తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుట్రలకు తెర లేపారని.. మూడు రోజుల్లో రాష్ట్రంలో దహనం జరగబోతోందని.. ఈ మేరకు.. టీడీపీ శ్రేణులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని… వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కడప జిల్లా పులివెందులలో ఆయన అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. చంద్రబాబుపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. టీడీపీకి డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని.. అందుకే మూడు రోజుల్లో భారీ కుట్రలకు టీడీపీ అధినేత తెరలేపారని విమర్శించారు. మూడు రోజుల్లో రాష్ట్రాన్ని దహనం చేయడానికి సిద్దంగా ఉండాలంటూ.. తన క్యాడర్‌కు చంద్రబాబు ఆదేశాలిచ్చారని జగన్ చెబుతున్నారు. వైసీపీలో పెద్ద నాయకులెవరూ లేకుండా అరెస్టులు చేయాలనుకుంటున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. వైఎస్ వివేకా హత్యపైనా… అవే ఆరోపణలు చేశారు. చంద్రబాబునే హత్య చేయించారని ఆరోపించారు.
ముందస్తు ఆరోపణలు చేసి ప్లాన్ వర్కవుట్ చేయడం జగన్ వ్యూహం..!
జగన్ వ్యాఖ్యలు రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. జగన్ రాజకీయ వ్యూహం … ఇలాంటి విషయాల్లో చాలా పక్కాగా ఉంటుందని… టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ముందుగా…జగన్ తాను ఏదైనా చేయాలనకుంటే.. అలా చేసేందుకు టీడీపీ.. కుట్రలు చేస్తోందని ఆరోపిస్తారు. ఆ తర్వాత మిగిలిన పనులు పూర్తి చేస్తారు. కొద్ది రోజుల కిందట.. టీడీపీ పెద్ద ఎత్తున ఓట్లు తీసేస్తోందని… ప్రచారం చేశారు. ఈసీకి పదే పదే ఫిర్యాదులు చేసి హడావుడి చేశారు. తీరా… ఆ ఓట్లన్నీ తొలగించడానికి వైసీపీనే పెద్ద ప్రణాళిక వేసింది. లక్షల సంఖ్యలో ఫామ్-7లు పెట్టించారు. ఒక వేళ.. అవన్నీ ఫేక్ అని గుర్తించకపోతే.. సరైన పరిశీలన లేకుండా.. ఓట్లు తీసేసి ఉండేవారు. ఎందుకంటే.. ఇలాంటి ఫామ్-7దరఖాస్తులను.. క్షేత్ర స్థాయి సిబ్బంది పెద్దగా పరిశీలించకుండానే ఆమోదిస్తారు. ఆ తర్వాత డేటా చోరీ విషయంలోనూ దాదాపుగా ఇదే జరిగింది. టీడీపీపై ముందుగా ఆరోపణలు చేశారు. ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తెలంగాణ పోలీసుల సాయంతో యాక్షన్ ప్రారంభించారు. వివేకా హత్య విషయంలోనూ.. అదే జరిగింది. మొదట గుండెపోటుగా నమ్మించే ప్రయత్నం చేసినా.. చివరికి హత్య అని నిర్దారణ కావడంతో.. చంద్రబాబుపై నెట్టేసి.. నిర్మోహమాటంగా ఆరోపణలు చేస్తున్నారు.
మూడు రోజుల్లో అదే జరగబోతోందా..?
మొదటి నుంచి వైసీపీ వ్యూహం అలాగే ఉంది. తాము చేయాలనుకున్న వ్యవహారాలను టీడీపీకి అంటగట్టి ఆరోపణలు చేసి… చేసేస్తారు. అలా జరిగిపోయిన వాటిని టీడీపీ మీదకు నెట్టేస్తారు. తమకు సంబంధం లేదని నిరూపించుకోవడానికి టీడీపీ తంటాలు పడుతుంది. ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో ఇవే కీలకం అని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. ముందు ఒక ఎలిబీ సృష్టించుకుంటారని.. తర్వతా చెయ్యాలనుకున్ని చేస్తారు. ఆ తర్వాత తాను ముందే చెప్పానని.. . టీడీపీ అలా చేస్తుందని… ప్రకటనలతో హోరెత్తిస్తారు. ఆ వెంటనే బీజేపీ కూడా అదే రాగం అందుకుంటుంది. ఇటీవల.. డేటా చోరీ, ఓట్ల తొలగింపు, వివేకా హత్య కేసుల్లో బీజేపీ వైసీపీ వాదననే గట్టిగా వినిపించింది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కొత్తగా… మూడు రోజుల్లో రాష్ట్రం దహనం అనే కొత్త ఆరోపణలు చేస్తూండటంతో… టీడీపీ నేతలు అప్రమత్తమవక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.
వివేకా హత్య కేసులో సిట్ విచారణపై ప్రభావం చూపడానికా..?
అయితే.. జగన్ మూడు రోజుల్లో దహనం అంటూ చేసిన వ్యాఖ్యల వెనుక.. మరికొన్ని వ్యూహాలు ఉన్నాయంటున్నారు. వివేకా హత్య కేసులో.. పోలీసుల దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే పాత్రధారుల్ని అదుపులోకి తీసుకున్నారు. కీలక సాక్ష్యాల్ని సేకరించారు. ఇందులో.. జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడైన.. దేవిరెడ్డి శంకర్ రెడ్డి అనే వ్యక్తి కూడా ఉన్నారు. ఈయన ప్రతి ఎన్నికలోనూ.. జగన్మోహన్ రెడ్డికి డమ్మీగా నామినేషన్ వేస్తూంటారు. ఈ సారి కూడా.. ఆర్జేడీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ పరిణామాలతో వివేకా హత్య కేసులో అసలు గుట్టు అంతా బయటకు వస్తుందన్న ఉద్దేశంతో.. జగన్మోహన్ రెడ్డి… ముందస్తుగా.. ఇలాంటి హెచ్చరికలు చేస్తున్నారని.. దాన్ని చంద్రబాబుపై నెట్టేందుకు ముందస్తున్న ఆరోపణలు చేస్తున్నారన్న అభిప్రాయాలు టీడీపీ నేతల నుంచి వ్యక్తమవుతున్నాయి.