హైదరాబాద్: ఓటుకు నోటు తదితర విషయాలపై నిన్న పవన్‌కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వివిధ పార్టీల నాయకులు పోటీలుపడినట్లుగా ప్రతిస్పందించారు. వీరిలో ఎక్కువమంది విమర్శించినవారే ఉన్నారు. అయితే సీపీఐ మాత్రం భిన్నంగా స్పందించింది. ఏపీకి ప్రత్యేకహోదాపై పవన్ ఎందుకు మాట్లాడటంలేదని అంటూనే తమతో కలిసి పనిచేద్దామంటూ పిలుపునిచ్చారు. సీపీఐ ఆంధ్రప్రదేశ్ శాఖ కార్యదర్శి రామకృష్ణ కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ, ఓటుకు నోటు కుంభకోణంపై ఆలస్యంగా స్పందించిన పవన్, అన్ని విషయాలూ మాట్లాడలేదని అన్నారు. పవన్ ఇప్పటికైనా స్పందించటం సంతోషమని సీపీఎమ్ నేత బీవీ రాఘవులు వ్యాఖ్యానించారు. ఉపన్యాసాలు ఇవ్వటంకాదని, కార్యాచరణ రూపొందించి పోరాటానికి దిగాలని, అప్పుడే ఆయనతో అందరూ కలిసొస్తారని అన్నారు. పవన్ గుర్తొచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెట్టే వ్యక్తి అని అమలాపురం మాజీఎంపీ హర్షకుమార్ వ్యాఖ్యానించారు. పవన్ ప్రెస్ మీట్‌ను ఏడాదికో సినిమా అంటూ కేటీఆర్ నిన్నే స్పందించిన సంగతి తెలిసిందే. పవన్ ప్రశ్నించటం మానేసి చంద్రబాబుకు భజన చేస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ అన్నారు. ఓటుకునోటు కేసును వదిలి ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని చెప్పారు. ఇక తెలంగాణ భారీ నీటిపారుదలశాఖమంత్రి హరీష్ రావు పవన్‌పై స్పందిస్తే తన స్థాయిని దించుకున్నట్లవుతుందని అన్నారు.
మరోవైపు తెలుగుదేశం నేతలు కొద్దిగా ఆలస్యంగా స్పందించారు. కేంద్ర సహాయమంత్రి సుజనా చౌదరి మాట్లాడుతూ, పవన్ మంచి సలహాలిస్తే తప్పనిసరిగా తీసుకుంటామని అన్నారు. వ్యాపారవేత్తలు రాజకీయాలలోకి రాకూడదని రాజ్యాంగంలో ఎక్కడా లేదని చెప్పారు. వ్యాపారాలు నీతిగా చేస్తున్నారా, లేదా అని మాత్రమే చూడాలని అన్నారు. ఎంపీగా ఉన్న చిరంజీవికూడా వ్యాపారాలు చేస్తున్నారని గుర్తు చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రజలపైన వివక్ష పవన్‌కు కనిపించటంలేదా అని ప్రశ్నించారు. సెక్షన్ 8 అవసరంలేదని ఎలా చెబుతారని అన్నారు. ఇక విజయవాడ ఎంపీ కేశినేని నాని పవన్ విషయంలో కొత్తకోణం తీసుకొచ్చారు. హైదరాబాద్‌లో తన ఆస్తులను కాపాడుకునేందుకే పవన్ తన ఆత్మాభిమానాన్ని కేసీఆర్ పాదాలవద్ద తాకట్టు పెట్టారని ఆరోపించారు. పవన్ ఆరునెలలకొకసారి సింహంలాగా జూలువిదిలించి ఏదో ఒకటి మాట్లాడుతుంటారని, ఆ తర్వాత మళ్ళీ నిద్రపోతుంటారని అన్నారు.