తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు.. వైసీపీ అభ్యర్థులతో పోటీ గురించి టెన్షన్ పడుతున్నారో లేదో కానీ… ఏపీ అవతల నుంచి.. తమకు వస్తున్న ఒత్తిళ్లు, బెదిరింపులను మాత్రం తట్టుకోలేకపోతారు. టీడీపీ అభ్యర్థులపై.. పొరుగు రాష్ట్రం నుంచి నేరుగా…అధికార బలప్రయోగం జరుగుతున్న విషయం స్పష్టమవుతోంది. తెలంగాణ పోలీసుల్ని ఏపీ పైకి ప్రయోగించడంలో.. ఏ మాత్రం వెనుకాడని… టీఆర్ఎస్ నేతల వ్యవహారశైలి కొత్తగా… ఇప్పుడు మరో విధంగా ప్రచారంలోకి వచ్చింది. టీడీపీ టిక్కెట్లు సాధించిన అభ్యర్థుల జాబితా నుంచి హైదరాబాద్లో వ్యాపారాలు, కాంట్రాక్టులు, ఆస్తులు ఉన్న వారిని గుర్తించి… వారిపై కొత్తగా బెదిరింపులు ప్రారంభించారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
నిన్నటికి నిన్న కర్నూలు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే పోటీ నుంచి వైదొలగుతానని ప్రకటించడం.. మరో ఎమ్మెల్యే నామినేషన్ వేయడానికి జంకుతూండటంతో… అసలు విషయం బయటకు వచ్చింది. ఆ ఎమ్మెల్యేలను హైదరాబాద్లో వ్యాపారాలు, ఆస్తులు. టీడీపీ జాబితాలో సీటు ఖరారైన తర్వాత ఆయనను… హైదరాబాద్కు టీఆర్ఎస్ పెద్దలు పిలిపించారట. పోటీ నుంచి వైదొలగాలని ఒత్తిడి చేశారట. లేకపోతే ఎలాంటి పరిణామాలుంటాయో .. సింపుల్గా నోటీసులతో చెప్పారట. దాంతో వారు ఆందోళనకు గురయ్యారు. కృష్ణా జిల్లాలో ఓ ఎమ్మెల్యేకు చెందిన 50 ఎకరాల స్థలంలో… ” దిస్ లాండ్ బిలాంగ్స్ టు తెలంగాణ గవర్నమెంట్ ” అనే బోర్డు పెట్టేశారు. దానికి కారణం ఏమి చెప్పారంటే.. పదేళ్ల కిందటి రిజిస్ట్రేషన్లో డాక్యుమెంట్లు నకిలీవి ఉన్నాయని చెప్పారట. అలాంటివేమీ లేవని.. ఆ ఎమ్మెల్యే అధికారుల వద్దకు వెళ్తే… ప్రభుత్వంతో మాట్లాడుకోవాలని చెప్పి పంపారు. ఆయన ప్రభుత్వ పెద్దల వద్దకు వెళ్లగా అసలు విషయం చెప్పారు. పార్టీ మారాలని ఒత్తిడి తెచ్చారు. నామినేషన్ వేసినా.. సైలెంట్ అయి పక్కకుపోవాలని ఆదేశించారట. లేకపోతే రూ. 200 కోట్లు విలువైన భూమిపై ఆశలు వదిలేసుకోవాలని హెచ్చరించారట.
నేరుగా.. మాఫియాలా బెదిరింపులు వస్తూండటంతో.. ఎమ్మెల్యే అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. మంగళవారం కర్నూలు సభలో కూడా చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించారు. అభ్యర్థుల ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలని చూస్తున్నారని.. ఇదేమి రాజకీయమని ప్రశ్నించారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. కానీ హైదరాబాద్లో ఆస్తులు, వ్యాపారాలున్న వారిపై మాత్రం… టీడీపీ హైకమాండ్ ఓ కన్నేసి ఉంచింది. ప్రత్యామ్నాయాలను రెడీ చేసుకుంది. ఇప్పటికే పలువురు నేతలకు.. ఈ తరహా .. ప్రచారం బెదిరింపులు పొరుగు రాష్ట్రం నుంచి వస్తూండటంతో… టీడీపీ అధినేత.. ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.