హైదరాబాద్: ఇవాళ సాయంత్రంలోగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునుంచి సానుకూల స్పందన రాకపోతే శుక్రవారం ఆమరణ నిరాహారదీక్షకు దిగుతానని ముద్రగడ పద్మనాభం చెప్పారు. ఇవాళ ఒక న్యూస్ ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ, ప్రత్యక్షరాజకీయాలలో ఉండబోనని ముద్రగడ తెలిపారు. తమ ఉద్యమం ఏ పార్టీకి అనుకూలం కాదని చెప్పారు. వైసీపీ పార్టీకి అమ్ముడుబోయానన్న ఆరోపణలపై మాట్లాడుతూ, తాను అమ్ముడుపోయే వ్యక్తినా అని ప్రశ్నించారు. కావాలంటే కాణిపాకం వినాయకుడివద్దకు వచ్చి దీనిపై ప్రమాణం చేయటానికి సిద్ధంగా ఉన్నానని, చంద్రబాబు నాయుడు దీనికి సిద్ధమా అని అడిగారు. హోం మంత్రి చినరాజప్ప గురించి మాట్లాడుతూ, ఆయన హోంగార్డ్ను కూడా బదిలీ చేయలేరని అన్నారు. కొన్ని కార్యక్రమాలలో ఆయనను ప్రొటోకాల్ కూడా పట్టించుకోకుండా వెనక వరసలో కూర్చోబెడుతున్నారని చెప్పారు. కాపు జాతి అనేక అవమానాలకు గురవుతోందని అన్నారు. కాపులకోసం ప్రాణత్యాగాలకైనా సిద్ధమని ముద్రగడ చెప్పారు. కమిషన్ల ద్వారా బీసీల్లో చేర్చటమంటే కాపులు మరో జన్మ ఎత్తాల్సిందేనని ముద్రగడ అన్నారు. కాపుజాతి తన మాట జవదాటదని చెప్పారు.