వైకాపా ఎన్నికల ప్రచారవ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. ఆయన కూడా రాజకీయ నాయకుడి మాదిరిగానే విమర్శలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనపై చేస్తున్న విమర్శలపై ట్విట్టర్ ద్వారా ప్రతివిమర్శలకు దిగారు పీకే! ఓటమి తప్పదని ముందుగా తేలిపోతే, ఎంతటి రాజకీయ నాయకుడికైనా ఆత్మస్థైర్యం దెబ్బతినక తప్పదని వ్యాఖ్యానించారు. తనను ఉద్దేశించి చేస్తున్న విమర్శల్లో సీఎం చంద్రబాబు ఉపయోగిస్తున్న భాష తనకేం ఆశ్చర్యం కలిగించే విధంగా లేదన్నారు! బీహార్ ని కించపరచే విధంగా మాట్లాడం కంటే, ఆంధ్రా ప్రజలు తమకు ఎందుకు ఓటెయ్యాలనే అంశంపై చంద్రబాబు ఫోకస్ పెడితే బాగుంటుందని సలహా ఇచ్చారు! ఒంగోలు ఎన్నికల ప్రచార సభలో పీకేని ఉద్దేశించి చంద్రబాబు చేసిన విమర్శలు తెలిసిందే. ఏపీలో లక్షలాది ఓట్లను ప్రశాంత్ కిషోర్ తొలగించారని ఆరోపించారు.
ఎన్నికల వ్యూహకర్తగా పీకే చెయ్యాల్సింది విమర్శకు ప్రతివిమర్శ కాదు! ఏపీలో ఓట్లను తొలగించడం వెనక ఆయన వ్యూహం ఉందా లేదా అనేదానికి సమాధానం చెప్పాలి. లక్షల సంఖ్యలో ఫామ్ 7 దరఖాస్తులు పెట్టించాలని వైకాపాకి సలహా ఇచ్చింది ఎవరనేదానికి పీకే సమాధానం ఇస్తే బాగుండేది. పీకే మీద చంద్రబాబు ఆరోపణలు చేస్తే… వైకాపా నేతలు తిప్పికొట్టాలి. అంతేగానీ… ఆయన డైరెక్ట్ గా రంగంలోకి దిగేస్తే, వ్యూహకర్తకంటే ఒక సగటు నాయకుడిగానే ఎక్కువగా కనిపిస్తారు కదా!
వాస్తవానికి, ఇప్పుడు పీకే దృష్టి పెట్టాల్సింది ఇతర పార్టీల నేతల విమర్శలను తిప్పికొట్టే పనిపై కాదు. వైకాపా అధినేత జగన్ ప్రచార సరళి గురించి ఆలోచించాలి. ప్రచారంలో జగన్ కాస్త వెనకబడుతున్నారనే అభిప్రాయం కొంత వ్యక్తమౌతోంది. ఇప్పుడూ చంద్రబాబుపై విమర్శలకు మాత్రమే పరిమితం అవుతూ ఉండటంతో… వైకాపాకి అంటూ సొంతంగా అజెండా లేదా, టీడీపీపై వ్యతిరేకత ఒక్కటే జగన్ ని గెలిపించే అంశమా అనే చర్చ కొన్ని వర్గాల్లో జరుగుతోంది. మీడియాలో కూడా జగన్ ప్రచారంపై ఇలాంటి విశ్లేషణలు జరుగుతున్నాయి. వ్యూహకర్తగా పీకే ఫోకస్ ఉండాల్సింది అక్కడ! అంతేగానీ… విమర్శలు చేయాల్సిన పని వ్యూహకర్తలకు ఏముంది..? వైకాపాకి నాయకులు చాలరన్నట్టు, ఇప్పుడు పీకేతో కూడా విమర్శలు చేయిస్తోందా అనే అభిప్రాయమూ కలిగే అవకాశం ఉంటుంది.