తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్ని కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే ఎదుర్కొంటుందనే వాతావరణమే ఉంది. ఏ పార్టీలతోనూ పొత్తులకు ఇంతవరకూ అధికారికంగా ప్రయత్నించింది లేదు. కారణం… అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, టీజేఎస్ లతో కలిసి పోటీ చేసి, ఘోర పరాజయం మూటగట్టుకుంది. టీడీపీతో పొత్తు పెట్టుకోవడమే కాంగ్రెస్ ఓటమికి కారణమనే విమర్శలూ విశ్లేషణలూ చర్చలూ చాలానే జరిగాయి. దీంతో లోక్ సభ ఎన్నికల్లో ఒంటరి పోరు ఉత్తమమని పార్టీ భావించింది. కానీ, ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీతో స్నేహానికి కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల్లో టీటీడీపీ ఏ రకంగా పోటీకి వెళ్తుందనే అంశంపై మీడియాతో రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ లోక్ సభ స్థానాలకు పోటీకి సంబంధించి అక్కడే చర్చించి నిర్ణయం తీసుకోవాలనీ, అందరితో మాట్లాడాలి ఎలా ముందుకు వెళ్తే బాగుంటుందో మీరే చర్చించుకోవాలని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సూచించారని చెప్పారు. దాని ప్రకారమే జిల్లా స్థాయి అధ్యక్షులతో పాటు, పార్టీ విభాగాల నుంచి అధ్యక్షుడు రమణ సలహాలు తీసుకున్నారని చెప్పారు. ఏయే స్థానాల్లో పోటీకి దిగితే బాగుంటుందనే అంశంపై కూడా ఒక నిర్దిష్టమైన నిర్ణయానికి వచ్చే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. సీపీఐ తమను అధికారికంగానే సంప్రదించిందనీ, కూటమిని కొనసాగించాలని ఆ పార్టీ సూచించిందనీ, దానికి తామూ సానుకూలంగా ఉన్నామన్నారు. అన్ని స్థానాల్లో సొంతంగా పోటీ అని కాంగ్రెస్ ప్రకటించినా… రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియా, ఎల్ రమణతో తాజాగా మాట్లాడారని రావుల చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తమతో ఇదే అంశమై చర్చించారన్నారు. ఈ చర్చలు కొనసాగుతాయని కూడా రావుల చెప్పారు.
అయితే, నామినేషన్లు వేసేందుకు గడువు చాలా తక్కువ ఉన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన కూడా చేస్తోంది. ఇప్పుడు టీడీపీతో ఇంకా చర్చించేందుకు కాంగ్రెస్ దగ్గర ఎక్కడ సమయం ఉంది? పైగా, టీడీపీతో పొత్తు వల్లనే అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోయామని చాలామంది కాంగ్రెస్ నేతల్లో అభిప్రాయం ఉంది. ఇలాంటప్పుడు కుంతియాగానీ, ఉత్తమ్ గానీ మళ్లీ మహా కూటమిని కొనసాగిద్దామంటే సొంత పార్టీ నుంచే వ్యతిరేకత రావొచ్చు. అధికార పార్టీ తెరాసకు మరోసారి బలమైన విమర్శనాస్త్రాన్ని చేజేతులా అందించినట్టే అవుతుంది. నామినేషన్ల గడువు దాదాపు ముగుస్తున్న సమయంలో మొదలైన ఈ చర్చలు ఏమౌతాయో చూడాలి.