తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ .. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ప్రారంభ సభలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అవసరం అయితే… జాతీయ పార్టీ పెడతానని ప్రకటించారు. దీనిపై అనేక భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశానికి ఇప్పుడు ఉన్న జాతీయ పార్టీలన్నీ… అన్యాయం చేశాయని… ఆయన వాదిస్తున్నారు. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో… కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టగలరా..? లేదా..?
మోడీ ముద్ర లేకుండా చేసుకునే ప్రయత్నాల్లో కేసీఆర్..!
టీఆర్ఎస్ మూడు నెలల కిందటే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లింది. పూర్తిగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోసమే పోరాడుతోంది. పూర్తిగా.. జాతీయ ఎజెండాతో.. కేసీఆర్ ఎన్నికల వ్యూహరచన చేసుకున్నారు. ప్రస్తుతం.. దేశవ్యాప్తంగా… రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్రమోడీ అన్నట్లుగా రాజకీయ వాతావరణం ఏర్పడుతోంది. ఇంకా చెప్పాలంటే.. మోడీ ఉండాలా వద్దా అన్నట్లుగా.. ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. మోడీ,, రాహుల్ గాంధీ ముఖాముఖి తలపడటం లేదు. కాంగ్రెస్, బీజేపీ చాలా రాష్ట్రాల్లో ప్రత్యర్థులు కూడా కాదు. కర్ణాటక, రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా ఉంది. మిగతా చోట్ల బీజేపీ, కాంగ్రెస్ ప్రాంతీయపార్టీలతో పోటీ పడుతున్నాయి. అయితే జాతీయ స్థాయిలో చూస్తే మాత్రం.. మోడీ వర్సెస్ రాహులే అవుతోంది. ప్రాంతీయ పార్టీలు అన్నీ.. ఏదో ఓ జాతీయ పార్టీ వైపు ఉంటాయి. ఎక్కువ పార్టీలు.. రాహుల్‌తో ఉంటామని ప్రకటించాయి. అంటే.. దేశంలో ఇప్పుడు మోడీ వర్సెస్ రాహుల్ అండ్ కో అనే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు.
జాతీయ కూటమి లేదా జాతీయ పార్టీ ఆలోచన రాజకీయమే..!
అయితే… దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ… ఏదో ఓ జాతీయ పార్టీ వైపు వెళ్లాయి. టీఆర్ఎస్ అధినేతను..జాతీయ మీడియా… మోడీ వైపు లెక్కలేస్తోంది. కానీ.. కేసీఆర్ మాత్రం.. ఆ మాటను ఇప్పుడు అంగీకరించడానికి సిద్ధంగా లేరు. మోడీకి మద్దతుగా ఉంటారన్న నమ్మకం ప్రజల్లో ఏర్పడితే.. తెలంగాణలో కొన్ని వర్గాల ఆదరణను ఆయన కోల్పోతారు. 12 శాతం ఉన్న ముస్లిం ఓటు దూరం అవుతుంది. మోడీపై సీమాంధ్ర ప్రజల్లోనూ ఆగ్రహం ఉంది. సీమాంధ్రకు చెందిన లక్షలాది మంది ఓటర్లు తెలంగాణలో ఉన్నారు. ఇలా .. ఏ విధంగా చూసినా… జాతీయ రాజకీయాల్లో కేసీఆర్.. మోడీ వైపు ఉంటారంటే… ఆయనకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రత్యర్థి. ఆ పార్టీతో జట్టుకట్టే అవకాశాలు లేవు. అందుకే.. వ్యూహాత్మకంగా.. ఆ రెండు పార్టీలకు దూరం… అని ప్రకటనలు చేస్తున్నారు. జాతీయ ఫ్రంట్ లేదా.. జాతీయ పార్టీ పెడతానని ప్రకటనలు చేస్తున్నారు.
కేసీఆర్ చెప్పిన ఆ 120 మంది రాహుల్‌కు మద్దతిస్తున్నారు..!
తెలంగాణ ప్రజలు పదహారు సీట్లు ఇస్తే.. మరో 160 మందిని పోగేస్తానని.. కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే… 120 మందిని పోగేశానని చెప్పుకొచ్చారు. ఈ 120 మంది ఎక్కడి నుంచి వచ్చారు..? గతంలో ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఆయన కలసి వచ్చిన నేతల పార్టీలను కలిపితే.. ఈ 120 మంది వస్తారు. వీరిలో చాలా మంది.. కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు. డీఎంకే అధినేత స్టాలిన్.. రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని ప్రకటించారు. మమతా బెనర్జీ.. కోల్‌కతాలో మీటింగ్ పెట్టి కాంగ్రెస్ ను ఆహ్వానించింది. జేడీఎస్ … కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. వీరందరూ..ఎన్నికల తర్వాత కేసీఆర్ వెనుక వస్తారో లేదో తెలియదు. ఇవన్నీ చూస్తే.. కేసీఆర్ జాతీయ పార్టీ అనేది.. కేవలం ప్రజలకు చెప్పడానికే కానీ.. నిజంగా పెడతారని నేను అనుకోను.