గత రెండు రోజులుగా సాక్షి పత్రిక పవన్ కళ్యాణ్ ని టార్గెట్ గా చేస్తూ పలు వార్తలు వ్రాస్తోంది. ముఖ్యంగా జనసేన టిడిపిల మధ్య అనధికార పొత్తు ఉంది అని ప్రజలను కన్విన్స్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే సాక్షి ప్రచారానికి కి నెటిజన్ల నుంచి కౌంటర్లు బాగానే పడుతున్నాయి.
సాక్షి ఆరోపణలు:
పవన్ కళ్యాణ్ లోకేష్ పైన జనసేన అభ్యర్థి ని పోటీ పెట్టకుండా ఆ టికెట్ కమ్యూనిస్టులకు వదిలేశాడని, గుంటూరులో తోట చంద్రశేఖర్ కోసం డమ్మీ అభ్యర్థిని చంద్రబాబు పెడుతున్నారని, అలాగే నరసాపురం ఎంపీ స్థానంలో నాగబాబు పోటీ చేసే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా చైతన్యరాజుకు చంద్రబాబు హ్యాండ్ ఇచ్చాడు అని, ఇక నాదెండ్ల మనోహర్ , పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానాలలో కూడా ఇలాగే బలహీన అభ్యర్థులను చంద్రబాబు పోటీ చేయిస్తున్నాడు అని , బోండా ఉమా స్థానం కూడా కమ్యూనిస్టులకు వదిలేశాడని సాక్షి పత్రిక ఛానల్ పలు కథనాలు వెలువరిస్తోంది.
విజయవాడ సెంట్రల్, మంగళగిరి స్థానాలు కమ్యూనిస్టులకు దక్కడానికి కారణాలు:
అయితే జనసేన పార్టీ మంగళగిరి స్థానాన్ని కమ్యూనిస్టులకు కేటాయించడానికి బలమైన కారణాలు ఉన్నాయి.
బోండా ఉమా స్థానం పవన్ కళ్యాణ్ వదులుకోవడానికి ఇష్టపడలేదు. అయితే కమ్యూనిస్టులు బోండా ఉమా ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడ సెంట్రల్ తో పాటు విజయవాడ వెస్ట్ కూడా తమకు ఇవ్వాల్సిందిగా పట్టుబట్టారు. ఒకప్పుడు విజయవాడ కమ్యూనిస్టుల కంచు కోట అన్న విషయం తెలిసిందే. అయితే విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో పోతిన మహేష్ ఎప్పటినుండో జనసేన కోసం పని చేస్తున్నాడు. అతనికి ఆర్థిక వనరులు లేకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్, పార్టీ యే డబ్బుల సంగతి చూసుకుంటుంది అని చెప్పి మరీ ఆయన కి టికెట్ ఇస్తానని మాట ఇచ్చి ఉన్నాడు. అందువల్ల కమ్యూనిస్టులు విజయవాడ వెస్ట్ , విజయవాడ సెంట్రల్ రెండు స్థానాల కోసం పట్టుపడితే పోతిన మహేష్ కోసం విజయవాడ వెస్ట్ స్థానాన్ని జనసేనకు కేటాయించి విజయవాడ సెంట్రల్ కమ్యూనిస్టులకు ఇచ్చాడు. అయితే ఇలా డబ్బులు తీసుకోకుండా మరీ పవన్ కళ్యాణ్ పోతిన మహేష్ కి టికెట్ ఇవ్వడం, అందుకోసం విజయవాడ సెంట్రల్ స్థానం వదులుకోవడం లాంటి సంగతులు వైఎస్ఆర్సీపీకి అర్థం కావని, వారి దృష్టిలో టికెట్లు ఇవ్వడం అంటే – ఇస్తే డబ్బులు తీసుకుని ఇవ్వాలి, లేదంటే ఇంకొకరితో కుమ్మక్కై ఇవ్వాలి అన్న చందంగా ఆలోచిస్తున్నారని సాక్షి మీద, వైఎస్ఆర్సిపి మీద నెటిజన్లు విరుచుకుపడుతున్నారు
ఆ లెక్కన 2014లో విజయమ్మ స్థానం కోసం జగన్ టిడిపి తో కుమ్మక్కు అయ్యాడా
ఒక వేళ తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టకుండా పొత్తులో భాగంగా ఒక స్థానాన్ని అవతలి పార్టీకి కేటాయించడమే గనక కుమ్మక్కు అయితే 2014లో విజయమ్మ మీద కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిలబెట్టలేదని, ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించాడని, బిజెపి ఆ స్థానం లో నిలబెట్టిన హరిబాబు ఎంతో బలహీన అభ్యర్థి అని అందరూ అనుకున్నారని ఈ లెక్కన చూస్తే మరి జగన్ కూడా విజయమ్మ కోసం 2014లో చంద్రబాబుతో, బిజెపి తో కుమ్మక్కయ్యారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నిజానికి రాజకీయాల్లో బలహీనమైన అభ్యర్థులు అని అనుకున్న వాళ్లు అంచనాలు తలకిందులు చేసి ఘన విజయాలు సాధించడం, ఎంతో బలమైన అభ్యర్థులు అనుకున్నవాళ్ళు చతికిలపడి పోవడం సహజమే. ఈ లెక్కన ఇప్పుడు పవన్ కళ్యాణ్ తరపున బలహీన అభ్యర్థులు అనుకున్నవాళ్ళు కానీ, చంద్రబాబు తరఫున బలహీన అభ్యర్థి అనుకున్న వాళ్లు కానీ రానున్న ఎన్నికల్లో ఎంతోమంది గెలవచ్చు కూడా.
సొంత పాలన పై భరోసా ఇవ్వకుండా ప్రభుత్వ వ్యతిరేకత పై ఆధారపడడం ఇందుకు కారణం:
ఏది ఏమైనా, జగన్ గత నాలుగేళ్లలో కేవలం చంద్రబాబు వ్యతిరేకత తన్ను గెలిపిస్తుంది అన్న చందంగా ప్రవర్తించారు, తాను అధికారంలోకి వస్తే ఎటువంటి పాలన ఇస్తానన్న స్పష్టత ఇవ్వలేకపోయారు. ఇప్పుడు జగన్ కి పడే ఓట్లు కూడా ఒకటేమో వైయస్సార్ మీద అభిమానంతో పడే ఓట్లు, రెండవది చంద్రబాబు మీద వ్యతిరేకతతో పడే ఓట్లు. ఇంతే తప్పించి, జగన్ రాష్ట్రాన్ని ఏదో అభివృద్ధి చేస్తాడు అన్న ఆశలతో పడుతున్న ఓట్లు అయితే పెద్దగా లేవు. ఈ కారణంగానే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు పవన్ కళ్యాణ్ కి వెళ్లి పోతే తాను తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఉద్దేశంతో ఇటు జగన్ , అటు సాక్షి జనసేన ను తెలుగుదేశం పార్టీని ఒకే గాటన కట్టడానికి బలంగా ప్రయత్నిస్తున్నారని అర్థమవుతోంది.