నరసాపురం ఎంపీ గా నాగబాబును పోటీకి నిలబెట్టిన పవన్ కళ్యాణ్, అందుకు గల కారణాలను ఈరోజు భీమవరం బహిరంగ సభలో ప్రజలకు వివరించారు. ఇటు భీమవరం అటు నరసాపురం రెండు స్థానాలలో జనసేన ను గెలిపించాలని ప్రజలకు విన్నవించుకున్నారు.
జనసేన పార్టీలో ఆ మధ్య విష్ణు రాజు చేరిన సంగతి తెలిసిందే. బి.వి.ఆర్ ఫౌండేషన్ ద్వారా వీరి కుటుంబం చేసిన సేవా కార్యక్రమాల కారణంగా విష్ణు రాజు మీద కూడా ప్రజలకు ఇక్కడ మంచి అభిప్రాయం ఉంది. అలాగే విష్ణు రాజు కళాశాలలు అత్యున్నత ప్రమాణాలను పాటిస్తాయని అందరూ చెబుతూ ఉంటారు. విద్యారంగంలోనూ, చారిటీ లోనూ విష్ణు రాజు చేస్తున్న కార్యక్రమాలు నచ్చి పవన్ కళ్యాణ్ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన పార్టీలో చేరగానే ఆయనకు భీమవరం టికెట్ కానీ నర్సాపురం ఎంపీ టికెట్ కానీ ఇస్తారని రూమర్లు వచ్చాయి. అయితే ఉన్నట్టుండి ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని, కేవలం పార్టీకి సలహాదారుగా ఉంటానని వ్యాఖ్యానించారు. అయితే హైదరాబాద్ లో కాలేజీలో, ఆస్తులు కలిగిన ఈయనను టీఆర్ఎస్ నేతలు బెదిరించడం వల్లే ఈయన ప్రత్యక్ష ఎన్నికల నుండి తప్పుకున్నారని సోషల్ మీడియాలో రూమర్లు వచ్చాయి. ఏది ఏమైనా ఈయన పోటీ కి కాకుండా కేవలం పార్టీ కార్యక్రమాలకు పరిమితమై పోయారు.
అయితే ఈరోజు భీమవరంలో నామినేషన్ వేయడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ తన హెలికాప్టర్ తో నేరుగా రాజు కాలేజీలో దిగారు. అక్కడ విష్ణు రాజు సిబ్బంది పూర్ణకుంభం తో పవన్ కళ్యాణ్ కి ఘనంగా ఆహ్వానం పలికారు. ఆ తర్వాత భీమవరం సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ విష్ణు రాజు పై ప్రశంసల వర్షం కురిపించారు. జనసేన అధికారంలోకి వస్తే అన్ని గవర్నమెంట్ కాలేజీలను విష్ణు రాజు కాలేజీల స్థాయిలో అభివృద్ధి చేస్తామని వ్యాఖ్యానించాడు. ఆయన చేస్తున్న కార్యక్రమాలు తనకు నచ్చి ఆయనను పార్టీలోకి ఆహ్వానించాను అని చెప్పాడు. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని రాజు చెప్పాక తాము నరసాపురం స్థానానికి మరొక అభ్యర్థిని వెతుక్కోవాల్సి వచ్చింది అని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే కొంతమంది నాయకులు ముందుకు వచ్చినప్పటికీ తాము వారిని ఎంపిక చేయలేదని, అదే సమయంలో తాము మంచివారు అనుకుని అడిగిన నాయకులేమో తమకు అంత ధన బలం లేదని అన్నారు అని చెప్పుకొచ్చారు. మీరు ఏమి డబ్బు ఖర్చు పెట్టుకోవలసిన అవసరం లేదని, డబ్బులు అవసరం లేకుండానే రాజకీయాలు చేద్దామని వారికి తాను చెప్పినప్పటికీ వారు ముందుకు రాలేకపోయారు అని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో తను నాగబాబు కు ఫోన్ చేసి నరసాపురం నుండి ఎంపీగా పోటీ చేయాలని కోరినట్లు చెప్పుకొచ్చారు.
నాగబాబు “లా” చదివారని, మద్రాసు కౌన్సిల్ లో రిజిస్టర్డ్ లాయర్ అని చెప్పుకొచ్చారు. చిన్నతనంలో తనను ఎన్నో విధాలుగా మోటివేట్ చేశాడని, ఆయనలోని సామాజిక స్పృహ తనలో రాజకీయ బీజాలు పడడానికి కారణం అయిందని పవన్ కళ్యాణ్ వివరించారు. అదే సమయంలో వైఎస్సార్సీపీ తరపున పోటీ చేస్తున్న రఘురామ కృష్ణంరాజు పై పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు. కావాలనే,” తెలుగుదేశం పార్టీ ఎంపీగా పోటీ చేస్తున్న రఘురామకృష్ణంరాజు” అంటూ వ్యాఖ్యానించారు. మళ్లీ కొంత పాజ్ ఇచ్చి, ఆయన ఈ మధ్య వైసీపీలోకి మారిపోయాడు కదూ అంటూ చురకలంటించారు. “అయినా, జగన్ ని ఎన్నో తిట్లు తిట్టేవాడు కదా” అంటూ పరోక్షంగా ఆయన జగన్ ని తిట్టిన విధానాన్ని గుర్తుచేశాడు. నాగబాబు కు ఓటు వేసి గెలిపించాల్సింది గా ప్రజలను కోరిన పవన్ కళ్యాణ్, క్రితం ఎన్నికల్లో మీరందరూ కలిసి గంగ రాజు ని గెలిపించారని, ఈసారి మన పార్టీ అభ్యర్థి అయిన నాగబాబు గెలిపించుకుందాం అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించాడు.
మరి నాగబాబు రాజకీయ భవితవ్యం ఎలా ఉంటుందనేది మే నెలలో తెలుస్తుంది.