ఓ ప్రముఖ దినపత్రికకు పవన్ కల్యాణ్ ఇచ్చిన ఇంటర్యూ సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని ఫినిష్ చేసేందుకు… బయట నుంచి జరుగుతున్న ప్రయత్నాలు, అందులో తనను భాగం చేసేందుకు జరిగిన చర్చల వివరాలను పవన్ కల్యాణ్… వివరించడం… రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీని తెలంగాణలో లేకుండా చేయడానికి చేయాల్సినంత చేశారు. ఆ తర్వాత ఏపీలోనూ లేకుండా చేయడానికి కూడా… భారీ కసరత్తే జరిగిందని… పవన్ కల్యాణ్ మాటల ద్వారా తెలిసిపోతోంది.
సంక్రాంతి పండుగ సమయంలో.. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పొత్తు పెట్టుకోవాలని… టీఆర్ఎస్ నేతలు తన వద్దకు రాయబారానికి వచ్చారని పవన్ కల్యాణ్ నేరుగానే ప్రకటించారు. ఆ విషయంపై.. అటు వైసీపీ కానీ.. ఇటు టీఆర్ఎస్ కానీ కిక్కురుమనలేదు. దాంతో అందరూ నిజమనే అనుకున్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్..ఆ చర్చల సారాంశం కూడా.. చెప్పుకొచ్చారు. ముందుగా.. జగన్, పవన్ కలిసి… టీడీపీని ఫినిష్ చేస్తే.. ఆ తర్వాత ఇద్దరూ.. తేల్చుకోవచ్చని సలహా ఇచ్చారట. అయితే… అలాంటి రాజకీయాలు తాను చేయబోనని… చెప్పానని పవన్ అంటున్నారు.
మొత్తానికి తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర విభజన చేసారన్న వాదన.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు పదే పేద వినిపిస్తూ ఉంటారు. ప్రస్తుత పరిణామాలు అదే నిరూపిస్తున్నారు. విభజన తర్వాత తెలంగాణలో టీడీపీని లేకుండా చేశారు. ఆ తర్వాత ఏపీపై గురి పెట్టారు. బీజేపీతో తెగతెంపులు చేసుకున్న తర్వాత… నాయకులపై గురి పెట్టారు. ఇప్పుడు… ఓ వైపు పొరుగు రాష్ట్రం నుంచి.. మరో వైపు కేంద్రం నుంచి నాయకత్వంపై తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. రాష్ట్రాలను చిన్నవి చేసి..బలంగా ఉండే పార్టీలను… నేతల్ని బయటకు లాగేసి.. ఆయా పార్టీలను.. కనుమరుగు చేసే వ్యూహం.. బీజేపీ ఈశాన్యరాష్ట్రాల్లో అమలు చేసి విజయం సాధించింది. ఇప్పుడు అదే పద్దతిని టీడీపీపై బీజేపీ, టీఆర్ఎస్ ప్రయోగిస్తున్నాయన్న అభిప్రాయం ఏర్పడుతోంది.