అనంతపురం జిల్లా రాజకీయాలు… నామినేషన్లకు చేరుకున్నాయి. దాదాపుగా ప్రతి నియోజకవర్గంలోనూ.. పాత ప్రత్యర్థులే పోటీ పడుతున్నారు. వైసీపీ మొత్తం ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చి అభ్యర్థులను రంగంలోకి దింపుతోంది. టీడీపీ.. విభిన్న సామాజిక సమీకరణాలను చూసుకుంది. బలమైన నేతలు టీడీపీలో ఉన్నా.. ఒకరికొకరు పడని పరిస్థితి ఉంది. అందుకే.. రెండు పార్టీల్లోనూ భిన్నమైన వాతావరణం ఏర్పడింది.
వారసులు, సీనియర్లకు చాన్సిచ్చిన టీడీపీ..!
తెలుగుదేశం పార్టీకి.. అనంతపురం జిల్లా కంచుకోటగా ఉంది. గత ఎన్నికల్లో 14 సీట్లలో 12 చోట్ల టీడీపీ ఘన విజయం సాధించింది. రెండు చోట్ల స్వల్ప తేడాతోనే పరాజయం పాలయింది. జేసీ, పరిటాల వారసులు రంగంలోకి దిగడం ఈ సారి ప్రత్యేకత. కల్యాణదుర్గం, శింగనమల స్థానాల్లో కొత్త అభ్యర్థులను బరిలోకి దింపారు. కల్యాణదుర్గం నుంచి ఉమా మహేశ్వర్ నాయుడు, శింగనమల నుంచి బండారు శ్రావణి అవకాశం కల్పించారు. కల్యాణదుర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెబుతున్నారు. 35ఏళ్లుగా టీడీపీకి ఆ నియోజకవర్గంలో ఆయన పెద్ద దిక్కుగా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు యామినిబాల, చాంద్ బాషాకు కూడా అవకాశం ఇవ్వలేదు. మిగిలిన స్థానాల్లో పాత కాపులకే అవకాశం కల్పించారు.
ఒకే వర్గానికి పెద్ద పీట వేసిన వైసీపీ..!
అనంతపురంలో వైసీపీ పరిస్థితి విచిత్రంగా వుంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి పెద్ద పీట వేయడంతో మిగిలిన వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. 14 నియోజకవర్గాల్లో 12 చోట్ల రెడ్డి సామాజిక వర్గానికే అవకాశాలు కల్పించారు. రిజర్వుడు నియోజకవర్గం అయిన శింగనమల అభ్యర్థిగా ఉన్న పద్మావతి .. భర్తది రెడ్డి సామాజికవర్గం. అలాగే.. మడకశిర నియోజకవర్గం అభ్యర్థి తిప్పేస్వామి భార్య రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు. అనంతపురం అనంత వెంకటరామిరెడ్డి, గుంతకల్లు వెంకటరామిరెడ్డి, ఉరవకొండ విశ్వేశ్వర రెడ్డి, రాయదుర్గం కాపు రామచంద్రారెడ్డి, కల్యాణదుర్గం ఉషశ్రీ చరణ్ రెడ్డి, రాప్తాడు ప్రకాష్ రెడ్డి, తాడిపత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డి, ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, కదిరి సిద్దారెడ్డి, పుట్టపర్తి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిలకు అవకాశం ఇచ్చారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం మిగిలిన సామాజిక వర్గాలు తీవ్ర ఆవేదన, అసంతృప్తికి గురవుతున్నాయి. జిల్లాలో బలిజలు, చేనేతలు, వడ్డెర తదితర కులాలు పెద్ద సంఖ్యలో వున్నప్పటికీ వారికి తగిన గుర్తింపు ఇవ్వలేదు.
అభ్యర్థుల కోసం కాంగ్రెస్, జనసేన కూటమి వేట..!
జిల్లాలో కాంగ్రెస్ అనంతపురం ఎంపీ స్థానానికి రాజీవ్ రెడ్డి, హిందూపురం కేటీ ,కల్యాణదుర్గం, రఘువీరారెడ్డి, శింగనమల – శైలజానాథ్ , పుట్టపర్తి – కోటా స్వేత, హిందూపురం – బాలాజీ మనోహర్, రాయదుర్గం – చిన్నప్పయ్య, తాడిపత్రి – నాగిరెడ్డి, ధర్మవరం – రంగన్న అశ్వర్థనారాయణ, రాప్తాడు – జనార్థన్ రెడ్డి వంటి వారిని ఎంపిక చేశారు. రఘువీరారెడ్డి సూచించిన ఈ అభ్యర్థులనే పార్టీ అధిష్టానం ప్రకటించారు. జనసేన, కమ్యూనిస్టులు పూర్తి స్థాయి కసరత్తులు చేస్తున్నారు.