సుమారు నెలరోజుల తరువాత జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలనుకొంటున్న పిడిపి అధినేత్రి మహబూబా ముఫ్తీ నిన్న బీజేపీ మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం గురించి మాట్లాడారు. ఆమె మాటలలో బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అయిష్టత స్పష్టంగా కనబడింది. తన షరతులకు కేంద్రప్రభుత్వం అంగీకరించేమాటయితే తప్పసరి పరిస్థితులలో బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం గురించి ఆలోచిస్తాననట్లు ఆమె మాట్లాడారు.
“నా తండ్రి స్వర్గీయ ముఫ్తీ సాబ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం గురించి కన్న కలలను సాకారం చేయడం కోసమే నేను దీనికి నేను బీజేపీతో పొత్తులకు సిద్దపడుతున్నాను. ఆయన కూడా అయిష్టంగానే చాలా సాహసోపేతమయిన నిర్ణయం తీసుకొని బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ఆర్ధికాభివృద్ధికి, రాజకీయ సమస్యల పరిష్కారానికి, శాంతి నెలకొల్పడానికి మోడీ ప్రభుత్వం ఆయనకు ఏమేమి హామీలు ఇచ్చిందో వాటన్నిటినీ ఒక నిర్దిష్ట గడువులోగా యధాతధంగా అమలుచేయాలి. ఆర్టికల్స్-35(ఏ), 370లను కొనసాగించడం, బీఫ్ పై నిషేధం వంటి అంశాలపై ఇరు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందాలను కేంద్రప్రభుత్వం అమలుచేయాలి. రాష్ట్రంలో మరియు డిల్లీలో కొన్ని శక్తులు రాష్ట్ర ప్రభుత్వానికి నిత్యం కొన్ని సమస్యలు, వివాదాలు సృష్టిస్తున్నాయి. వాటిని ఎదుర్కోవడానికే ప్రభుత్వానికి సమయమంతా గడిచిపోతోందని గుర్తించాము. అటువంటి పరిస్థితులు మళ్ళీ ఏర్పడినట్లయితే మేము మా నిర్ణయంపై పునరాలోచించుకొంటాము,” అని తన పార్టీ నేతలతో నిన్న శ్రీనగర్ లో నిర్వహించిన సమావేశంలో చెప్పారు.
ఆమె చెపుతున్న రాష్ట్ర ఆర్ధికాభివృద్ధి కోసమే ప్రధాని నరేంద్ర మోడి బీహార్ ఎన్నికలు ముగియగానే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి 80 వేల కోట్ల ఆర్ధిక ప్యాకేజి ప్రకటించారని భావించవలసి ఉంటుంది. ఆ రాష్ట్రంలో అధికారం దక్కించుకోవాలనే తపనతో కేంద్రప్రభుత్వం పైకి తెలియని, చెప్పుకోలేని అటువంటి ఎన్ని రహస్య షరతులకు తలూపిందో తెలియదు కానీ వాటితో పిడిపి ఇంకా తృప్తి పడటం లేదనే విషయం మహబూబా ముఫ్తీ మాటల్లో స్పష్టంగా కనబడుతోంది. మళ్ళీ కొత్తగా ఆమె ఇంకెన్ని షరతులు విధించారో కూడా తెలియదు. ప్రస్తుతం ఆమె చెప్పదలచుకొన్నదేదో చెప్పారు. కనుక ఇప్పుడు బీజేపీతె దీనిపై నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.
ప్రభుత్వ ఏర్పాటు చేయకుండా ఆమె ఇంత జాప్యం చేస్తున్నందుకు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధికార ప్రతినిధి జునైద్ మట్టు తప్పు పట్టారు. రెండు పార్టీలు ఇంతవరకు ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నాయి. ఇప్పటికయినా బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలా వద్దా అనేది తేల్చుకొంటే మంచిది,” అన్నారు.
ఈ వారంలో ప్రధాని నరేంద్ర మోడితో ముఫ్తీ సమావేశం అవ్వాలనుకొంటున్నట్లుగా పిడిపి నేతలు చెపుతున్నారు. బహుశః ఇప్పటికే మోడీ ప్రభుత్వానికి సందేశం పంపించి ఉంటే నేడో రేపో బీజేపీ దీనిపై స్పందించవచ్చును. వాటి మధ్య అంగీకారం కుదిరితే త్వరలోనే మళ్ళీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పిడిపి-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావచ్చును.