మెరుగైన సమాజం కోసం, ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడుతున్నాం అని చెప్పుకునే టీవీ చానెళ్లు ఎన్నికల వేళ ప్రవర్తిస్తున్న తీరు ప్రజలను విస్తుపోయేలా చేస్తోంది.
బస్సు కండక్టర్ కొడుకు కి, రైతు కూలీ కొడుకు కి టికెట్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్:
తాను కొత్త తరం రాజకీయాలు చేస్తానని, కొత్త తరం నాయకులను తయారు చేస్తానని పవన్ కళ్యాణ్ మొదట్లో వ్యాఖ్యానించినప్పుడు చాలామంది- అందరూ ఇలాగే చెబుతారు లే అనుకుంటూ లైట్ తీసుకున్నారు. కానీ తనకున్న పరిమితుల్లోనే వీలైనంతవరకు మంచి అభ్యర్థులను నిలబెడుతూ అందరినీ ఆశ్చర్యపరిచాడు పవన్ కళ్యాణ్. ఒక బస్ కండక్టర్ కొడుకైన గేదెల చైతన్య కు పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్, విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గానికి ఒక రైతు కూలీ కొడుకుకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి తాను మాటల మనిషిని కాను అని నిరూపించుకున్నాడు. ప్రత్యర్థి పార్టీల అభిమానులు సైతం అభినందించే పని పవన్ కళ్యాణ్ చేసినప్పటికీ మన తెలుగు మీడియా చానళ్లు ఈ వార్తను అసలే మాత్రం కవర్ చేయలేదు. చాలా మందికి సోషల్ మీడియా ద్వారానే ఈ అభ్యర్థుల వివరాలు తెలిశాయి.
ఇదే సంఘటన ఉత్తర భారతదేశంలోనో, పొరుగు రాష్ట్రంలోను జరిగి ఉంటే:
ఒకవేళ అ ఇదే పరిణామం ఉత్తర భారతదేశంలో కానీ మరేదైనా పొరుగు రాష్ట్రంలో కానీ జరిగి ఉంటే మీడియా స్పందన ఎలా ఉండేదో ఊహించవచ్చు. ఢిల్లీలో ఉన్న పార్టీ కానీ, లేదా ఉత్తర భారతదేశంలో ఉన్న ఏదో ఒక ప్రాంతీయ పార్టీ కానీ ఒక బస్ కండక్టర్ కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది అనుకుందాం. లేదంటే పొరుగున ఉన్న తమిళనాడు లో ఏదో ఒక పార్టీ ఒక రైతు కూలీ కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందనుకుందాం. దానికి మన తెలుగు మీడియా ఎలా ప్రతిస్పందిస్తుందో ఊహించండి – ఏ మాత్రం ధన బలం, అంగ బలం లేని అలాంటి సామాన్యుడి ని ఏరి కోరి ఒక ప్రాంతీయ పార్టీ అధినేత టికెట్ ఇచ్చాడంటూ పెద్ద పెద్ద కథనాలు ప్రసారం చేసి ఉండేవి, ఇంత సాహసం చేసే దమ్ము తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీకైనా ఉందా అంటూ వెనకాల బీభత్సమైన రీ రికార్డింగ్ తో కథనాలు తయారుచేసి ఉండేవి. బహుశా కథనాలు ప్రసారం చేయడంతో ఆగిపోకుండా, రెండు మూడు నిమిషాల టిడ్ బిట్ వీడియోలను కత్తిరించి రోజుకు రెండు సార్లు, మూడు సార్లు వాటిని ప్రసారం చేస్తూ “మెరుగైన సోసైటీ” కోసం ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఉండేవి. బహుశా ఇంకొక అడుగు ముందుకు వేసి, ఛానెళ్ల ప్రతినిధులను ఆ రాష్ట్రాల పంపి, ఆ అభ్యర్థుల ఇంటర్వ్యూలను తీసుకొని, వాటిని తెలుగులోకి అనువదించి మరీ ప్రసారం చేసి, మనల్ని మోటివేట్ చేసేవి. తెలుగు రాష్ట్రంలోని రాజకీయ పార్టీల ని , తెలుగు ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఆయా చానల్స్ చేస్తున్న కృషిని చూసి మనం మురిసి పోయే వాళ్ళం. కానీ తెలుగు రాష్ట్రంలో ఇది జరిగితే మాత్రం ఎటువంటి వార్త ఇవ్వలేదు.
