వైఎస్ వివేకా హత్య కేసులో.. అంతా చిక్కుముడి వీడిపోయినట్లే ఉంది… కానీ ఏమీ తెలియడం లేదన్నట్లుగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. వివేకా మరణం గురించి మొదటగా… చూసి… పోలీసులకు సమాచారం ఇచ్చిన వైఎస్ అవినాష్ రెడ్డిని … ప్రత్యేక దర్యాప్తు బృందం పిలిపించి ప్రశ్నించింది. ఎందుకు అబద్దం చెప్పాల్సి వచ్చిందన్న అంశంపై స్టేట్మెంట్ తీసుకున్నారు. వివేకా గుండెపోటుతో మృతి చెందారని అవినాష్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు రాఘవరెడ్డి సెల్ నుంచి పోలీసులకు ఫోన్ వచ్చిందని నిన్న కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ చెప్పారు. కొంత సమయం తర్వాత అవినాష్ కార్యాలయంలో పనిచేసే భరత్‌రెడ్డి నుంచి కూడా ఇదే విషయంపై నేరుగా ఎస్పీకే ఫోన్ చేశారు. వీటన్నింటిపైనా ఆయన స్టేట్మెంట్ రికార్డు చేశారు.
మరో వైపు పరమేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి పేరు హఠాత్తుగా తెరపైకి వచ్చింది. పరమేశ్వర్ రెడ్డి మూడు దశాబ్దాలుగా.. వివేకానరెడ్డికే కాదు..వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. ఆయన వైఎస్ కుటుంబీకుల తరపున సెటిల్మెంట్లు చేయడంలో కీలక పాత్ర పోషిస్తూంటారు. వివేకా చనిపోయిన తర్వతా పరమేశ్వర్ రెడ్డి జాడ లేకపోవడంతో.. ఆయన పనేనని విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ పరమేశ్వర్ రెడ్డి.. తిరుపతిలోని ఓ ఆస్పత్రిలో ఉన్నారు. మీడియాను పిలిచి తనకే పాపం తెలియదని.. చెప్పుకొచ్చారు. పోలీసులు వచ్చి తనను ప్రశ్నించారని… అది ఇంటి దొంగల పనేనని ..మీరు మీరు తేల్చుకోండి.. మమ్మల్ని ఇరికించవద్దని చెప్పి పంపించామంటున్నారు.
పులివెందుల సమీపంలోని కసనూరుకు చెందిన పరమేశ్వర్‌రెడ్డి సెటిల్మెంట్లు, భూ వివాదాలు పరిష్కరించేవాడని, వివేకాతో అత్యంత సన్నిహితంగా మెలిగేవాడని, ఇటీవల ఓ వివాదంలో పరమేశ్వర్‌తో వివేకా గొడవపడ్డాడని, వివేకా హత్యకు పది రోజుల ముందు త్వరలో ఓ సంచలనం చూస్తారంటూ పరమేశ్వర్ కొందరి వద్ద మాట్లాడాడని ప్రచారం జరిగింది. దీనికి తోడు వివేకా హత్య తర్వాత పరమేశ్వర్‌రెడ్డి చూడడానికి కూడా రాలేదంటూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. 30 ఏళ్లుగా వైఎస్ కుటుంబీకుల కోసమే పనిచేస్తున్నామని కావాలనే మాపైన పుకార్లు పుట్టించారు… అయినా ఎవరు ఎలాంటి వారో జగన్ సార్‌కు తెలుసు అంటూ పరమేశ్వర్ రెడ్డి భార్య వ్యాఖ్యానించారు.