” రైతు బంధు ” తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత బరిలో ఉంటున్న నిజామాబాద్ లోక్ సభ నుంచి.. ఈ సారి… బరిలో నిలవాలని.. ఎర్రజొన్న, పసుపు రైతులు నిర్ణయించుకున్నారు. గ్రామానికి ఐదుగురు చొప్పున.. దాదాపుగా వెయ్యి మంది రైతులు నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే నామినేషన్ పత్రాలను కూడా తీసుకెళ్లారు. కొద్ది రోజులుగా గిట్టుబాటు ధరల కోసం… ఎర్రజొన్న, పసుపు రైతులు తీవ్రంగా పోరాడుతున్నారు. ఆందోళనలు చేశారు. రాస్తారోకోలు చేశారు. కానీ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు కానీ… కొంత మంది రైతు సంఘాల నేతలపై కేసులు పెట్టారు. దీంతో రైతులు మరింతగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రైతుల పోటీ.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవడం ఖాయం. ఎందుకంటే… తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ సహా.. అందరూ.. తమది రైతు బంధు ప్రభుత్వమని చెప్పుకుంటూ ఉంటారు. తాము పెట్టిన పథకం ద్వారా… ఎకరానికి ఏడాదికి రూ. ఎనిమిది వేలు ఇస్తున్నామని.. దాని వల్ల రైతులంతా సుఖసంతోషాలతో ఉన్నారని ప్రచారం చేస్తున్నారు. తమ పథకాన్ని దేశం మొత్తం ఆదర్శంగా తీసుకుందని… ప్రకటించుకుంటూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే… ఈ రైతు బంధునే.. తమ జాతీయ పార్టీ అజెండా అని అంటూ ఉంటారు. ఫెడరల్ ఫ్రంట్ ప్రధన హామీ కూడా అదే అని చెబుతూ ఉంటారు. కానీ ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులు… అదే రైతు బంధు ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయబోతున్నారు.
ప్రతీ ఏడాది… ఎర్రజొన్న, పసుపు రైతులకు గిట్టుబాటు ధర సమస్య వస్తుంది. ప్రతీ ఏడాది రైతులు నష్టపోతూనే ఉంటారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తామని ఎంపీ కవిత.. ఐదేళ్ల కిందట హామీ ఇచ్చారు. కానీ గత ప్రభుత్వంలో ఆమె సాధించలేకపోయారు. అలాగే ఎర్రజొన్న విషయంలోనూ… మద్దతు ధర ఇస్తామని చెప్పారు. అయితే.. అలాంటి సమస్యల పరిష్కారం ఏమీ కాలేదు. వారి ఆందోళన రోజు రోజుకు ఉద్ధృతమవుతుంది. అయితే.. వారికి మద్దతు తెలిపేవారే కరవయ్యారు. చివరికి మీడియా కూడా.. పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. అందుకే రైతుల ఆందోళనలు బయటకు రావడం లేదు. ఇప్పుడు వెయ్యి మంది నామినేషన్లు వేస్తే మాత్రం సంచలనం అవడం ఖాయం.