ప్రతి ఎన్నికలోనూ సీటు మారడం మంత్రి గంటా శ్రీనివాసరావు స్పెషాలిటీ. సెంటిమెంట్ కూడా. ఇంత వరకూ పోటీ చేసిన ఏ ఎన్నికలోనూ రెండో సారి అక్కడి నుంచి పోటీ చేయలేదు. అలాగే ఓడిపోలేదు కూడా. ఈ సారి విశాఖ నార్త్ నుంచి రంగంలోకి దిగారు. భీమిలీ నుంచే పోటీ చేస్తానని పట్టుబట్టినట్లుగా ప్రచారం జరిగినా.. ముందు నుంచీ గంటా ఈ నియోజకవర్గంపై కన్నేశారని..టీడీపీ వర్గాలు చెబుతున్నారు. దాని ప్రకారమే.. ప్లాన్డ్గా… విశాఖ నార్త్‌ను ఎంచుకున్నారు. కార్యాచరణ ప్రారంభించారు.
విష్ణుకుమార్ రాజు పరువు నిలుపుకుంటారా..?
విశాఖ నార్త్ సిట్టింగ్ ఎమ్మెల్యే బీజేపీకి చెందిన విష్ణుకుమార్ రాజు. గత ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా టీడీపీ సీటు కేటాయించడంతో..అనూహ్యంగా విష్ణుకుమార్ రాజు టిక్కెట్ దక్కించుకున్నారు. భారీ మెజార్టీతో విజయం సాధించారు. నిజానికి అక్కడ బీజేపీకి ఎలాంటి క్యాడర్ లేదు. కానీ ఆయన బీజేపీ తరపున కన్నా.. వ్యక్తిగతంగా అనుచరుల్ని… పెంచుకునే ప్రయత్నం చేశారు. అయినా ఆయనకు బీజేపీ తరపున పోటీ చేస్తే గెలుపు దక్కదని తెలుసు. అందుకే వైసీపీ, టీడీపీ వైపు చూశారు. కానీ ఎక్కడా అవకాశం లభించలేదు. చివరికి.. బీజేపీ తరపునే రంగంలోకి దిగుతున్నారు. చివరి క్షణంలో .. రైల్వే జోన్ ప్రకటించడంతో… ఆ ఒక్క ప్లస్ పాయింట్‌ను ప్రచారం చేసుకుని.. బరిలో నిలవాలని ప్రయత్నిస్తున్నారు. వేరే అభ్యర్థుల సంగతేమో కానీ.. నేరుంగా గంటా బరిలోకి దిగడంతో.. విష్ణుకుమార్ రాజుకు.. ఉన్న ఆశలు కూడా సన్నగిల్లినట్లియంది.
గంటా సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా..?
గంటా శ్రీనివాసరావు ఒకసారి అనకాపల్లి ఎంపీగా, అనకాపల్లి, చోడవరం, భీమిలి ఎమ్మెల్యేగా గెలిచారు. రెండు సార్లు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఏ పార్టీ, ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తూనే ఉన్నారు. 1999లో పునర్విభజనకు ముందు విశాఖ ఉత్తర నియోజకవర్గం విశాఖ -2 నియోజకవర్గ పరిధిలో ఉండేది. ఆ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉండేది. నియోజకవర్గ పునర్ విభజన తర్వాత అక్కడ టీడీపీ అభ్యర్థి గెలవలేదు. పైగా… సరైన లీడర్ లేకపోవడంతో… ఐదేళ్లుగా అక్కడ ఇన్చార్జిని కూడా పెట్టలేదు. మిత్రపక్షంగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే ఉండటంతో లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు నేరుగా గంటా రంగంలోకి వచ్చారు. వార్డు స్థాయి నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ చురుగ్గా… పార్టీని ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు.
వైసీపీ అభ్యర్థికి ధనబలమే ప్లస్ పాయింట్..!
గత ఎన్నికల్లో వైసీపీ తరపున చొక్కాకుల వెంకటరావు పోటీ చేశారు. ఈ సారి ఆర్థిక పరిపుష్టి ఉన్న నాయకుడు కావాలని.. పలువురు సమన్వయకర్తల్ని మార్చేసి.. చివరిగా రియల్ ఎస్టేట్ వ్యాపారి కేకే రాజుకి చాన్సిచ్చారు. కొంత కాలం నుంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. అన్ని వార్డుల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఎంత అయినా ఖర్చు పెట్టగలనని విజయసాయిరెడ్డికి నమ్మకం కలిగించడం ఆయనకు ప్లస్అయింది. త్రిముఖ పోరు ఉన్నప్పటికీ.. జనసేన ప్రభావాన్ని కొట్టి పారేయలేమన్న భావన వినిపిస్తోంది. గెలుపు లెక్కలేసుకునే గంటా ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని.. ఆయన లెక్క తప్పదన్న అంచనాలు.. సహజంగానే వస్తున్నాయి.