ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెడతామంటూ… నేరుగా చెప్పిన కేటీఆర్ ఇప్పుడు.. ఆ వేలు పెడుతున్నా… బయటకు చెప్పుకోవడానికి మాత్రం మొహమాట పడుతున్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన కేటీఆర్… ఏపీలో తమ పాత్ర ఏమీ ఉండదన్నారు. గతంలో ఎప్పుడు మాట్లాడినా.. చంద్రబాబును ఏక వచనంతో సంబోధించి.. ఓడిపోతున్నారని తీర్పిచ్చేవారు కేటీఆర్. డేటా చోరీ అంటూ.. హడావుడి చేసినప్పుడు పోలీసుల కంటే ముందే.. తనే తీర్పు ఇచ్చేసి.. హడావుడి చేశారు. అలాంటి కేటీఆర్.. తమ దూకుడుతో ఏపీలో సెంటిమెంట్ పెరిగిందన్న అంచనాకు వచ్చినట్లు ఉన్నారు. ఇప్పుడు ఏపీలో తమ పాత్రేమీ ఉండదని చెప్పుకొస్తున్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలన తర్వాత చేసింది చెప్పుకోలేకపోతున్నారని.. అందుకే తమపై పడి ఏడుస్తున్నారని వ్యాఖ్యానించారు.
నిజానికి తెలంగాణ ఎన్నికల సమయంలో… టీఆర్ఎస్ పై.. ఇతర పక్షాలు కచ్చితంగా ఇవే విమర్శలు చేశాయి. చేసింది చెప్పుకోకుండా.. చంద్రబాబును బూచిగా చూపడమేమిటని ప్రశ్నించారు. టీఆర్ఎస్ గెలిచిన తర్వాత కూడా.. ఆ గెలుపు.. చంద్రబాబుపై వ్యతిరేకతే కానీ.. టీఆర్ఎస్ అనుకూలత కాదన్న ప్రచారం జరిగింది. అంత తీవ్రంగా టీఆర్ఎస్ … టీడీపీ వ్యతిరేక ప్రచారం చేసింది. రిటర్న్ గిఫ్ట్ అంశంపై కూడా భిన్నంగా స్పందించారు. ఏప్రిల్ 11 తర్వాత మేం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామా? లేదా? అన్నది తెలుస్తుందన్నారు. అంటే.. టీడీపీ ఓడిపోతే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్లు లేకపోతే లేదన్నట్లుగా… ఆయన తెలివిగా చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఇమేజ్ పాతాళంలో ఉందని తీర్పు ఇచ్చారు.
ఏపీ రాజకీయాల్లోవేలు పెడతామంటూ..ఏకంగా పోలీసుల్ని .. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ధారదత్తం చేశారన్న విమర్శలు కొద్ది రోజుల నుంచి వస్తున్నాయి. మాట కంటే ముందు.. వైసీపీ నేతలు.. కంప్లైంట్లు పట్టుకుని… తెలంగాణ పోలీసుల వద్దకెళ్లడం.. వాళ్లకి ఇంకేం పని లేదన్నట్లు రాజకీయ ప్రకటనలు చేయడం కామన్ గా మారిపోయింది. డేటా చోరీ కేసులో.. ప్లాన్ ఆఫ్ యాక్షన్ బయటపడటం.. పోలీసులు… డేటాచోరీపై ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో… ఇప్పుడా కేసును ఎలా డీల్ చేయాలా..అని సిట్ తంటాలు పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే కేటీఆర్.. ఏపీ రాజకీయాలపై తన వాయిస్ డౌన్ చేసుకుంటూ వస్తున్నారు.