శ్రీ రెడ్డి కి ఇచ్చిన స్క్రీన్ టైం లో వెయ్యో వంతు కూడా ఇవ్వరా?
ఒకసారి జబర్దస్త్ కామెడీ స్కిట్ లో కమెడియన్ ఒక చిన్న మాట తూలాడు. దాన్ని పట్టుకొని ఒక అగ్ర చానల్ శనివారం ఉదయం నాలుగు గంటల పాటు, మళ్లీ మధ్యాహ్నం నాలుగు గంటల పాటు, మరుసటి రోజు, అంటే ఆదివారం ఉదయం నాలుగు గంటల పాటు , ఆదివారం మధ్యాహ్నం నాలుగు గంటల పాటు – అంటే మొత్తం 16 గంటలపాటు దానిమీద చర్చాగోష్టి నిర్వహించింది. అది కూడా శనివారం నాడే ఆ కమెడియన్ సారీ చెప్పిన తర్వాత . ఆ సంఘటన తర్వాత కొంత కాలానికి తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సమస్య గురించి శ్రీరెడ్డి టీవీ ఛానల్స్ లో పదునైన వ్యాఖ్యలు చేసింది. మొదట్లో ఎంతోమంది ఆమె సమస్య పట్ల సానుభూతి చూపినప్పటికీ, తర్వాత తర్వాత తెరమీద జరుగుతున్నది ఏమిటో ప్రజలకు అర్థమైంది. తన సమస్య మీద ఎటువంటి పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా, పూర్తి ఆధారాలు బయట పెట్టకుండా ఈమె టీవీ చానల్స్ లో చర్చలు పెడుతోందని, సమస్య కి సంబంధం లేని వాళ్ళని ఒక వ్యూహం ప్రకారం పద్మవ్యూహంలోకి లాగినట్టుగా లాగడానికి ప్రయత్నిస్తోందని అర్థమయ్యాక ప్రజలకు ఆ కార్యక్రమంపై వెగటు పుట్టింది. ఒక రెండు నెలల సమయం లో ఈమెకు కేటాయించిన “స్క్రీన్ టైం” సుమారు 200 గంటలు. దానికి తోడు ప్రతి ఐదు నిమిషాలలో కనీసం రెండుసార్లు స్క్రోలింగ్ కనిపించేలా రోజంతా ఈవిడకు ” స్క్రీన్ స్పేస్ ” కేటాయించారు. అయితే ప్రజలకు ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తోంది ఏమిటంటే- వ్యవస్థ మారాలి, రాజకీయాలు మారాలి, అన్ని పార్టీలు మంచి అభ్యర్థులకు రాజకీయాల్లో స్థానం కల్పించాలి అంటూ తెగ లెక్చర్లు దంచే, తెగ డిబేట్ పెట్టే ఈ ఛానల్ లు, మన రాష్ట్రంలో ఒక పార్టీ ( అది ఏదైనా కానివ్వండి) సామాన్య వ్యక్తులకు టికెట్లు కేటాయించడం ద్వారా ఒక ఒక మంచి పని చేసినప్పుడు, అభినందించడం మాట దేవుడెరుగు, కనీసం ఆ వార్త నైనా ఇవ్వడం లేదు ఎందుకు అన్నది ఇప్పుడు ప్రజలని విస్మయానికి గురి చేస్తోంది. జబర్దస్త్ ప్రోగ్రాం ని తిట్టడానికి కేటాయించిన సమయంలో 1/100 వ వంతు అయినా, శ్రీ రెడ్డి కి ఇచ్చిన స్క్రీన్ టైం లో 1/1000 వ వంతు అయినా ఇలాంటి వార్తలకు మీడియా చానళ్లు కేటాయించకపోవడం బహుశా తెలుగు ప్రజల దురదృష్టం.
