హంతకుడు వివేకానంద రెడ్డి హత్య పై ఆసక్తికర అంశాలను వెల్లడించినట్లు ప్రచారం జరుగుతోంది.
కిరాయి హంతకుడు ఇస్తున్న సమాచారం ఆదారంగా మరికొంతమందిని అదుపులోకి తీసుకోృున్నారు. సాక్ష్యాధారాలన్నింటినీ సేకరించిన తరువాత మాత్రమే అసలు సూత్రధారులను అదుపులోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ కేసు దర్యాప్తును సవాలుగా స్వీకరించారు. రేపో, మాపో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. రక్తపు మరకలు కనిపించడం, రెండు లీటర్ల రక్తపు మడుగులో ఉన్న వివేకానంద రెడ్డి గదిని తుడిచేయడం, డ్రస్ మార్చడం, ఇవన్నీ చూసిన తరువాత కూడా అక్కడి పోలీసులు … గుండె పోటుగా ఉన్నతాధికారులకు చెప్పడంపై కూడా పోలీసులు తెర వెనుక ఏం జరిగిందన్నదానిపై కూపీ లాగుతున్నారు.
ఉదయం ఐదున్నరకు హత్య గురించి బయటకు తెలిసింది. ఆ తరువాత బంధువులందరూ వివేకా ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయన రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించారు. రక్తాన్ని శుభ్రం చేయడమే కాకుండా, తలకు గాయాలు కనిపించకుండా తలకు గుడ్డ చుట్టారు. ఇంట్లో ఉన్న సాక్ష్యాధారాలన్నింటినీ తుడిచేశారు. ఆ తరువాత పోలీసులకు వివేకానంద రెడ్డి పీఏ సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికీ బాత్ రూంలోనూ, బెడ్ వద్ద రక్తపు ఆనవాళ్లు కనిపించాయి. అయినప్పటికీ అక్కడున్న సిఐకి బంధువులు గుండెపోటని చెప్పడంతో అదే విషయాన్ని పోలీసులు ఉన్నతాధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. మృతదేహం ఆసుపత్రికి వెళ్లేవరకు ఇటువంటి అబద్దాలు ఎందుకు చెప్పారని, ఇందులో ఎవరు కీలక పాత్ర పోషించారనే అంశంపై కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. వంట మనిషితో పాటు, ఆయన పిఎ, ఇంటికి వచ్చిన సమయంలో బంధువుల మొబైల్ ఫోన్ల నుంచి ఎవరెవరికి ఫోన్ కాల్స్ వెళ్లాయో కూడా పోలీసులు ఆయా మొబైల్ ఆపరేటర్ల ద్వారా కాల్ డేటాను సేకరిస్తున్నారు. ఎస్సెమ్మెస్ పంపిన వ్యక్తిని కూడా ప్రశ్నిస్తున్నారు.