లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్ కు ఉన్నత వర్గాల్లో, విద్యావంతుల్లో, ఆదర్శనీయమైన రాజకీయాలను కోరుకునే ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. జేపీ చెప్పే గుడ్ పోలిటిక్స్ గురించి అందరూ చాలా ఆసక్తిగా వింటారు. చప్పట్లు కొడతారు. ఆయనకు సన్మానాలు చేస్తారు. ఆయన మేధస్సును కీర్తిస్తారు. కానీ పోలింగ్ రోజు వచ్చే సరికి తమ ఓటు మాత్రం సాంప్రదాయ పార్టీలకే దాఖలు చేస్తారు. ఇది అలవాటుగా జరుగుతూ ఉన్నదే. ఎన్నికల వ్యవస్థను, ఎన్నికల్లో అక్రమాలను సంస్కరించగలిగితే.. యావత్తు దేశంలో ఉండే సకల అరాచకపోకడలను కూడా సంస్కరించినట్లే అని జేపీ తొలినుంచి వాదిస్తూనే ఉన్నారు. ఈ వాదన అందరికీ నచ్చుతుంది. కానీ ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. ఆయన వాదనకు మద్దతు దక్కడం లేదు. తాజాగా కూడా అంతగా విలువలేని గ్రేటర్ ఎన్నికల కోసం అభ్యర్థులను గెలుపు గుర్రాల్లాగా మారుస్తున్నారని… చాలా విపరీతంగా ఖర్చు పెడుతున్నారని జేపీ విమర్శలు సంధించారు. అయితే.. కాలక్రమంలో.. జేపీ ప్రవచించే నీతులకు విలువ తగ్గిపోతున్నదా అనే అభిప్రయాలు ప్రజల్లో వ్యక్తమౌతున్నాయి.
జేపీ మేధస్సు, ఆయన నిజాయితీ, చిత్తశుద్ధి విషయంలో ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలూ లేవు. అయితే ఒక రాజకీయ పార్టీగా లోక్ సత్తా పని చేస్తున్న తీరు మీద కూడా జనానికి నమ్మకం కలగడం లేదు. జేపీ తన పాత్రను ఇప్పుడు కేవలం వ్యవస్థాపకులు అనే హోదాకే పరిమితం చేసుకున్నారు. దాంతో ఒక్కసారిగా లోక్ సత్తా వీక్ అయిపోయినట్లుగా కనిపిస్తోంది.
కాస్తలోతుగా పరిశీలిస్తే.. లోక్ సత్తా ఒక ఉద్యమంగా ఉన్నంత కాలం చాలా క్రేజ్ ఉండేది. రాజకీయ పార్టీ అవతారం ఎత్తిన తర్వాత.. వారికి కూడా ఆపద్ధర్మంగా.. అడ్డదారులు తొక్కక తప్పడం లేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ అయి చట్టసభకు వెళ్లాలని ఉవ్విళ్లూరిన జేపీ తెలుగుదేశం భాజపా కూటమిలో కలవడానికి చివరికి ప్రయత్నించి భంగపడిన సంగతి అందరికీ తెలుసు. చివరికి మల్కాజ్ గిరి బరిలో దిగి.. ఒకవైపు మోడీ ఫోటోను తాను కూడా వాడుకుంటూ ఆయన ఎన్నికల ప్రచారం చేసుకున్నారు. అయినా వ్రతం చెడింది గానీ ఫలితం దక్కలేదు. అప్పటినుంచి ఆయన రాజకీయ చిత్తశుద్ది మీద జనానికి నమ్మకం పోయింది. ఇప్పుడు వా మపక్షాలతో కలిసి మళ్లీ పాలక పార్టీలను తూలనాడుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల సంస్కరణల కోసం పోరాడే ఉద్యమంగా లోక్ సత్తా రూపురేఖలు ఇప్పుడు అంతరించిపోయాయి. సాధారణ పార్టీల గాడిలోనే కొంచెం భిన్నంగా నడుస్తున్నట్లు మాత్రమే కనిపిస్తోంది. ఇలాంటి ఎప్రోచ్ తో ఆయన కొత్తగా ఓటర్లను ఆకర్షించి.. నెగ్గడం అనేది ఎలా సాధ్యమవుతుంది? అని పలువురు సందేహిస్తున్నారు.