ఎన్నికలవగానే మళ్ళీ వచ్చి “రాజకీయాలు మారాలి” అంటూ డిబేట్ లు పెడితే ప్రజలు తిరగబడతారేమో?
ఏ ఛానల్ ఏ పార్టీకి వంతపాడుతున్నదనేది వారి ఇష్టం. అయితే అందరికీ నీతులు చెప్పే మీడియా చానళ్లు తాము కూడా కొన్ని విలువలను పాటించాలని ప్రజలు ఆశిస్తారు. సామాన్యులకు, ప్రత్యేకించి ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడిన సామాన్యులకు ఒక రాజకీయ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినపుడు, మీడియా ఛానల్స్ ఎంతో కొంత సానుకూల వ్యాఖ్యానాలు, కొంత కవరేజ్ ఇచ్చినట్లయితే, ఏమాత్రం ధన బలం అంగ బలం లేని ఆ అభ్యర్థులకు, ధన బలం అంగ బలం ఉన్న అభ్యర్థులతో పోటీ పడడానికి అది కాస్త సహాయపడుతుంది. అటువంటి సహాయం ఏదీ అందకపోతే ఇటువంటి అభ్యర్థులు ధన బలం కలిగిన అంగబలం కలిగిన అభ్యర్థులు చేతిలో ఓడిపోవచ్చు. అది ప్రజల లో కూడా ఎన్నికలల ప్రక్రియ మీద ఒక నిర్వేదాన్ని తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇలాంటి అభ్యర్థులను నిలబెట్టిన జనసేన పార్టీని ఈ చానల్స్ బలపరచకపోయినప్పటికీ కనీసం అటువంటి అభ్యర్థుల వరకు అయినా కొంత పాజిటివ్ వార్తలను కవర్ చేస్తే అది ప్రజాస్వామ్యానికి కూడా మంచి చేస్తుంది. అత్యంత కీలకమైన ఎన్నికల సమయంలో ఎలాంటి సహాయం చేయకపోగా , మళ్లీ ఎన్నికలయిపోగానే ఇవే చానల్స్ ఎగేసుకుంటూ వచ్చి “రాజకీయాలు మారాలి, వ్యవస్థ మారాలి, పార్టీలు మంచి అభ్యర్థులను నిలబెట్టాలి” అంటూ నీతులు చెప్పినా, డిబేట్ లు పెట్టినా ప్రజలకు వీరిని చెప్పు తో కొట్టాలి అన్నంత కోపం రావచ్చు ( ఈ పద ప్రయోగం ఇక్కడ కేవలం ఉపమాలంకారం గా వాడబడింది).
మొత్తం మీద:
తెలుగు ఛానెల్స్ ప్రవర్తిస్తున్న తీరు వల్ల ఇప్పటికే ప్రజలు చానల్స్ మీద పూర్తిగా నమ్మకం కోల్పోయారు. ఎన్నికల వేళ టీవీలకు అతుక్కుపోయి ఉండాల్సిన ప్రజలు వార్తల కోసం సోషల్ మీడియా మీద ఆధార పడుతున్నారు. ప్రజలలో నమ్మకాన్ని పునరుద్ధరించుకోవాలంటే కనీసం రాబోయే రెండు వారాలైనా మీడియా చానళ్లు నిష్పక్షపాతంగా వార్తలు అందించాల్సి ఉంటుంది.
– జురాన్ (@CriticZuran)