ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి లోకేష్ మంగళగిరి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. లోకేష్ మీద వైఎస్ఆర్ సిపి తరపున పోటీగా నిలబడేది సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పై ఈయన కేవలం 12 ఓట్ల తేడాతో విజయం సాధించారు. జనసేన తరపున సీటు ఎవరికిస్తారు అన్న చర్చ జరిగింది కానీ పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని కమ్యూనిస్టులకు పవన్ కళ్యాణ్ కేటాయించారు. మొత్తానికి ఇప్పుడు సిపిఐ తరఫున ముప్పాళ్ళ నాగేశ్వరరావును ఈ స్థానం నుంచి పోటీకి నిలబెడుతున్నట్లుగా ప్రకటన వచ్చింది.
2009 ఎన్నికల్లో ఇదే మంగళగిరి స్థానం నుంచి ఇదే సిపిఐ తరఫున పోటీ చేసిన ముప్పాళ్ల నాగేశ్వరరావు 15 శాతానికి పైగా ఓట్లు తెచ్చుకున్నారు. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి 24 శాతం ఓట్లు వచ్చాయి. అలాగే సిపిఎం అభ్యర్థికి మరొక 15 శాతం ఓట్లు వచ్చాయి. అంటే ప్రజారాజ్యం, సిపిఐ , సిపిఎం కలిపి దాదాపు 55 శాతం ఓట్లు సాధించినట్టన్నమాట. అంతేకాకుండా ముప్పాళ్ల నాగేశ్వరరావు అగ్రిగోల్డ్ బాధితుల సంఘానికి అధ్యక్షుడిగా ఉంటూ గత రెండేళ్లుగా అగ్రిగోల్డ్ బాధితుల తరపున బలంగా గళాన్ని వినిపిస్తున్నారు. ఆ మధ్య అగ్రిగోల్డ్ బాధితుల తో హాయ్ ల్యాండ్ ముట్టడించడానికి కూడా ప్రయత్నించారు. అగ్రిగోల్డ్ సమస్య విషయంలో తెలుగు దేశం ప్రభుత్వంతో బలంగా పోరాడిన ముప్పాళ్ల నాగేశ్వరరావు కి మంగళగిరి టికెట్టు కేటాయించడం , గతంలో ప్రజారాజ్యం పార్టీకి ఇక్కడ వచ్చిన ఓట్ల శాతం మళ్లీ జనసేన కి రావడం, దానికి కమ్యూనిస్టుల కాంబినేషన్ తోడవ్వడం లాంటివి వర్కౌట్ అయితే ఫలితాలు ఊహకందని విధంగా ఉండే అవకాశం కూడా ఉంది. మొత్తానికి జనసేన కూటమి చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని అర్థమవుతోంది.
మరి ఆయన ఏ మేరకు విజయం సాధిస్తాడు అనేది ఎన్నికలయ్యాక తెలుస్తుంది.